Prudhvi Raj: టాలీవుడ్ లో నటుడు పృథ్వీ రాజ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. పృథ్వీ రాజ్ గా కంటే ‘30 ఇయర్స్ పృథ్వీ’ అంటూ వెంటనే గుర్తుపడతారు ఆడియన్స్. సినిమాల్లో ఎక్కువగా కామెడీ పాత్రల్లో కనిపించే పృథ్వీ రాజ్ కు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఆయన గత కొంత కాలంగా సినిమాల్లో తక్కువగా రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పలు సార్లు కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు కూడా. మొన్నటి వరకూ వైసిపీ పార్టీలో యాక్టీవ్ గా ఉన్న పృథ్వీ తర్వాత ఆ పార్టీతో విబేధాలు రావడంతో పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు జనసేన పార్టీలో యాక్టీవ్ గా ఉంటున్నారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై విమర్శలు గుప్పించారు.
అవన్నీ జరిగేవి కావు, ఆ సినిమాలు ఎవరూ చూడరు : పృథ్వీ రాజ్
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ‘వ్యూహం’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. ఆ సినిమా ఏపీలో ప్రతిపక్షపార్టీల ఓటమే లక్ష్యంగా తీస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఆ సినిమా ఉంటుందని చర్చించుకుంటున్నారు. ఇదే విషయంపై పృథ్వీ రాజ్ ను అడిగితే దానికి ఆయన స్పందిస్తూ.. రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాలను అసలు ప్రజలు చూడరని కొట్టిపారేశారు పృథ్వీ. గతంలో కూడా ఆర్జీవి ఇలాంటి సినిమాల తీసారని కాని వాటి ప్రభావం రాజకీయాల్లో ఏ మాత్రం ఉండదని అన్నారు. ఆర్జీవి సినిమాలను సీరియస్ గా ఎవరూ తీసుకోరని చెప్పారు. ప్రతిపక్షాల మీద ప్రజల్లో వ్యతిరేకత తేవడానికే ఇలాంటి సినిమాలు తీస్తున్నారని, కానీ సినిమాలు రాజకీయాలు వేరని చెప్పుకొచ్చారు. ఆర్జీవికు పోటీగా తమ పార్టీ వాళ్లు గానీ, టీడీపీ వాళ్లు గానీ సినిమాలు చేసే ఉద్దేశం ఉండదని, ఎందుకంటే అలాంటి నీచమైన సిద్దాంతాలు ఈ పార్టీల్లో లేవని అన్నారు. అలా చేయాలని అనుకుంటే గతంలో వై ఎస్ జగన్ పాద యాత్ర చేసి ఉండేవాడా అని ప్రశ్నించారు. సినిమాలు తీయాలి అనుకుంటే వాళ్లు ఈ నాలుగేళ్లలో చేసిన పనుల గురించి సినిమాలు చేసుకుంటే బాగుంటుందని, అంతేగాని ఇలా ప్రతిపక్షాల మీద కక్షతో సినిమాలు చేయడం వలన ఒరిగేది ఏమీ లేదని వ్యాఖ్యానించారు.
రాజకీయాలే లక్ష్యంగా ఆర్జీవి సినిమాలు..
రామ్ గోపాల్ వర్మ గత కొంత కాలంగా రాజకీయాలను లక్ష్యంగా చేసుకొని పొలిటికల్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన గతంలో 2019 ఎన్నికల సమయంలో కూడా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ వంటి సినిమాలను తెరకెక్కించారు. ఆ తర్వాత కూడా ఒకటి రెండు పొలిటికల్ స్టోరీలను ఎంచుకొని సినిమాలు తీశారు. మళ్లీ ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమా కూడా ఎన్నికల సమయంలో రాజకీయాలను ఉద్దేశించే తీస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. మరి ఆర్జీవి తీసే సినిమాలు ఏపీ రాజకీయాల్ని ఎంతవరకూ ప్రభావితం చేస్తాయో చూడాలి.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ బిజినెస్ - ఎన్ని కోట్లో తెలుసా!