Hanuman Puja: హనుమంతుడు పరమశివుని 11వ రుద్ర అవతారం. హనుమంతుడు శ్రీరాముని భక్తుడైన వ్యక్తిని బాధపడనివ్వడు అని అంటారు. అందుకే శ్రీరాముడిని ఆరాధించే వ్యక్తి హనుమంతుడి ఆశీస్సులు కూడా పొందుతాడని చెబుతారు. హనుమంతుడిని సంపూర్ణ విశ్వాసంతో, నిర్మలమైన హృదయంతో పూజిస్తే భక్తుల బాధలు, కష్టాలు తొలగిపోతాయి. దీనితో పాటు, హనుమాన్ చాలీసా పఠించడం వల్ల 10 రకాల బాధల నుంచి బయటపడవచ్చు. అందుకే ఆయ‌న‌ను సంకట్ మోచన్ అని కూడా అంటారు. హనుమంతుడిని పూజించడం ద్వారా ఏ బాధలు తొలగిపోతాయో తెలుసుకుందాం.


దుష్ట శ‌క్తుల నుంచి ర‌క్ష‌ణ‌
మహావీరుడైన హ‌నుమంతుడి పేరు త‌లచుకుంటే దెయ్యాలు, పిశాచాలు మ‌న‌ దగ్గరకు రావని చెబుతారు. అంటే ఆంజ‌నేయుడిని విశ్వాసంతో త‌ల‌చుకుంటే దెయ్యాలు, భూతాలు ఆ వ్య‌క్తి దగ్గరకు వెళ్లడానికి కూడా సాహసించవు. కనిపించని భయంతో బాధపడుతున్న వ్యక్తి ప్రతిరోజూ హనుమాన్ చాలీసాను చదవాలి, హ‌నుమంతుడిని భ‌క్తితో ఆరాధించాలి. ఇలా చేయ‌డం వల్ల అతని భయం దూరం కావ‌డంతో పాటు అతనిని సురక్షితంగా ఉంచుతుంది.


శని ప్రభావం తగ్గుతుంది
భ‌జరంగబ‌ళిని ఆరాధించడం ద్వారా శని యొక్క దుష్ఫలితాలు తగ్గుతాయని గ్రంధాలలో పేర్కొన్నారు. ప్రతి మంగళ, శనివారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం వల్ల భక్తుల జీవితంలో శని ప్రభావం తగ్గుతుంది.


మంగళ దోష నివార‌ణ‌
జాతకంలో మంగళ దోషం ఉన్న వ్యక్తి వారి వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఒక వ్యక్తి మంగళ దోషంతో ఇబ్బంది పడుతుంటే, ఆ వ్యక్తి మంగళవారం నాడు హనుమాన్ చాలీసాను పఠించాలి. పూజ సమయంలో హనుమంతుడికి ఎర్రటి పుష్ఫాలు సమర్పించాలి.


ప్రమాదాల నుంచి ర‌క్ష‌ణ‌
ఆంజ‌నేయుడిని పూజిస్తే ఆ వ్య‌క్తి అనుభ‌విస్తున్న అన్ని కష్టాలను దూరం చేయడమే కాకుండా, అన్ని రకాల ఇబ్బందుల నుంచి వారిని రక్షిస్తాడు. మీకు ఎలాంటి హానిక‌ర‌ సంఘటనలు, ప్రమాదం జరగకుండా ఉండాలంటే, మీరు ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి.


జైలు భ‌యం పోగొడుతుంది
జైలుకు వెళ్లాలనే భయం వేధిస్తున్నట్లయితే, అలాంటి వారు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం హనుమాన్ చాలీసా పఠించాలి. ఇది ఆ వ్య‌క్తుల‌ను అన్ని రకాల ఇబ్బందుల నుంచి దూరంగా ఉంచుతుంది. ఆ వ్యక్తి జైలుకు వెళ్లాల్సిన‌ పరిస్థితి ఏర్పడకుండా చేస్తుంది.


వ్యాధి నుంచి విముక్తి
నాసై రోగ్ హరి సబ్ పీరా, జపత్ నిరంతర హనుమత్ బీరా అని హ‌నుమాన్ చాలీసాలో పేర్కొన్నారు. అంటే రోజూ హనుమంతుని నామాన్ని జపిస్తే మనిషిని పీడిస్తున్న రోగాలు, బాధలు అన్నీ దూరమవుతాయి.


శత్రువుల నుంచి రక్షణ
భక్తుల శత్రువులను ఆంజ‌నేయ‌స్వామి శ్రీ భ‌జరంగ్ బాణంతో నాశనం చేస్తాడు. ఇది జరగాలంటే హనుమాన్ చాలీసాను ప్రతిరోజూ 21 రోజుల పాటు శ్ర‌ద్ధ‌గా ప‌ఠించాలి, సత్య మార్గాన్ని అనుసరించాలి.


Also Read : Jyeshta Maas Food: జ్యేష్ఠ మాసంలో ఇలాంటి ఆహారం తీసుకుంటే కష్టాలే!


రుణ బాధ నుంచి ఉపశమనం
ఒక వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే, వారు మంగళవారం నాడు హనుమాన్ చాలీసాను పఠించి, ఆ రోజు నుంచి రుణం తీర్చుకోవడం ప్రారంభించాలి. అలా చేయ‌డం ద్వారా త్వరలోనే మీ అప్పులన్నీ తీరుతాయి.


నిరుద్యోగ‌ సమస్యలు
కష్టపడి ప్రయత్నించినా ఉద్యోగం దొరకని పక్షంలో మంగళవారం సుందరకాండ పఠించి హనుమంతుడికి నైవేద్యం సమర్పించాలి. అలా చేస్తే త్వ‌ర‌లోనే ఉద్యోగం ల‌భిస్తుంది.


ఒత్తిడి  తగ్గిస్తుంది
ఒక వ్యక్తి రోజంతా ఒత్తిడిలో ఉంటే, అతను/ఆమె 'ఓం హనుమతే నమః' లేదా 'ఓం హనుమంతే నమః' అనే హ‌నుమంతుని మంత్రాల‌ను 108 సార్లు జపించాలి. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. అంతేకాకుండా వారు వారి జీవితంలో మరింత ఉత్పాదకత సాధించి సంతోషంగా ఉండేలా చేస్తుంది.


Also Read : Hanuman: ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు, అసలు సిసలు వ్యక్తిత్వ వికాస గని హనుమంతుడు


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.