Karwa Chauth / Atla Taddi 2024 Date:  ఏటా ఆశ్వయుజమాసం పౌర్ణమి తర్వాత వచ్చే మూడో రోజే అట్ల తదియ (karwa chauth 2024). ఈ ఏడాది అట్ల తదియ అక్టోబరు 19 శనివారం వచ్చింది. 


తిథులు తుగులు - మిగులు ( ముందురోజు సగం తర్వాతి రోజు సగం) రావడంతో ఏ రోజు పండుగ జరుపుకోవాలి అనే సందిగ్ధం కొందరిలో ఉంది. సాధారణంగా పండుగలన్నీ సూర్యోదయానికి తిథి ఉండేలా పాటిస్తారు...కానీ కార్తీక పౌర్ణమి, కర్వా చౌత్, దీపావళి లాంటి పండుగలు, నోములకు సూర్యాస్తమయానికి తిథి ఉండడం ప్రధానం. అట్లతదియ రాత్రివేళ జరుపుకునే పండుగ. అందుకే సాయంత్రానికి తదియ తిథి ఉండడం ప్రధానం. 


అక్టోబరు 19 శనివారం  విదియ మధ్యాహ్నం 12 గంటల 49 నిముషాల వరకూ ఉంది.. ఆ తర్వాత నుంచి తదియ ఘడియలు ప్రారంభమయ్యాయి


అక్టోబరు 20 ఆదివారం ఉదయం 10 గంటల 46 నిముషాల వరకూ తదియ ఉంది..ఆ తర్వాత చవితి ప్రారంభమైంది...


Also Read: శివాలయంలో ఉండే నవగ్రహాలకే పవర్ ఎక్కువ ఉంటుందా


అక్టోబరు 19 శనివారం రోజు మాత్రమే రాత్రివేళ తదియ తిథి ఉంది. రోజంతా ఉపవాస నియమాలు పాటించి గౌరీదేవి పూజ చేసి... చంద్రుడి దర్శనం అనంతరం ఫలహారం తీసుకుంటారు. అంటే..తదియ తిథి సూర్యస్తయమానికి ఉండడం ప్రధానం.. అందుకే ఎలాంటి సందేహానికి తావులేకుండా అట్లతదియ నోము అక్టోబరు 19న నోచుకోవాలి


వివాహిత స్త్రీలు అట్లతదియ నోము నోచుకుంటే ధనధాన్యాభివృద్ధి , సంతానం, సౌభాగ్యం లభిస్తుంది. అవివాహితులు అట్లతదియ నోము నోచుకుంటే మంచి వరుడు లభిస్తాడని నమ్మకం.


అట్ల తదియ నోములో భాగంగా గౌరీదేవికి అట్లు నైవేద్యంగా సమర్పిస్తారు. నవగ్రహాల్లో కుజుడికి అట్లంటే మహాప్రీతి.. అందుకే కుజుడికి అట్లు నివేదిస్తే జాతకంలో ఉండే కుజుదోషం తొలగిపోయి వివాహానికి ఉండే అడ్డంకులు, దాంపత్య జీవితంలో ఉండే ఇబ్బందులు , గర్భధారణలోనూ సమస్యలు తొలగిపోతాయంటారు. 


మినుగులు, బియ్యాన్ని కలిపి అట్లు పోస్తారు ... ఇందులో మినుగులు రాహువుకి, బియ్యం చంద్రుడికి సంబంధించిన ధాన్యాలు. అందుకే అట్లను వాయనంగా ఇవ్వడం వల్ల జాతకంలో ఉండే రాహు సంబంధిత దోషాలు తొలగిపోతాయి, నవగ్రహాలు కూడా శాంతిస్తాయి. 


Also Read: యమలోకంలో ఎంట్రీ ఉండకూడదంటే ఈ దానాలు చేయమన్న గరుడపురాణం


అట్లతదియ రోజు వేకువజామునే నిద్రలేచి...భోజనం చేస్తారు. దీన్నే కొన్ని ప్రాంతాల్లో చద్ది అని మరికొన్ని ప్రాంతాల్లో ఉట్టికిందముద్ద అని అంటారు. ఆ తర్వాత గోరింట పెట్టుకుని..ఇరుగుపొరుగు ఆడపడుచులతో కలసి ఆటలాడుతారు.  11 తాంబూలాలు తీసుకుంటారు ,   11 ఉయ్యాలలు 11 సార్లు ఊగుతారు, 11 రకాల పండ్లు తింటారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం గౌరీదేవికి పూజచేసి..అట్లు నివేదించి.. ముత్తైదువుకి వాయనం ఇస్తారు.  


పరమేశ్వరుడిని పతిగా పొందేందుకు పార్వతీ దేవిని ఈ వ్రతం ఆచరించమని నారదుడు సూచించాడు. గౌరీ దేవి మొదట ఆచరించిన వ్రతం ఇది. అందుకే అట్ల తదియ రోజు గౌరీదేవిని ఆరాధిస్తారు. ఈ రోజు చంద్రుడిని ఆరాధించడం వల్ల తనలో కళలన్నీ నోము నోచుకునేవారిలలో చేరుతాయని తద్వారా జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుందని పండితులు చెబుతారు. ముందుగా గౌరీదేవికి పూజ చేసి అట్లతదియ కథ చదువుకుని చంద్రుడుని దర్శించుకుంటారు. అనంతరం ముత్తైదువులకు వాయనం ఇస్తారు...


Also Read: మహాభారతంలో ఈ పాత్రల్లో మీరు ఏటైపు, ఓ సారి చూసుకోండి