YS Viveka Case :  వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ మంజూరు చేసిన ముందస్తు బెయిల్ పై వైఎస్ సునీత రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  వివేకా కేసులో సీబీఐ మోపిన అభియోగాలను హైకోర్టు సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదన్నారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులో లోపాలు ఉన్నాయన్నారు. అవినాష్ పై మోపిన అభియోగాలన్నీ తీవ్రమైనవి  సునీత రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. బుధవారం సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు ఈ పిటిషన్ పై విచారణకు జరిగే అవకాశం ఉంది.


వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి   తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్  ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.   అవినాష్ దాఖలు చేసిన పిటిషన్ పై పలు దఫాలుగా సుధీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం..షరతులతో కూడి బెయిల్ ఇచ్చింది. ప్రతి శనివారం  సీబీఐ విచారణకు హాజరుకావాలని చెప్పింది. అనుమతి లేకుండా దేశం విడిచి పెట్టి వెళ్లరాదని సూచించింది.   మే 22న అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉండగా హాజరుకాలేదు. తన తల్లికి హెల్త్ బాగ లేదని విచారణకు  రాలేనని సీబీఐని గడువు అడిగిన సంగతి తెలిసిందే.. కర్నూలులోని విశ్వభారతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అవినాష్ రెడ్డి తల్లికి  చికిత్స అందించారు.  ఆ సమయంలో అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నారు. హైకోర్టులో రిలీఫ్ వచ్చే వరకూ ఆయన కర్నూలు ఆస్పత్రి.. హైదరాబాద్ ఆస్పత్రిలోనే ఉన్నారు. రిలీఫ్ వచ్చిన తర్వాతనే వెళ్లారు. గత శనివారం హైకోర్టు విధించిన షరతులకు అనుగుణంగా సీబీఐ ఎదుట హాజరయ్యారు. 


మంగళవారం సీబీఐ కోర్టులో  అవినాష్ రెడ్డి  తండ్రి భాస్కర్ రెడ్డి   బెయిల్ పిటిషన్‌  పై మంగళవారం సీబీఐ కోర్టు లో విచారణ జరింగి.  భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయకూడదని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. కాగా భాస్కర్ రెడ్డి తరపున న్యాయవాది ఉమా మహేశ్వర్ రావు వాదనలు వినిపించారు.  భాస్కర్ రెడ్డి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇదే కేసులో అవినాష్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ తీర్పును న్యాయవాది ప్రస్తావించారు.  వివేకా హత్య కేసులో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని సీబీఐ అధికారులు ఆరెస్ట్ చేశారని న్యాయవాది ఉమా మహేశ్వర్ రావు వాదించారు. 
 
ఆరోపణలు మాత్రమే సీబీఐ పరిగణలోకి తీసుకుందని, భాస్కర్ రెడ్డి సమాజంలో పలుకబడి ఉన్న వ్యక్తి అని, ఒక సీనియర్ సిటిజన్‌ను అక్రమ కేసులో ఇరికించారన్నారు. ఎలాంటి నేర చరిత్ర లేనటువంటి వ్యక్తి భాస్కర్ రెడ్డి అని, ఆయన నేరం చేశారనడానికి ఎక్కడా సరైన సాక్ష్యాలు లేవన్నారు. ఎర్ర గంగిరెడ్డి ఎక్కడ కూడా భాస్కర్ రెడ్డి పేరు ప్రస్థావించలేదని అన్నారు. ఈ కేసు విషయంలో ఇంప్లీడ్ అయ్యేందుకు గతంలో వైఎస్ సునీత పిటిషన్ దాఖలు చేశారు. సునీత ఇంప్లీడ్ పిటిషన్ ను న్యాయమూర్తి అంగీకరించారు. అయితే లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలన్నారు. తదుపరి విచారణను తొమ్మిదో తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు.