ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే నెల రంజాన్. వారి మత గ్రంథం ఖురాన్ ఈ మాసంలోనే ఆవిర్భవించడమే దీనికి కారణం. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల మేలు కలయికే రంజాన్ మాసం. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యమున్న రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన రోజా (ఉపవాస) దీక్షలు, దానధర్మాలతో సాగుతుంది. నెల పొడుపు చంద్రుని దర్శించిన వెంటనే రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి. మన దేశంలో శుక్రవారం నుంచి (మార్చి 24వ తేదీ) ఉపవాస దీక్షలు ప్రారంభవుతాయి. ఏప్రిల్ 22 లేదా 23 తేదీల్లో ఈద్-ఉల్-ఫితర్ ఉంటుంది. ఇది ముస్లింలు పవిత్ర ఉపవాసాలతో గడిపే రంజాన్ నెలకు ముగింపు రోజు. ఏప్రిల్ 21న చంద్ర దర్శనమైతే 22న లేదా 23వ తేదీన ఈద్-ఉల్-ఫితర్ జరుపుకొంటారు.
మహ్మద్ ప్రవక్త లా ఇల్లాహ ఇల్లాల్ల అనే సూత్రం ప్రకారం మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించాడని చరిత్ర చెబుతోంది. ఈ మాసంలో రోజుకు ఐదుసార్లు నమాజ్‌తో పాటు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. పవిత్ర మాసంలో దానధర్మాలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో చనిపోతే నేరుగా స్వర్గానికి చేరుకుంటారని, నరక ద్వారాలు మూసి ఉంటాయని ముస్లింలు విశ్వసిస్తారు. ఆకలి ఎంత కఠీనంగా ఉంటుందో స్వయంగా అనుభవిస్తే తప్ప అనుభవంలోకి రాదనే భావనతో ఈ రంజాన్ 'రోజా' ఉపవాస దీక్షలు అనే సూత్రాన్ని ప్రతిపాదించారు. లోకంలో ఎంతో మంది అభాగ్యులు, నిరుపేదలు ఆకలితో అలమటిస్తూ దుర్భర జీవితాలను గడుపుతున్నారని, అలాంటి వారి పట్ల మానవత్వంతో స్పందిస్తూ తమ సంపాదనలో కొంత శాతం కేటాయించి సాటివారికి దానధర్మాలు చేయాలి అని సూచించారు. మనకు ఆకలి వేస్తే భరించడం ఎంత కష్టమో 'రోజా' ఉపవాసం ద్వారా తెలియజేసి నిరుపేదలకు దానధర్మాలు చేయమని పవిత్ర ఖురాన్ సూచిస్తుంది. ఈ దాన గుణం ,భక్తి భావన సంవత్సరం మొత్తం అనుసరించాలని పవిత్ర రంజాన్ నెలతో ప్రారంభిస్తారు. మానవీయ విలువలను తెలియజేసే పవిత్ర ఖురాన్ గ్రంధాన్ని తప్పకుండా ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్క ముస్లిం చదవాలి, లేదా వినాలనే నియమమం కుడా ఉంది.
రంజాన్ మాసంలో ముస్లింలు సూర్యోదయానికి ముందు నుంచి సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం, కనీసం లాలాజలం కూడా మింగకుండా కఠోర ఉపవాస దీక్ష చేపడతారు. వయస్సులో తారతమ్యం లేకుండా చిన్నాపెద్దా భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలో పాల్గొంటారు. ఉపవాస దీక్షలతో బలహీనతలు, వ్యసనాలను జయించవచ్చని ఇస్లాం మత గురువులు చెబుతారు. ఉపవాస దీక్షల వల్ల జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రం చెబుతుంది. ఉపవాస దీక్షలు (రోజా) సహారీతో ప్రారంభమై ఇఫ్తార్‌తో ముగుస్తాయి. ఉపవాస దీక్షను ఖర్జూరపు పండు తిని విరమించే ముస్లింలు ఆ తర్వాత పలురకాల రుచికరమైన వంటకాలను భుజిస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రయాణంలో ఉన్న వారు ఉపవాసదీక్షను ఉప్పుతో కూడా విరమించేందుకు అనుమతి ఉంది. ఈ వంటకాలతో పాటు ముస్లింలు తమ సంప్రదాయ వంటకం హలీమ్‌ను తయారు చేసుకుని తింటారు. వీటి కోసం ఈ నెలలో ప్రత్యేక హోటళ్లు కూడా అందుబాటులో ఉంటాయి.
ఇక ఈ నెలలో కళ్లకు ‘సుర్మా' పెట్టుకోవడం కూడా ముస్లింలు సున్నత్ గానే భావిస్తారు. ప్రవక్త హజరత్ మహ్మద్ సదా సుర్మా పెట్టుకునేవారని అంటారు. కాటుక లాగే కళ్లకు రాసుకునే సుర్మా పౌడర్ రూపంలో ఉంటుంది. అందమైన భరిణెల్లో వీటిని దాచుకొని ఇంటికి వచ్చిన అతిథులకు అత్తరుతో పాటు కళ్లకు పెట్టుకోవడానికి సుర్మా ఇవ్వడం ముస్లింల సంప్రదాయం. ప్రతి నమాజుకు ముందు సంప్రదాయం ప్రకారం ముఖం, కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుని సుర్మా పెట్టుకుంటారు, ఇది కళ్లకు మేలుచేస్తుంది.
ప్రతి మాసంలోను శుక్రవారం రోజున ముస్లింలు నమాజ్ చేయడం ఆనవాయితీ. ఇక రంజాన్ మాసంలో మత పెద్దలతో నమాజ్ చేయించడం ప్రశస్తమైనది. మసీదుకు వెళ్లలేనివారు తాము ఉన్న స్థలాన్ని శుభ్రం చేసుకొని ప్రార్థన చేసి భగవంతుడి కృపకు పాత్రులవుతారు. ముస్లింలు రంజాన్ ఆఖరు పది రోజులు ఇళ్లు వదలి మసీదుల్లో ఉంటూ ప్రార్థనలతో గడుపుతారు. ఈద్-ఉల్-ఫితర్ పండుగ రోజు షీర్ ఖుర్మా అనబడే మధురమైన సేమియాను తప్పక వండుతారు, ఆత్మీయులకు తినిపిస్తారు.