ప్రతి సంవత్సరం రెండు మూడు సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఈ సంవత్సరంలో ఏర్పడే మొదటి సూర్య గ్రహణం సంపూర్ణ గ్రహణం మాత్రమే కాదు దాదాపు 54 సంవత్సరాల తర్వాత ఇటువంటి సూర్య గ్రహణం ఏర్పడుతున్నట్టు పండితులు చెబుతున్నారు. 1970వ సంవత్సరంలో ఏర్పడిన సూర్య గ్రహణం మళ్లీ ఈ ఏడాది కనిపించబోతుంది. ఈ నేపథ్యంలో కొన్ని విశేషాలు మీ కోసం.


ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 8 ఏర్పడబోతోంది. చైత్ర నవరాత్రుల ప్రారంభానికి ముందు ఏర్పడే ఈ సూర్యగ్రహణానికి జ్యోతిషంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని పండితులు అంటున్నారు. ఇది ఈ సంవత్సరంలో ఏర్పడే మొదటి గ్రహణం మాత్రమే కాదు సంపూర్ణ సూర్యగ్రహణం కూడా. ఇది ఎక్కడెక్కడ కనిపిస్తుంది? ప్రభావం ఎలా ఉంటుంది? ఇక్కడ తెలుసుకుందాం.


ఎప్పుడు ఏర్పడుతుంది?


శాస్త్రాన్ని అనుసరించి సూర్యగ్రహణ శుభాశుభ ఫలితాలు ప్రపంచ పరిస్థితులను ప్రభావితం చేస్తాయి. ఈ సంవత్సరం 8, 9 తేదీల మధ్య కాలంలో రాత్రి పూట ఏర్పడుతుంది. దీని వ్యవధి ఎనిమిదవ తేది రాత్రి 9.12 నిమిషాల నుంచి తెల్లవారుజామున 1.25 నిమిషాల వరకు ఉంటుంది. సూర్య గ్రహణ సూతక కాలం గ్రహణానికి 12 గంటల ముందు నుంచి ప్రారంభం అవుతుంది.


మనకు కనిపిస్తుందా?


ఈ సూర్యగ్రహణం భారత దేశంలో కనిపించదు. అందువల్ల సూతక కాలం కూడా ఇక్కడ వర్తించదు. అలస్కా, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా, ఐర్లాండ్ తో సహా మరి కొన్ని ఉత్తర ప్రాంతాలు, ఇంగ్లాండ్ లోని కొన్ని వాయువ్య ప్రాంతాలు, కెనడా మినహా మొత్తం అమెరికాలో సంపూర్ణ సూర్య గ్రహణం కనిపిస్తుంది. ఈ ఏడాది మెక్సికోలోని మజాటియన్ నగరంలో సంపూర్ణ సూర్య గ్రహణం కనిపించబోతోంది.


గ్రహణ సమయాలు


రాత్రి 9.12 నిమిషాలకు సూర్య గ్రహణం ప్రారంభం అవుతుంది. గ్రహణం 11.47 కూ సంపూర్ణం అవుతుంది. అర్థ రాత్రి 1.25 నిమిషాలకు ముగింపు మొదలై 2.22 నిమిషాలకు పూర్తయి పోతుంది. పూర్తి గ్రహణ వ్యవధి దాదాపుగా 5 గంటల 10 నిమిషాలు. ఏప్రిల్ 8 న ఈ సూర్యగ్రహణ సమయంలో దాదుగా 7 నిమిషాల 50 సెకన్ల పాటు సూర్యుడు పూర్తిగా కనిపించడు. అంటే ఈ సమయంలో సూర్యుడు పూర్తిగా అంతర్ధానమవుతాడు. అమెరికాలో చాలా ప్రాంతాల్లో ఈ సమయంలో చీకటి పడుతుంది.


అయితే ఈ గ్రహణ వేళల్లో భారత దేశంలో రాత్రి కాలం కనుక ఇక్కడ సూర్య గ్రహణం కనిపించదు. గ్రహణం కనిపించదు. కనుక గ్రహణ సూతకాలు, ఇతర నియమాలు కూడా మనకు వర్తించవని శాస్త్రం చెబుతోందని పండితులు నిర్దారిస్తున్నారు. కనుక ఈ గ్రహణ ప్రభావం కూడా మన ప్రాంతాల మీద నామమాత్రమే అని అంటున్నారు.


Also Read : Vastu Tips: ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే డబ్బే డబ్బు - ఆ దోషాలన్నీ తొలగిపోతాయ్!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.