Makara Sankranthi Festival Special: సంక్రాంతి పండుగ అంటేనే సంబరాలకు కేరాఫ్‌ అడ్రస్‌. భూమి మీద పండే పంటలకు.. ఆకాశంలో ఎగిరే పతంగులకు సజీవ సాక్ష్యం ఈ సంక్రాంతి. ఇది పెద్దల పండుగ, పశువుల పండుగ, గొబ్బెమ్మల పండుగ, ముగ్గుల పండుగ, గంగిరెద్దుల పండుగ, జానపదాలు, హరిదాసుల సంకీర్తనల కలయికతో అత్యంత శోభాయమానమైన పండుగ సంక్రాంతి. అన్నింటికీ మించి మనిషి భూమ్మీద జరుపుకున్న తొలి పండుగ కూడా సంక్రాంతేనని హిందూ పురాణాలలో తెలుపబడింది.


మన రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగకున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. పండుగకు పది రోజుల ముందు నుంచే రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో సంబరాలు మొదలవుతాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని  కోనసీమ జిల్లాల్లో సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్‌ నెక్స్‌ లెవల్‌ అనే చెప్పాలి. కొత్త అల్లుళ్ల వెటకారాలు, జోరుగా సాగే  కోడి, ఎద్దుల పందాలు, ఒక్కటేమిని ఊర్లకు ఊర్లు పండగవేళ కొత్త రూపును సంతరించుకుంటాయి. అక్కడ జరిగే కోడి పందేలను చూసేందుకు  దేశం నలమూలల నుంచి సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు క్యూకడతారు.  అంటువంటి సంక్రాంతి పండుగ గురించి మరిన్ని విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.


మకర సంక్రాంతి లేదా సంక్రాంతి మనదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ప్రాముఖ్యమైన పండుగగా నిలిచింది. సంక్రాంతి పండుగను దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు. అంతేకాదు సూర్యుడి మార్పును కూడా ఈ పండగ సూచిస్తుంది. సంక్రాంతిని  కొన్ని రాష్ట్రాల్లో మాఘి అని కూడ పిలుస్తారు. ఈ పండగ సూర్య భగవానుడికి అంకితం అని చెబుతుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది జనవరి నెలలో జరుగుతుంది.


శ్రీ మహా విష్ణువు ఆదివరాహ రూపంలో వచ్చి  ఈ భూమండలాన్ని హిరాణ్యాక్షుడి చెర నుంచి రక్షించి ఉద్దరించిన రోజు సంక్రాతేనని పురాణ కథనం. అలాగే శ్రీ మహావిష్ణువు వామనావతారంలో వచ్చి బలి చక్రవర్తి శిరుస్సుపై కాలుపెట్టి పాతాళానికి తొక్కింది కూడా ఈరోజునేనని హిందూ పురాణాలలో తెలుపబడింది. ఇక మహాభారత యుద్దంలో భీష్ముడు గాయపడి చనిపోయే సందర్భంలో ఉత్తరాయన పుణ్యకాలం వరకు అంటే సంక్రాంతి పండుగ వరకు వేచి ఉండి (భీష్ముడికి తన మరణాన్ని తాను నిర్ణయించుకునే వరం ఉంది) పండుగ రోజే అంటే సూర్యుడు మకర సంక్రమణం అయ్యిన వెంటనే తనువు చాలించాడు.


ఈ ఉత్తరాయణ పుణ్య కాలంలో చనిపోతే పుణ్యగతులు ప్రాప్తిస్తాయన.. ఈ సమయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణగాథల ప్రతీతి. ఇలా ఎన్నో విశేషాలు, పుణ్యఫలాలు మూటగట్టుకున్న పండుగ కనుకే ఇది పెద్ద పండుగ అయ్యింది. పెద్దల పండుగ అయ్యింది. ఈ పండుగ వేడుకలు అంత ఘనంగా జరుపుకోవడానికి కూడా మరో కారణం.. దేశవ్యాప్తంగా పంటలు చేతికి రావడమేనని పండితులు చెప్తున్నారు. ఈ పండుగను దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో జరుపుకుంటారు.


నార్త్‌ ఇండియాలో ఈ పండుగను మాఘీ లేదా లోహ్రీ అని పిలుస్తారు. గోవా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మకర సంక్రాంతిగా పిలుస్తారు. ఇక మధ్య భారతదేశంలో సుకరాత్ అని అస్సాంలో మఘ్ బిహు అని తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు. ఇక సంక్రాంతి పండుగ రోజు ఎన్నో రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. మన దేశంలో 12 సంవత్సరాలకు ఒకసారి అత్యంత వైభవంగా జరిగే కుంభమేళా కూడా మకర సంక్రాంతి రోజునే మొదలవుతుంది.