Dokka Seethamma Photos: ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం వెనుక డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కృషి ఉంది. అధికారంలోకి వస్తే డొక్కా సీతమ్మ క్యాంటీన్లు పెడతామని ఎన్నికల ప్రచారంలో పవన్ మాటిచ్చారు. కూటమి అధికారంలోకి రావడం..చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాలని నిర్ణయించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ మాట కూడా నెరవేరేలా..మిడ్‌-డే మీల్స్‌ ప్రోగ్రామ్‌కు డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. ఇంతకీ ఎవరీ డొక్కా సీతమ్మ...ఆమె గురించి ఈ తరం ఎందుకు తెలుసుకోవాలి. ప్రాణులకు అన్నాన్ని ప్రసాదించే అన్నపూర్ణాదేవి డొక్కా సీతమ్మగా అవతరించిందా అని అంతా ఆమెను తలుచుకుని నమస్కరిస్తారెందుకు. 


అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాల్లో అన్నదానం మిన్న..ఇలాంటి కొటేషన్స్ చెప్పుకునేందుకు బావుంటాయి..కానీ వాటిని  ఆచరించడం అత్యంత కష్టం. కానీ ఈ విషయంలో డొక్కా సీతమ్మకు సాటెవరూ లేరు. అందుకే ఆమెను ఆంధ్రుల అన్నపూర్ణ అని పిలుస్తారు.   


ఆకలి అంటూ తన ఇంటికి వచ్చిన వారందరి ఆకలి తీర్చిన అమ్మ ఆమె. ఆస్తులన్నీ కరిగిపోయాయి, కష్టాలు వెంటాడాయి అయినప్పటికీ నిత్యాన్నదానం ఆపలేదు. అన్నంపెట్టే అమ్మగా చరిత్రలో నిలిచిపోయింది. అందుకే ఆమె పేరు తలుచుకున్నా చాలు..అంతులేని పుణ్యం అని చెబుతారు ప్రవచనకర్తలు. 


ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన అనప్పిండి భవానీశంకరం, నరసమ్మ దంపతులకు 1841 అక్టోబర్‌లో జన్మించారు డొక్కా సీతమ్మ. ఈ ఇంట్లో నిత్యం ఆతిథ్యం సాగేది.  పి.గన్నవరం మండలం లంకల గన్నవరానికి చెందిన డొక్కా జోగన్న..ఆ రోజుల్లో వేదసభలకు వెళ్తూ ఉండేవారు. ఓ రోజు మండపేటలో భవానీశంకరం ఇంటివద్ద ఆగారు. అక్కడ సీతమ్మ ఆతిథ్యానికి ఆనందించి ఆమెను వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత అత్తవారింట అడుగుపెట్టిన సీతమ్మ..ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఆకలంటూ వచ్చినవారిని ఆదరించారు. సమయం చూసుకోకుండా వచ్చిన వారికి వెంటవెంటనే వండి వడ్డించేవారు. సీతమ్మ గురించి ఆ నోటా ఈ నోటా విన్న పిఠాపురం మహారాజు, మహామంత్రి... బాటసారుల్లా మారువేషంలో వచ్చి ఆమె చేతి భోజనం చేసి వెళ్లేవారట.


Also Read: 9 నాగశక్తులను ప్రసన్నం చేసుకునే కవచం - సర్పదోషం, నాగదోషం సహా సకల దోషాలకు పరిహారం!


ఎప్పటి నుంచో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకోవాలని సీతమ్మ ఆశపడ్డారు. కానీ నిత్యాన్నదానంలో మునిగితేలడంతో అస్సలు కుదరలేదు. ఎట్టకేలకు ఓ రోజు స్వామి దర్శనం కోసం బయలుదేరారు. మార్గ మధ్యలో ఓ చెట్టుకింద సేదతీరుతున్న సమయంలో... అటుగా వెళుతున్న ఓ పెళ్లి బృందం కనిపించింది. సరిగ్గా అప్పుడే భోజన సమయం అయింది. సీతమ్మ గురించి ఆ నోటా ఈ నోటా విన్న ఆ పెళ్లి బృందం...ఆమె ఇంటికి వెళదామని మాట్లాడుకున్నారు.  వారి మాటలు ఆ పక్కనే ఉన్న సీతమ్మ చెవిన పడ్డాయి. అంతే...మరో ఆలోచన లేకుండా ఇంటికి తిరుగుపయనమయ్యారు. దైవదర్శనం కన్నా ఆకలితో ఉండేవారికి భోజనం పెట్టడమే గొప్పకదా అని ఆమె భావించారు. అందుకే అప్పటికప్పుడు ఇంటికిచేరుకుని..పెళ్లి బృందం వచ్చేలోగా భోజనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. 


