Trichambaram Sree Krishna Temple Kerala:  ఇంట్లో ఆయినా, ఆలయంలో అయినా దీప, ధూప, నైవేద్యాలు ఓ క్రమ పద్ధతిలో సమర్పిస్తారు. షోడసోపచార పూజలు చేస్తారు. అభిషేకాలు నిర్వహిస్తారు. అయితే కేరళ త్రిచంబరంలో ఉన్న కృష్ణుడి ఆలయంలో పద్ధతి ఇందుకు పూర్తి భిన్నంగా సాగుతుంది. ఇక్కడ కన్నయ్యకు ముందు నైవేద్యం సమర్పించేస్తారు..ఆ తర్వాతే పూజలు చేస్తారు..


ఉగ్రరూపంలో కృష్ణుడు 


శ్రీ కృష్ణుడి రూపం అత్యంత మధురంగా కన్నులపండువగా ఉంటుంది. కానీ..త్రిచంబరం ఆలయంలో కృష్ణుడు రుద్రుడిలా కనిపిస్తాడు. ఇలా కనిపించడం వెనుక ఓ పురాణగాథ చెబుతారు. మేనమామ అయిన కంసుడిని సంహరించి వచ్చిన తర్వాత...రుద్ర భంగిమలో కూర్చుంటాడు. తన దగ్గరకు వచ్చిన తల్లి దేవకితో..ఆకలిగా ఉంది అన్నం పెట్టమన్నాడట. అందుకే ఇప్పటికీ గుడి తలుపులు తెరిచిన వెంటనే అర్చకులు ముందుగా కృష్ణుడికి నైవేద్యం సమర్పించేసి ఆ తర్వాతే పూజలు నిర్వహిస్తారు.  


ఏనుగులు కనిపించవు


కేరళలో ఏ ఆలయానికి వెళ్లినా ఏనుగులు కనిపిస్తుంటాయి. కానీ.. త్రిచంబంరంలో ఏనుగుల జాడ కూడా ఉండదు. ఈ ఆలయ పరిసరాల్లోకి ఏనుగులకు ప్రవేశం లేదు. ఎందుకంటే..కృష్ణుడికి చంపేందుకు కంసుడు..కువలయా అనే ఏనుగుని పింపించాడట. అందుకే ఇక్కడ కొలువైన కృష్ణుడికి ఎనుగుల సామీప్యత అంటే ఇష్టం ఉండదని చెబుతారు.  


Also Read: శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు ఇంట్లోనే ఇలా పూజ చేసుకోండి!


ఏటా 15 రోజుల పాటూ ఉత్సవాలు


ఏటా మార్చి లో ఇక్కడ రెండు వారాల పాటూ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ కృష్ణ బలరామ విగ్రహాలను ఊరేగిస్తారు. ఈ సమయంలో తిడంబు అనే నృత్యం చేస్తారు. తిడంబు నృత్యం...కేరళ రాష్ట్రంలో ప్రదర్శించే ఓ ప్రత్యేక నృత్యం. ఈ కళారూపం సాధారణంగా ఉత్తర మలబార్ ప్రాంతంలో  దేవాలయాల్లో కనిపిస్తుంది.


Also Read: కురుక్షేత్ర సంగ్రామ సమయంలో శ్రీ కృష్ణుడి విశ్వరూపాన్ని చూసిన అర్జునుడి మానసిక స్థితి!


తిడంబు నృత్యం చాలా ప్రత్యేకం


ఈ నృత్యంలో భాగంగా దేవత ప్రతిమను తలపై మోస్తూ చేసే సొగసైన నృత్యం. సాధారణంగా నంబూతిరిచే నిర్వహించే ఈ నృత్యాన్ని  హవ్యక, శివల్లి , కర్హడే వంటి ఇతర బ్రాహ్మణ సంఘాలు కూడా ప్రదర్శిస్తుంటాయి. 700 సంవత్సరాల క్రితం నుంచి ప్రదర్శితమవుతోన్న తిడంబు నృత్యం..కర్ణాటక నుంచి ఉత్తర కేరళకు వలస వచ్చిన తులు బ్రాహ్మణులు తీసుకొచ్చారు.  కర్ణాటకలో ఈ కళారూపాన్ని దర్శన బలి అని కేరళలో తిడంబు అని పిలుస్తారు. తలపై ధరించే దేవతారూపం పూర్తిగా వెదురుతో తయారుచేస్తారు.. సుమారు 10 కిలోల బరువుంటుంది. తిడంబు నృత్యం ప్రదర్శించే కళాకారులు  ప్రత్యేకమైన దుస్తులు , చెవిపోగులు,  బ్యాంగిల్స్, నెక్లెస్‌లతో అలంకరించుకుంటారు. ఉష్ణిపీఠం అని పిలిచే తలపాగాను కూడా ధరిస్తారు. దశాబ్ధాలు గడిచేకొద్దీ నృత్యరూపంలో చాలా మార్పులొచ్చాయి. ఇందులో ప్రధాన ప్రదర్శకుడితో పాటు కళాకారుల బృందంలో ఉండే ఐదుగురు పెర్కషన్ వాయిద్యాలను వాయిస్తారు..మరో ఇద్దరు నృత్యకారుల దీపాలను మోస్తారు. ఈ నృత్యాన్ని ప్రదర్శించే కళాకారులు భావోద్వేగ వ్యక్తీకరణలు చేయకూడదు.  


Also Read: శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మీ బంధు, మిత్రులకు ఇలా తెలియజేయండి!