Sri Seetha Rama Swami Temple in Gambhiraopeta : సాధారణంగా ఆలయాల్లో దీపం వెలిగించి అర్థరాత్రి తలుపులు మూసేవరకూ ఘనం (ఆరిపోవడం అనే మాట వినియోగించకూడదు అందుకే ఘనం అవడం, కొండెక్కడం అనే పదాలు వినియోగిస్తారు) అవకుండా చూసుకుంటారు. ఆ తర్వాత మళ్లీ తెల్లారేసరికి గర్భగుడిని శుభ్రంచేసి దీపారాధన చేసి నిత్యపూజలు మొదలెడతారు. ఇక ఇంట్లో నిత్యం దీపారాధాన చేసేవారు ఆ దీపం సాయంత్రం వరకూ వెలిగితే చాలు...ఎంతో అదృష్టం అని భావిస్తారు. ఏదైనా పూజాకార్యక్రమం తలపెట్టినప్పుడు ఆ పూజ పూర్తయ్యేవరకూ వెలిగితే చాలని భావిస్తారు, మహా అయితే సాయంత్రం వరకూ ఉంటే హమ్మయ్య అనుకుంటారు. కానీ కరీంనగర్ జిల్లా గంభీరావుపేటలో ఉన్న ఆలయంలో మాత్రం దీపం.. రోజులు, నెలలు, ఏడాది, రెండేళ్లు కాదు..ఏకంగా 700 సంవత్సరాలుగా నిర్విరామంగా వెలుగుతూనే ఉంది. 


Also Read: సింహరాశిలోకి సూర్యుడు - ఈ 4 రాశులవారికి ఆదాయం, ఆ రాశులవారికి అనారోగ్యం


1314 లో నిర్మించిన ఆలయం: హిందూ దేవాలయంలో విగ్రహ మూర్తులకు నిత్యం ధూపదీప నైవేద్యాలు ఉండడం సాధారణ విషయమే. దేవాలయాల్లో నిర్వహించే పూజలను బట్టి ఆయా ప్రాంతాలు ప్రజల సుఖ సంతోషాలతో ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆలయాల్లో నిత్య దీపారాధన చేస్తుంటారు.అయితే  కరీంనగర్ జిల్లాలో ఉన్న సీతారామస్వామి ఆలయానికి ఓ విశిష్టత ఉంది. ఈ దేవాలయంలో సుమారు 700 ఏళ్లుగా దేదీప్యమానంగా దీపం వెలుగుతూనే ఉంది. ఈ ఆలయాన్ని 1314 లో కాకతీయుల చివరి రాజైన ప్రతాపరుద్రుడు నిర్మించినట్లు అప్పటి శిలా శాసనాన్ని బట్టి తెలుస్తోంది. ఆలయ నిర్మాణ సమయంలో వెలిగించిన దీపం అప్పటి నుంచి ఇప్పటి వరకు వెలుగుతూనే ఉంది. 


ప్రజల చెల్లించిన పన్నుల నుంచి నూనె కొనుగోలు: ఆలయ నిర్మాణ సమయంలో వెలిగించిన  ఈ దీపం నిరంతరాయంగా వెలుగుతూనే ఉండడానికి అప్పటి రాజులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆ కాలంలో ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల్లో కొంత డబ్బును దీపానికి నూనె కోసం సమకూర్చేవారట. అయితే రాజుల కాలం అంతరించిపోయిన తర్వాత గ్రామంలో కొందరు దాతలు ముందుకొచ్చి దేవాలయానికి నూనె సమకూరుస్తున్నారు. ప్రస్తుతం గంభీరావుపేట చెందిన అయిత రాములు, ప్రమీల దంపతులు తాము జీవించి ఉన్నంత కాలం నూనెను అందిస్తామని స్వామివారికి నమస్కరించుకున్నారు.  


Also Read: దానం-ధర్మం ఈ రెండిటికీ ఉన్న వ్యత్యాసం ఏంటి, ఏ దానం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది!


ఈ ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.  ఆసమయంలో గుడితో పాటు నంద దీపాన్ని చూసేందుకే ప్రత్యేకంగా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఆలయం ఎదురుగా ఉన్న కళ్యాణ మండపాన్ని 16 స్తంభాలతో చతురస్రాకారంలో రాతితో నిర్మించారు. ఏటా ఈ మండపంలోనే సీతారాముల కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. ఏది ఏమైనా ఒక యజ్ఞంలా కొనసాగుతున్న ఈ దీపాన్ని వెలిగించే ప్రక్రియ ఇలాగే కొనసాగాలని అంతా ఆశిస్తున్నారు.


శ్రీరామచంద్రుడి శ్లోకం


శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి