Sajjala On Mlc Results : ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి చెందిన ఆరుగురు విజయం సాధించగా, టీడీపీకి చెందిన ఒకరు గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని అధికార పక్షం ఆరోపిస్తుంది. ఈ ఫలితాలపై ప్రభుత్వం సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను టీడీపీ ప్రలోభపెట్టిందన్నారు.  వారి పేర్లు  ఇప్పుడు చెప్పలేమన్నారు. కోటంరెడ్డి,  ఆనంలను  వైసీపీ  లెక్కలోకి  తీసుకోలేదన్నారు.  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు సంఖ్యాబలం ఉంది కాబట్టే ఏడుగురు అభ్యర్థులను పోటీలో నిలబెట్టామన్నారు. డబ్బులు ఎర చూపి, ప్రలోభపెట్టి టీడీపీ ఒక స్థానంలో గెలిచిందన్నారు. డబ్బులు ఆశ చూపి ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొన్నారని సజ్జల ఆరోపించారు.  అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ  ఇలాగే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని, ఇప్పుడూ అదే చేసిందని విమర్శించారు. ఈ ఒక్క గెలుపు చూసుకుని తాము ఏదో సాధించామని టీడీపీ అనుకుంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేయాలని సజ్జల సవాల్‌ విసిరారు.  


అసంతృప్తి నేతలను పిలిచి మాట్లాడతాం


"టీడీపీకి ఓటు వేసిన ఎమ్మెల్యేలు ఎవరనే విషయాన్ని గుర్తించాం. తగిన సమయంలో తగిన విధంగా చర్యలు ఉంటాయి. మా సభ్యులను చంద్రబాబే ప్రలోభ పెట్టారు. ఇద్దరు వైసీపీ సభ్యులను  మేము పరిగణనలోకి తీసుకోలేదు. తగిన సంఖ్యా బలం ఉంది కాబట్టి అభ్యర్థులను పోటీకి పెట్టాం. ఎక్కడ లోపం ఉందనే విషయాన్ని విశ్లేషించి తగిన చర్యలు తీసుకుంటాం. పార్టీ ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉందని మేము అనుకోవడం లేదు. కొంతమంది అలా భావిస్తే పిలిచి మాట్లాడతాం. వెంటనే చర్యలు తీసుకోవడానికి ఇదేమి ఉద్యోగం కాదు. " -సజ్జల రామకృష్ణా రెడ్డి 


క్రాస్ ఓటింగ్ చేసిన వారి కోసం వైసీపీ విశ్లేషణ                   


కోలా గురువులు, జయ మంగళం వెంకటరమణకు కేటాయించిన ఎమ్మెల్యేల్లో ఇద్దరు క్రాస్ ఓటింగ్ చేశారు. ఇప్పుడు వారికి కేటాయించిన ఎమ్మెల్యేలందరిపై వైసీపీ హైకమాండ్ అనుమానపడే అవకాశం ఉంది. ప్రధానంగా వారిలో  ఎవరు పార్టీపై అసంతృప్తితో ఉన్నారన్న అంశం ఆధారంగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడింది ఎవరనే దానిపై వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.  మొత్తం  ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలను గెలుస్తామని  గట్టి నమ్మకం పెట్టుకున్న వైసీపీకి ... ఆ పార్టీ హైకమాండ్‌కు ఏదీ కలసి రావడం లేదు.  పక్కా జాగ్రత్తలు తీసుకున్నా.. ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయకుండా ఆపలేకపోయారు. టీడీపీ నుంచి వచ్చి చేరిన నలుగురు, జనసేన నుంచి వచ్చి చేరిన ఒకరితో  గెలుపు ఖాయమనుకున్నారు కానీ.. తమ పార్టీ ఎమ్మెల్యేలు షాకిస్తారని అనుకోలే్దు. ఈ పరిణామాలపై వైఎస్ఆర్‌సీపీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలపై సీఎం జగన్ పట్టు కోల్పోయారా అన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ  ఓటమిపై ఇంకా వైఎస్ఆర్‌సీపీ ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. 


 వైసీపీ ఆరు స్థానాల్లో విజయం, టీడీపీకి ఒక సీటు  


ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్ తగిలింది. ఏడు స్థానాల్లో క్లీన్ స్వీప్ చేద్దామనుకున్న వైసీపీ వ్యూహాలు బెడిసికొట్టాయి. మొత్తం ఏడు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఆరు స్థానాల్లో గెలుపొందగా, టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆరు స్థానాలు వైసీపీ గెలుచుకోగా, ఒకటి టీడీపీ ఖాతాలో చేరింది. అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించగా, వైసీపీ అభ్యర్థి కోలా గురువులు ఓటమి  పాలయ్యారు. 


గెలిచిన అభ్యర్థులు


1.మర్రి రాజశేఖర్ (వైఎస్ఆర్ సీపీ)
2.పోతుల సునీత (వైఎస్ఆర్ సీపీ)
3. జయమంగళ రమణ (వైఎస్ఆర్ సీపీ)
4.ఏసు రత్నం (వైఎస్ఆర్ సీపీ)
5.సూర్యనారాయణ రాజు (వైఎస్ఆర్ సీపీ)
6.ఇజ్రాయిల్  (వైఎస్ఆర్ సీపీ)
7.  పంచుమర్తి అనురాధ(టీడీపీ)