ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి హిందూ మహాసముద్రం వరకు సముద్ర మట్టానికి కిలోమీటర్ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో  అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుండటంతో అక్టోబర్ 14, 15, 16,17 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. 


ఆదివారం ఈ జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ
శనివారం నాడు బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంలో 54.7 మి.మీ, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 64 మి.మీ, నంద్యాల జిల్లా చాగలమర్రిలో 47.7 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం నాడు పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదివారం నాడు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి,  కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.






ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా త్వరలో కురవనున్న భారీ వర్షాలపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులు విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత ఆదేశించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సోమవారం నుంచి మత్స్యకారులు మూడు రోజులపాటు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.  విపత్తుల నిర్వహణ సంస్థ అత్యవసర సహాయక చర్యల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. ఎక్కడైనా సమస్య ఉంటే టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 1800 - 425 - 0101 లలో సంప్రదించాలని అధికారులు సూచించారు. వర్షం కురిసే సమయంలో చెట్ల కిందగానీ, హోర్డింగ్స్ కిందగానీ ఉండొద్దని, పాత ఇండ్లలోకి వెళ్లకూడదని ప్రజలకు సూచించారు. 






తెలంగాణలో ఆదివారం, సోమవారం వర్షాలు
తెలంగాణలో ఆదివారం నాడు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురవనున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచనున్నాయి. కొన్ని జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో కూడిన గాలులు వీస్తాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమరంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి,  ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.


ఆదివారం సాయంత్రం, సోమవారం ఉదయం వరకు ఉత్తర తెలంగాణలో కొన్నిచోట్ల, దక్షిణ తెలంగాణలో రెండు ఉమ్మడి జిల్లాల్లో తేలికపాటి వర్షాలున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.