టా చైత్ర మాసంలో పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి జరుపుకుంటాము. అంజనీ దేవి, వానర రాజు కేసరి దంపతులకు హనుమంతుడు జన్మించిన పవిత్రమైన రోజు ఇది. హనుమాన్ జయంతి రోజున హనుమంతుడితో పాటు సీతారాముల పూజ కూడా జరుపుతారు. రాముడి ఆరాధన లేకుండా హనుమాన్ పూజ సంపూర్ణం కాదు.


హనుమాన్ శోభాయాత్ర వైశిష్ట్యం


చైత్ర శుద్ద పౌర్ణమి రోజున హనుమంతుడు అవతరించిన రోజు మాత్రమే కాదు. ఈ రోజున హనుమాన్ శోభాయాత్ర చాలా అన్ని ప్రముఖ ఆంజనేయ ఆలయాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాయి. అందుకు రామాయణంలో ఒక కారణం కూడా చెబుతారు. రావణుడి మీద రాముడు సాధించిన విజయంలో ప్రముఖ పాత్ర హనుమంతుడికి కూడా ఉంది. ఆ విషయాన్ని రాముడు ఏనాడూ విస్మరించలేదు. రామ పట్టాభిషేకం అనంతరం ఇదే హనుమాన్ జయంతి రోజున రాముడు హనుమంతుడిని శుభాకాంక్షలు తెలుపుతూ తన విజయానికి కారకుడైన వాయు పుత్రుడికి నిండు సభలో సన్మానం జరిపి ఆలింగనం చేసుకున్నాడని, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజలంతా ఆ రోజును హనుమత్ విజయోత్సవంగా జరుపుకోవడం అనవాయితీగా మారిందని పురాణాలు చెబుతున్నాయి.


ఈ ఏడాది ఎప్పుడు


ఈ సంవత్సరం 2024 ఏప్రిల్ 23న హనుమాన్ జయంతి జరుపుకోబోతున్నారు. చైత్ర మాసంలో శుక్లపక్ష పౌర్ణమి ఏప్రిల్ 23 తెల్లవారుజామున 3.45 గంటలకు ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 24 ఉదయం 5.18 గంటలకు ముగుస్తుంది. ఏప్రిల్ 23న ఉదయం 9.03 గంటల నుంచి 10.41 గంటల వరకు హనుమాన్ ఆరాధనకు అనువైన సమయం. బ్రహ్మ ముహూర్తం ఏప్రిల్ 23 ఉదయం 4.20 నుంచి 5.04 గంటల వరకు ఉంది. అభిజీత్ ముహూర్తం ఉదయం 11.53 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.46 గంటలకు ముగుస్తుంది.


ఈ ఏడాది ప్రత్యేకం


ఏప్రిల్ 23 చైత్ర పౌర్ణమి మంగళ వారం రోజున రావడం యాదృఛ్చికమే అయినా అపురూపమని పండితులు అభిప్రాయపడుతున్నారు. మంగళ వారం హనుమంతుడికి ప్రీతి పాత్రమైన రోజు. ఈ హనుమాన్ జయంతి రోజున ఇలాంటి ప్రత్యేక పూజలు హనుమంతుడికి, రాముడికి చేసుకోవడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందట. రామ నవమి తర్వాత సరిగ్గా ఆరు రోజులకు హనుమాన్ జన్మదినం వస్తుంది. ఈ ఏడాది రామ నవమి ఏప్రిల్ 17న వస్తోంది.


హనుమాన్ జయంతి ప్రాముఖ్యత


హనుమాన్ జయంతి రోజు హనుమంతుడిని సేవించుకోవడం వల్ల కష్టాలు తొలగి పోతాయని నమ్మకం. రోగభయం, భూతప్రేతాల వల్ల కలిగే భయాలను హనుమంతుడు తొలగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. హనుమాన్ జయంతి రోజున ఆంజేనేయ స్వామి గుడికి వెళ్లి పచ్చిమిర్చి, బెల్లం, నూనె, బేసన్ లడ్డు నైవేద్యంగా సమర్పించాలి. హనుమాన్ చాలీసా పఠనం కూడా విశేష ఫలితాలను ఇస్తుంది. హనుమత్ జయంతి రోజున రామాయణం చదువుకోవడం శుభ ప్రదం. ముఖ్యంగా సుందరాకాండ పారాయణం హనుమత్ కృపకు పాత్రులను చేస్తుంది.


Also Read : Solar Eclipse 2024 : 54 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న సంపూర్ణ సూర్య గ్రహణం ప్రభావం ఏమిటో తెలుసా? మనకు వర్తిస్తుందా?



Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.