Nanda Kumar Shocking Comments On Daggubati Suresh Babu: గతంలో సంచలనం సృష్టించిన ఎంఎల్ఏ కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నంద కుమార్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ ను ట్యాపింగ్ చేసిందని చెప్పడానికి పూర్తి ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. తన ఫోన్ ను అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని చెప్పినా, ఎవరూ పట్టించుకోలేదని ఆయన వెల్లడించారు. తాజాగా డీజీపీ రవి గుప్తాను కలిసి నంద కుమార్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు ఫిలిం నగర్ లోని తన డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతపై ఫిర్యాదు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు? ఎక్కడ చేశారు? అనే పూర్తి వివరాలను డీజీపీకి అందించినట్లు తెలిపారు. ఈ కేసులో ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని నందకుమార్ కోరారు.
సురేష్ బాబు, వెంకటేష్ పై సంచనల వ్యాఖ్యలు
హైదరాబాద్ ఫిలిం నగర్ లోని తన డెక్కన్ కిచన్ హోటల్ కూల్చివేత వ్యవహారంలో నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, హీరో వెంకటేష్ పాత్రే కీలకం అని వెల్లడించారు. గత ప్రభుత్వ పెద్దలు కేసీఆర్, కేటీఆర్ తో ఉన్న దగ్గరి సంబంధాల కారణంగానే తన హోటల్ ను కూల్చేశారని ఆరోపించారు. కోర్టులో కేసు నడుస్తుండగానే జీహెచ్ ఎంసీ అధికారులకు నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు తన హోటల్ ను కూల్చివేశారని చెప్పారు. బీఆర్ఎస్ పెద్దల అండతో దగ్గుబాటి ఫ్యామిలీ మిగతా బిల్డింగ్ ను కూడా కూల్చి వేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ పట్టగలే బౌన్సర్ల నడుమ భవనం కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలు కోర్టుల్లో వివాదం కొనసాగుతున్నా నిర్మాణాలను కూల్చివేయడం పట్ల ఆయన అభ్యంతరం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై ఫోకస్ పెట్టాలని నంద కుమార్ విజ్ఞప్తి చేశారు.
దగ్గుబాటి ఫ్యామిలీతో నంద కుమార్ గొడవేంటంటే?
ఫిలిం నగర్ లో నిర్మాత సురేష్ బాబు కుటుంబానికి భూమి ఉంది. ఎంఎల్ఏ కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నంద కుమార్ గతంలో ఆ భూమిని లీజ్‌కు తీసుకున్నాడు. ఆ స్థలంలో డెక్కన్ కిచన్ పేరుతో హోటల్ నిర్మించారు. ఆ తర్వాత దగ్గుబాటి ఫ్యామిలీతో నంద కుమార్ కు గొడవలు జరిగినట్లు తెలిసింది. ఆ హోటల్ అక్రమంగా నిర్మించారని సురేష్ బాబు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చి వేశారు. అగ్రిమెంట్ ఉన్నా, తన హోటల్ ను కూల్చివేశారని నంద కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై అప్పట్లో కోర్టు సీరియస్ అయ్యింది. నిర్మాత సురేష్ బాబు కుటుంబానికి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నా, నిర్మాణాల కూల్చివేత కొనసాగుతుందని నంద కుమార్ వెల్లడించారు. కేసు కొనసాగుతుండగా కూల్చివేతలు ఏంటని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక నిందితుడు
అటు తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నంద కుమార్ కీలక నిందితుడిగా ఉన్నారు. బీజేపీకి చెందిన ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు చేయడానికి ప్రయత్నించాడని అప్పట్లో గులాబీ పార్టీ పెద్దలు ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన ఓ వీడియోను కూడా అప్పట్లో పోలీసులు విడుదల చేశారు.
Read Also: సినిమా రికార్డులు సృష్టించాలన్నా నేనే, వాటిని తిరగరాయాలన్నా నేనే: బాలకృష్ణ