Hyderabad News: తెలంగాణలో వలసల రాజకీయ పీక్స్‌లో ఉంది. అధికార పార్టీలోకి ప్రతిపక్షాల నాయకులు ముఖ్యంగా బీఆర్‌ఎస్ నాయకులు జంప్ చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల ముందు జరుగుతున్న పరిణామాలు పింక్ పార్టీ అధినాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఓ స్థాయి నేతలు వెళ్లడం వేరు... ఇప్పుడు ఏకంగా లోక్‌సభ బరిలో ఉన్న నేతలు వెళ్లిపోవడం మింగుడుపడటం లేదు.
బెదిరిపోవడమా!
కేకే, ఆయన కుమార్తె, కడియం ఫ్యామిలీ మూకుమ్మడిగా మరికొందరితో కలిసి చేయి అందుకోవడంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎక్స్‌లో స్పందించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జరగుతున్న పరిణామాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శూన్యం నుంచే సునామీ సృష్టించిన కేసీఆర్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు బెదిరిపోతారా అంటు ప్రశ్నించారు. కచ్చితంగా బౌన్స్ బ్యాక్ ఉంటుందని ధీమా వ్యక్యం చేశారు.
కుతంత్రాలు పని చేయవు
ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే.." శూన్యం నుంచి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కెసిఆర్. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కెసిఆర్." అంటూ తండ్రిని ఆకాశానికి ఎత్తేశారు.
ద్రోహులకు ప్రజలే బుద్ది చెప్తారు
అక్కడితో ఆగిపోని కేటీఆర్ నేతలపై కూడా సెటైర్లు వేశారు. ద్రోహులకు ప్రజలే బుద్దిచెబుతారంటూ ఫైర్ అయ్యారు. కచ్చితంగా కేసీఆర్‌ను ప్రజలే కాపాడుకుంటారని అన్నారు. " ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు. ప్రజాశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన KCRని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. అంటు చెప్పుకొచ్చారు.
కెరటంలా లేస్తాం
నాయకత్వం తయారు చేయడం కేసీఆర్‌కు కొత్త కాదని... లక్షల మందిని ఉద్యమంవైపు పరుగులు పెట్టించిన కేసీఆర్ వెనక్కి తగ్గబోరని ఆన్నారు కేటీఆర్. కచ్చితంగా కొత్త నాయకత్వం తయారు చేసుకొని ప్రజల తరఫున పోరాటం చేస్తామంటున్నారు. "నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం" అని పోస్టు చేశారు.