India Won In Uppal T20 Match: ఉప్పల్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగి 133 పరుగుల భారీ తేడాతో బంగ్లాను చిత్తుగా ఓడించింది. చివరి టీ20లోనూ విజయ ఢంకా మోగించి మూడు మ్యాచ్‌ల సిరీస్ కైవసం చేసుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 297 పరుగులు చేసిన భారత్.. బంగ్లా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా బ్యాటర్లలో హిర్దోయ్ (63), లిటన్ దాస్ (42) మాత్రమే టాప్ స్కోర్ చేశారు. మిగిలిన బ్యాటర్లు తక్కువ స్కోరుకే ఔటయ్యారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 3, మయాంక్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. వాషింగ్టన్ సుందర్, నితీశ్ రెడ్డి చెరో వికెట్ తీశారు.


భారత్ రికార్డు


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు.. బంగ్లా బౌలర్లపై విరుచుకుపడింది. సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ విజృంభించారు. ఓపెనర్ అభిషేక్ శర్మ (4 పరుగులు) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. సంజూ శాంసన్ 47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 111 పరుగులు చేశారు. సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సులు బాది 75 పరుగులు చేశాడు. ఆఖర్లో రియాన్ పరాగ్ 34, హార్దిక్ పాండ్య 47 పరుగులు చేశారు. నీతీశ్ రెడ్డి డకౌట్‌గా వెనుదిరిగాడు. రింకూ సింగ్ (8) నాటౌట్‌గా నిలిచాడు. అటు, బంగ్లా బౌలర్లలో షకీబ్ 3, టస్కిన్, ముస్తఫిజుర్, మహ్మదుల్లా ఒక్కో వికెట్ తీశారు.


ఈ మ్యాచ్‌లో భారత్ రికార్డుల మోత మోగించింది. 47 బౌండరీలు బాది టీ20ల్లో అత్యధిక బౌండరీల రికార్డు నమోదు చేసింది టీమిండియా. టెస్టు హోదా ఉన్న జట్టు టీ20ల్లో చేసిన అత్యదిక స్కోర్ (297) ఇదే. టీ20ల్లో బెస్ట్ పవర్ ప్లే స్కోర్ (82/1). 7.1 ఓవర్లలోనే వేగవంతంగా 100 పరుగులు సాధించింది. మొదటి 10 ఓవర్లలోనే 146/1 బెస్ట్ స్కోర్ చేసింది. టీ20ల్లో వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా సంజూ శాంసన్ నిలిచారు. టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించిన రెండో టీమ్‌గా రికార్డు నెలకొల్పింది. 14 ఓవర్లలోనే 200 పరుగులు చేసి వేగవంతమైన స్కోరు చేసిన జట్టుగా నిలిచింది. భారత ఇన్నింగ్స్‌లోనే ఆటగాళ్లు అత్యధికంగా 22 సిక్సర్లు బాదారు.


Also Read: Rishabh Pant: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో రిషబ్ పంత్ యాక్టింగ్ చేశాడా! రోహిత్ కామెంట్లపై స్పందించిన కీపర్