The disappearing temple of India – Stambheshwar Mahadev Temple:  ప్రతి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంటుంది..స్థల పురాణం ఉంటుంది..కొన్ని మహిమలు ఉంటాయి.. అందుకే నిత్యం ధూప దీప నైవేద్యాలతో, భక్తులతో కళకళలాడిపోతుంటాయి. అయితే సాధారణంగా ఏ ఆలయంలో అయినా బ్రహ్మముహూర్తంలో మొదలయ్యే పూజలు రాత్రి పవళింపు సేవవరకూ సాగుతాయి. కానీ గుజరాత్ అరేబియా సముద్రంలో ఉన్న ఈ ఆలయంలో శివయ్య సాయంత్రం వరకూ మాత్రమే దర్శనమిస్తారు. సూర్యాస్తమయం కాగానే మాయమై మళ్లీ సూర్యోదయం సమయానికి ప్రత్యక్షమవుతాడు..ఇదే ఇక్కడ అద్భుతం..


గుజరాత్ లో అరేబియా సముద్రం ఒడ్డున ఉండే ఈ ఆలయానికి దర్శనానికి వెళ్లడం అంటే పెద్ద సాహసయాత్ర చేసినట్టే. నిత్యం సముద్రంలో మునిగితేలుతూ తనకు తానే అభిషేకాలు చేసుకుంటాడు పరమేశ్వరుడు. ఇక్కడ శంకరుడి దర్శనం అంటే అతి కష్టం..అందుకే చిన్నారులను, వృద్ధులను దర్శనానికి అనుమతించరు. వాతావరణ పరిస్థితులు కొంచెం అదుపుతప్పినా పరిస్థితి ఏ క్షణం అయినా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. కేవలం సముద్రం అలలు తక్కువగా, ప్రశాంతంగా ఉన్న సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. 


Also Read: కార్తీకమాసంలో ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి - ఏం తినాలి , ఏం తినకూడదు!


ఎవరంటే వాళ్లు నేరుగా ఆలయానికి వెళ్లిపోయేందుకు అవకాశం ఉండదు..సముద్రం ఒడ్డునే ఉండే దేవాలయానికి చెందిన ఆశ్రమ నిర్వాహకులు భక్తులకు కొన్ని సూచనలు చేస్తారు. ఆ సూచనలు అనుసరించి వెళ్లి దర్శనం చేసుకుని నిర్ణీత సమయంలో తిరిగి వచ్చేయాలి...


దూరం నుంచి చూస్తే కేవలం అక్కడో ధ్వజస్థంభం మాత్రమే కనిపిస్తుంది..తీరం నుంచి దేవాలయం వరకూ ఓ తాడు కడతారు..ఆ తాడు సహాయంతో జాగ్రత్తగా శివయ్య సన్నిధికి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఎవ్వరూ పూజారులు ఉండరు. భక్తులు నేరుగా తాము తీసుకెళ్లిన పూలు, ప్రసాదాలను స్వయంగా సమర్పించి మళ్లీ ఆ తాడు సహాయంతో ఒడ్డుకి చేరుకోవాల్సి ఉంటుంది


ఇలా పూలు శివలింగానికి సమర్పించి వస్తారో లేదో..వెంటనే అలల తాకిడికి ఆ పూలు ఒడ్డుకు చేరుకుంటాయి..వాటిని తీసుకుని ప్రసాదంగా భావించి తీసుకెళ్తారు. ఈ పూలు ఇంటికి తీసుకెళితే అన్నీ శుభాలే జరుగుతాయని, శివయ్య అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. 


భక్తులకు ఆలయ ప్రవేశ సమయం సాధారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి మొదలవుతుంది..సాయంత్రం ఆరున్నర లోపు ఎంత మంది దర్శించుకోగలిగితే అంతమంది భక్తులు ఆలయానికి వెళ్లి రావొచ్చు.. సూర్యాస్తయమం అయిన తర్వాత మాత్రం అనుమతి ఉండదు. ఆశ్రమ నిర్వాహకుల సూచనలు పట్టించుకోకుండా విరుద్ధంగా ప్రవర్తిస్తే ప్రాణాలతో చెలగాటం ఆడినట్టే. 


Also Read: మీరు దర్శించుకుంటున్నది ఎలాంటి శివలింగం - ఎన్ని రకాలున్నాయో తెలుసా!


నిత్యం సముద్రంలో మునిగితేలే ఈ ఆలయం అలల తాకిడికి కూడా ఎక్కడా దెబ్బతిన్నట్టు కనిపించదు. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజు ఇక్కడ శివలింగం నుంచి ఓ కాంతి వస్తుంది..సాధారణ రోజుల్లో కన్నా పౌర్ణమి రోజు శివలింగం వెలుగు చూసేందుకు రెండు కళ్లు చాలవు. అయితే పౌర్ణమి రోజు అలల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల ఈ రోజు శివయ్య దర్శన చాలా కష్టంతో కూడుతున్న పని.


తారకాసురడని వధించిన తర్వాత స్వయంగా కుమారస్వామి ఈ లింగాన్ని ఇక్కడ ప్రతిష్టించి పూజించాడని స్కాందపురాణంలో ఉంది. ఈ శివలింగాన్ని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోయి మరణానంతరం శివసాయుజ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. 


మరో కథనం ప్రకారం కురుక్షేత్ర సంగ్రామం తర్వాత...సోదరులను హతమార్చిన పాపం నుంచి విముక్తి కోసం పాండవులు స్వయంగా ఈ లింగాన్ని ప్రతిష్టించారని చెబుతారు. ఇక్కడ ఐదు లింగాలుంటాయని..అవి ఎప్పుడో ఓసారి మాత్రమే దర్శనమిస్తాయని అంటారు..


ఈ ఆలయం గోపురానికి ఉండే జెండాను ఏడాదికి ఓసారి మారుస్తారు. ఏడాది పాటూ అలలు, తుపానులు వచ్చినా ఆ జెండా చెక్కచెదరకపోవడం స్వామి వారి మహిమే అంటారు భక్తులు.


Also Read: కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ - శివతాండవ స్తోత్రం ఎందుకంత పవర్ ఫుల్!
 
ఓ రోజు మొత్తం సముద్రం ఒడ్డున ఉండగలిగితే...సూర్యకాంతిలో వెలుగులోకి వచ్చి వెన్నెల వెలుగుల్లో సముద్రంలో కలసిపోయే స్వామివారిని చూడగలం. ఉదయాన్నే వెళితే అక్కడ కేవలం జెండా మాత్రమే కనిపిస్తుంది..మధ్యాహ్నం నుంచి ఆలయం నెమ్మదిగా వెలుగుచూడడం మొదలవుతుంది. అలా సముద్రం వెనక్కు వెళుతూ ఉంటుంది..అప్పుడు తాడు సహాయంతో వెళ్లి దర్శనం చేసుకుని రావడమే. ఓవరాల్ గా చెప్పాలంటే వెన్నల వెలుగుల్లో అలలు ఎగసి పడుతూ శివుడిని లోపలకు తీసుకెళ్లిపోయే దృశ్యం అత్యద్భుతం అంటారు భక్తులు.