Hanuman ji: హిందూ సంప్రదాయాల ప్రకారం హనుమంతుడు చిరంజీవి. ఆయన ఇప్పటికీ జీవించి ఉన్నాడు. అందుకే ఆంజనేయస్వామి తన భక్తులను రక్షిస్తాడని, తనను భక్తితో పూజిస్తే వారి కష్టాలను తొలగిస్తాడని చెబుతారు. మరి వివిధ రూపాల్లోని ఆంజనేయస్వామని పూజిస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం.
పంచముఖ ఆంజనేయుడు
మహిరావణుడు నుంచి రామ-లక్ష్మణులను విడిపించడానికి, హనుమంతుడు పంచముఖ రూపాన్ని ధరించాడు. ఐదు దీపాలను ఒకేసారి ఆర్పేస్తే మహిరావణ సంహారం జరుగుతుందనే నమ్మకంతో హనుమంతుడు పంచముఖ రూపాన్ని ధరించాడు. ఉత్తరాన వరాహ ముఖం, దక్షిణాభిముఖంగా నరసింహుడు, పశ్చిమాభిముఖంగా గరుడుడు, ఆకాశం వైపు హయగ్రీవుడు, తూర్పున హనుమంతుడి రూపాలతో పంచముఖ ఆంజనేయస్వామి దర్శనమిస్తాడు. వాస్తు శాస్త్రం ప్రకారం, పంచముఖ హనుమంతుని విగ్రహాన్ని ఉంచిన ఇంట్లో, పురోగతికి ఎదురయ్యే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి, వారి సంపద పెరుగుతుంది.
Also Read : Hanuman Puja: హనుమంతుడు తన భక్తులను 10 రకాల కష్టాల నుంచి రక్షిస్తాడు
మీ ఇల్లు ప్రతికూల శక్తులచే ప్రభావితమైందని మీకు అనిపిస్తే, మీరు పంచముఖ హనుమంతుని చిత్రాన్ని ప్రధాన తలుపు పైన ఉంచడం లేదా అందరికీ కనిపించే ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తి ప్రవేశించదు. దీని కారణంగా, శని కారణంగా ఎదురయ్యే అన్ని రకాల అడ్డంకులు కూడా మీ జీవితానికి దూరంగా ఉంటాయి.
ఏకాదశ హనుమాన్
హనుమంతుడిని శివుని పదకొండవ అవతారంగా భావిస్తారు. పదకొండు ముఖాలు కలిగిన కల్కర్ముఖ్ అనే భయంకరమైన బలమైన రాక్షసుడిని చంపడానికి, హనుమంతుడు తన సైన్యంతో కలిసి చైత్ర పూర్ణిమ (హనుమాన్ జయంతి) రోజున శ్రీరామచంద్రుడి ఆదేశానుసారం పదకొండవ ముఖాలున్న రూపాన్ని ధరించి చంపాడు. ఏకాదశ, పంచముఖ హనుమాన్ ఆరాధన అన్ని దేవతలను పూజించిన ఫలితాన్ని ఇస్తుంది.
వీర హనుమాన్
పేరులోనే ఉన్నట్టుగా హనుమంతుని విగ్రహాన్ని ఈ పేరుతో పూజించడం వలన ఆ వ్యక్తికి జీవితంలో ధైర్యం, బలం, పరాక్రమం, విశ్వాసం అందించడం ద్వారా వారి రోజువారీ పనులలో ఎదురయ్యే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.
రామభక్త హనుమాన్
శ్రీరాముడిని పూజిస్తున్న హనుమంతుని చిత్రం లేదా విగ్రహాన్ని మనమందరం చూసే ఉంటాం. ఈ చిత్రాన్ని లేదా విగ్రహాన్ని పూజించడం వల్ల జీవిత లక్ష్యాలను సాధించడంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. అదే సమయంలో, వారు చేసే ప్రతి పనిలో ఏకాగ్రత, అభిరుచిని అందించడానికి ఈ భక్తి తోడ్పడుతుంది. ఈ విగ్రహం లేదా చిత్రంలో, హనుమంతుడు భక్తితో రాముడిని పూజిస్తున్నట్లు కనిపిస్తాడు.
దాసాంజనేయస్వామి
శ్రీరామచంద్రమూర్తి పాదాల వద్ద కూర్చుని ఉన్న భంగిమలో ఉండే విగ్రహం లేదా చిత్రంలో కనిపించే హనుమంతుడిని దాసాంజనేయస్వామి అంటారు. హనుమంతుడు శ్రీరాముడి సేవకుడు, రామచంద్రమూర్తి ఆజ్ఞాపిస్తే అమలు చేయడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. దాసాంజనేయుడి ఆరాధన ఒక వ్యక్తిలో సేవ, అంకిత భావాన్ని పెంపొందిస్తుంది. ధర్మం, పని, సంబంధాల పట్ల అంకితభావం పెరుగుతుంది. సేవ చేయడం ద్వారా మాత్రమే విజయం సిద్ధిస్తుంది.
Also Read : ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన దేవుడి ఫొటో ఇది!
సూర్యముఖ హనుమాన్
పురాణాలు, గ్రంధాల ప్రకారం హనుమంతుని గురువు సూర్యదేవుడు. సూర్యుడు తూర్పున ఉదయించడం ద్వారా ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తాడు. సూర్యముఖ హనుమంతుని ఆరాధన.. జ్ఞానం, అభ్యాసం, కీర్తి, పురోగతి, గౌరవాన్ని ఇస్తుంది. సూర్యముఖ హనుమంతుడిని తూర్పు ముఖంగా ఉన్న హనుమంతుడు అంటారు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.