Kartika Purnima 2024: కార్తీక పౌర్ణమి వేళ శైవ, వైష్ణవ క్షేత్రాలు పంచాక్షరి, అష్టాక్షరి మంత్రాలతో మారుమోగిపోతుంటాయి. ఆలయ ప్రాంగణంలో ఆకాశంలో నక్షత్రాల్లో దీపాలు మిణుకుమిణుకుమంటాయి. వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించి భక్తులంతా ఆలయాల దగ్గర బారులుతీరుతారు. 365 వత్తులు వెలిగిస్తారంతా....
“దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్
దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే”
దీపాన్ని ప్రాణానికి ప్రతీకగా చెబుతారు. జీవాత్మకే కాదు పరమాత్మకి కూడా ప్రతిరూపం దీపం. అందుకే ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా దీపం వెలిగిస్తారు. దేవుడిని పూజించేందుకు ముందు ఆ భగవంతుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తారు. షోడశోపచారాల్లో ఇది మొదటిది. అన్ని ఉపచారాలు చేయలేక పోయినా కనీసం దీపం, ధూపం, నైవేద్యం తప్పనిసరిగా అనుసరిస్తారు
Also Read: కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం ఎందుకు దాటాలి.. విశిష్టత ఏంటి.. కాలిన గడ్డి తీసుకొచ్చి ఏం చేయాలి!
మట్టి ప్రమిదలో దీపారాధన చేసినా పర్వాలేదు కానీ స్టీలు సామగ్రిని దీపానికి వినియోగించరాదు. అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగించవద్దు, ఏకహారతి కానీ అగరుబత్తితో కానీ దీపాన్ని వెలిగించండి. ఒకవత్తి దీపం అశుభం..ఎప్పుడూ శుభానికి ఒకవత్తితో దీపం పెట్టకూడదు.
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య ర్జ్యోతి ర్నమోస్తుతే
దీపం ఎలా వెలిగించాలో ఈ శ్లోకం ఆరంభంలో క్లియర్ గా ఉంది.. సాజ్యం త్రివర్తి సంయుక్తం అంటే...“మూడు వత్తులతో కూడిన దీపం అని అర్థం. మూడు వత్తులను నూనెలో తడిపి అగ్నితో వెలిగించిన ఈ దీపం మూడు లోకాల చీకట్లను పోగొట్టుగాక. నరకం నుంచి రక్షించే ఈ దీపానికి , భగవంతుడికి ప్రతిరూపం అయిన ఈ జ్యోతికి భక్తితో నమస్కరిస్తున్నా అని అర్థం. మూడు వత్తులు ఎందుకంటే అవి మూడు లోకాలకి, సత్త్వ, రజ, తమో గుణాలకి ..మూడు కాలాలకి సంకేతం.
ఎన్నో విశిష్టతలకు నెలవైన ఈ దీపానికి కార్తీకమాసంలో మరింత ప్రాధాన్యత ఉంది. నిత్యం దీపం వెలిగించేటప్పుడు మూడు అడ్డ వత్తులు లేదా బొడ్డు వత్తులు చేసి వెలిగిస్తారు. పూజలు, నోముల సమయంలో అయిదు పోగులు, 9 పోగులు, కమల వత్తులు ఇలా వివిధ రకాల దీపాలు వినియోగిస్తారు.
ఇంత విశిష్టత ఉన్న దీపాన్ని నిత్యం వెలిగించలేకపోయిన వారు కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగిస్తే ఏడాదంతా దీపం పెట్టిన ఫలితం లభిస్తుందని కార్తీకపురాణంలో ఉంది.
తమస్సును పోగొడుతుంది కాబట్టే... తమసోమా జ్యోతిర్గమయా అని ప్రార్థిస్తారు. అజ్ఞానాన్ని పోగొట్టి అంధకారాన్ని తొలగించే ఈ జ్ఞానం అనే దీపాన్ని కార్తీకమాసంలో వెలిగిస్తే విశేష ఫలితం ఉంటుంది
ముఖ్యంగా కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి ఘడియలు ఉంటాయి కాబట్టే కార్తీకం అనే పేరొచ్చింది. కృత్తిక అగ్ని సంబంధిత నక్షత్రం. అగ్నికి సూక్ష్మ రూపం దీపం..అందుకే ప్రత్యక్ష దైవాల్లో ఒకటైన అగ్నిని ఆరాధించడమే ఆంతర్యం. అగ్ని రూపంలో ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేయడమే దీపం. ఏ ఇంట్లో నిత్యం దీపం వెలుగుతుందో ఈ ఇంట ఈతిబాధలకు తావుండదు, ప్రతికూల శక్తులు అడుగుపెట్టలేవు. ఇక ఏడాది మొత్తం కుదరని వారు ఆ ఫలితాన్ని పొందడం కోసమే కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు
365 వత్తుల దీపాన్ని శివాలయం, వైష్ణవ ఆలయంలో వెలిగించవచ్చు..అవకాశం లేకపోతే ఇంట్లో తులసి మొక్క దగ్గర వెలిగించి నమస్కరించవచ్చు. పౌర్ణమి ఘడియలు ఉన్న సమయంలో దీపం వెలిగిస్తే సరిపోతుంది. పున్నమి కాంతుల్లో వెలిగిస్తే ఇంకా శుభం..