Significance of Jwala Thoranam : ఈ ఏడాది కార్తీక పౌర్ణమి, జ్వాలాతోరణం నవంబరు 15న వచ్చాయి. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో ప్రతిరోజూ ప్రత్యేకమే..అయినప్పటికీ క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి, జ్వాలాతోరణం విశిష్టతే వేరు. ఏటా కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలాతోరణానికి ఓ ప్రత్యేకత ఉంది.
కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయాల బయట రెండు కర్రలు నాటి వాటిపై అడ్డుగా మరో కర్ర పెడతారు. దానిపై ఎండుగడ్డిని తోరణంలా వేస్తారు. దీనినే యమద్వారం అని పిలుస్తారు. ఈ గడ్డిపై నెయ్యి పోసి మంట వెలిగిస్తారు. ఆ జ్వాల కిందనుంచి పల్లకిలో శివయ్యను మూడుసార్లు ఊరేగిస్తారు. ఆ తర్వాత ఆ జ్వాల కిందనుంచి దాటేందుకు భక్తులు పోటీపడతారు.
జ్వాలా తోరణం ఎందుకు వెలిగిస్తారంటే.. యమలోకంలో అడుగుపెట్టిన వెంటనే మొదటగా దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకంలో అడుగుపెట్టే ప్రతి వ్యక్తీ అగ్ని తోరణాన్ని దాటుకునే వెళ్లాలి. పాపాత్ములకు వేసే ప్రధమ శిక్ష ఇది. అందుకే ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే కార్తీకపౌర్ణమి రోజు శివాలయాల బయట నిర్వహించే జ్వాలాతోరణం దాటాలి. కార్తీక పౌర్ణమి రోజు యమద్వారం నుంచి మూడుసార్లు దాటితే వారికి యమలోకంలో అడుగుపెట్టాల్సిన అవసరం ఉండదు.
శివుడి ఊరేగింపుతో పాటూ జ్వాలాతోరణం కింద నడిచినప్పుడు... పరమేశ్వరా ఇప్పటివరకూ చేసిన పాపాలు ఈ మంటల్లో దహనమైపోవాలి ఇకపై ఎలాంటి తప్పులు చేయకుండా ఉండేలా అనుగ్రహించు అని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి.
జ్వాలాతోరణం భస్మాన్ని బొట్టుగా పెట్టుకుంటే భూత ప్రేత పిశాచాల బాధలు తొలగిపోతాయి. జ్వాలాతోరణం దర్శనం వల్ల పునర్జన్మ ఉండదంటారు పండితులు
అమృతం కోసం క్షీరసముద్రాన్ని మధించినప్పుడు ముందుగా హాలాహలం బయటకు వచ్చింది. సమస్త సృష్టిని నాశనం చేసే ఆ విషం నుంచి కాపాడమని దేవతలంతా పరమేశ్వరుడిని ప్రార్థించారు. అప్పుడు పార్వతీదేవి అనుమతితో శివుడు ఆ విషాన్ని సేవించాడు. ఆ సమయంలో తన భర్తకు ఎలాంటి మృత్యువు దరిచేరకూడదని భావించి పార్వతీదేవి జ్వాలాతోరణానికి నమస్కరించిందని చెబుతారు. అందుకే జ్వాలాతోరణం దాటినా, చూసి నమస్కరించుకున్నా అపమృత్యుభయం తొలగిపోతుందని పండితులు చెబుతారు.
Also Read: కార్తీక పౌర్ణమి రోజు అరుణాచల గిరిప్రదక్షిణ - ఈ 44 ఎనర్జీ పాయింట్స్ మిస్ చేయొద్దు ..ఇదిగో రూట్ మ్యాప్!
జ్వాలాతోరణం పూర్తిగా కాలిన తర్వాత ఆ గడ్డిని తీసుకొచ్చి ఇంట్లో, ధాన్యాగారంలో పెడతారు. ఈ గడ్డి ఉన్న చోట భూత ప్రేత పిశాచాలు అడుగుపెట్టలేవు. ఈ గడ్డి ఉన్నచోట సుఖశాంతులు లభిస్తాయి.
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః!
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః
భవంతి త్వం శ్వపచాహి విప్రాః!!
వెలిగించి దీప శిఖలో శివ కేశవులను ఆవాహనం చేసి దీపానికి అక్షింతలు వేసి నమస్కరించాలి. జ్వారా తోరణం రోజు వెలిగించే దీపానికి చాలా విశిష్టత ఉంది. పురుగులు, దోమలు, ఈగలు ఇలాంటి ఏ కీటకాలు అయినా దీపం వైపు ఎగిరివస్తే మోక్షం తథ్యం. దీపం వెలుగు ఎంత దూరం పడుతుందో..ఆ దీపాన్ని ఎవరెవరు చూస్తున్నారో అవన్నీ మరణానంతరం భగవంతుడి సన్నిధికి చేరుకుంటాయని అర్థం.
Also Read: పౌర్ణమి రోజు వింత కాంతి..చీకటి పడగానే మాయమయ్యే శివలింగం - ఈ ఆలయ దర్శనం సాహసయాత్రే!