ఓ ఏడాది గోదావరి ఉప్పొంగింది. ఆ రాత్రి ఓ వ్యక్తి ఆకలితో బాధపడుతూ గోదావరి లంకలో నుంచి సీతమ్మ గారూ ఆకలి వేస్తోంది అన్న పెట్టండి అంటూ కేకలు వేశాడు. ఆ పిలుపు అమ్మ చెవిన పడింది. అంతే వంటనే అన్నం వండేసి..ఆ రాత్రి ఉగ్రరూపం దాల్చిన గోదావరిలో తన భర్తసహాయంలో పడవలో అక్కడకు చేరుకుని అన్నం పెట్టింది ఆ మహాతల్లి. 
 
ఓ సారి సీతమ్మ ఇంటికి దొంగతానికి వచ్చిన ఓ వ్యక్తి పట్టుచీర తీసుకుని పారిపోతుండగా...జనం పట్టుకుని కొట్టబోయారు. ఇంతలో సీతమ్మకు మెలువకు వచ్చింది. ఆమెను చూసి కాళ్లపై పడ్డాడు. ఆ సమయంలో కూడా అన్న వండి భోజనం పెట్టి...ఆ పట్టుచీరను ఇచ్చేసి ఆశీర్వదించి పంపించింది ఆమె. ఇలా సీతమ్మ గురించి కన్నవి,విన్నవి...చాలా విషయాలు , ఆమె గొప్పతనం గురించి కథలు కథలుగా చెబుతారు..


Also Read: ఆగష్టు 04 చుక్కల అమావాస్య..ఇలా చేస్తే మీరు ఉహించనంత ఫలితం పొందుతారు!


ఆమె కేవలం అన్న దానమే కాదు, ఎన్నో పెళ్ళిళ్ళకూ, ఇతర శుభాకార్యాలకూ విరాళాలు ఇచ్చారు. చందాల రూపంలో కానీ, విరాళాల రూపంలో కానీ ఎవరి వద్దా ఏమీ తీసుకోపోవడం వల్ల ఆస్తిపాస్తులు కరిగిపోయి..ఆమె తర్వాత తరం ఈ వితరణ జరిపించలేకపోయారు.  


ఒకటి రెండు సంఘటనలు కాదు ఆమె గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. నిత్యాన్నదాత డొక్కా సీతమ్మ గురించి తెలుసుకున్న అప్పటి రాజులు, బ్రిటిష్‌ చక్రవర్తులు... ఆమెను గౌరవించాలని భావించారు. కానీ ఆ సన్మానాలను సున్నితంగా తిరస్కరించారు సీతమ్మ. వాస్తవానికి ఆ సన్మానానికి వెళ్లొచ్చే సమయంలో వందల మంది ఆకలి తీర్చొచ్చన్నది ఆమె మహోన్నత ఆలోచన.  


కింగ్‌ ఎడ్వర్డ్‌-7 పట్టాభిషేక వేడుకకు భారతదేశంలోని పెద్దపెద్ద వ్యక్తులతోపాటు డొక్కా సీతమ్మనూ రాణి ఆహ్వానించారు. ఆమె  తిరస్కరించడంతో.. అక్కడ సీతమ్మ ఫోటో పెట్టుకుని పట్టాభిషేక వేడుక చేశారని అంటారు. 1903 జనవరి 1న అప్పటి మద్రాస్ గవర్నమెంట్ సీతమ్మకు ప్రశంసాపత్రం కూడా ఇచ్చింది. భారతదేశ ఏడో బ్రిటిష్‌ చక్రవర్తి ఎడ్వర్డ్‌ పేరిట మద్రాసు ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ స్టోక్స్‌ ఈ ప్రశంసాపత్రం అందించారు. 


సీతమ్మ ఘనతను  ఏళ్ళ క్రితమే గుర్తించిన టీడీపీ ప్రభుత్వం... పి.గన్నవరం వద్ద వైనతేయ గోదావరిపై నిర్మించిన అక్విడక్ట్‌కు డొక్కా సీతమ్మ పేరు పెట్టింది. సీతమ్మ అక్విడెక్టును 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. సీతమ్మ ఘనతలు స్కూల్ బుక్స్‌లోకి కూడా ఎక్కాయి. ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు.  


Also Read: రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, నాగపంచమి సహా 2024 ఆగష్టు నెలలో వచ్చే పండుగలివే..!