Sri Raja Rajeswari Devi Alankaram: 2025 అక్టోబరు 02 గురువారం ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయ దశమి)..ఈ రోజు కనకదుర్గమ్మ శ్రీరాజ రాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తోంది. ఈ రోజు అమ్మవారిని ఎరుపు రంగుతో కొందరు, ఆకుపచ్చ రంగులో మరికొందరు అలంకరిస్తారు. చక్రపొంగలి, పులిహోర, గారెలు, బూరెలు నివేదిస్తారు.
విజయదశమి, శరన్నవరాత్రుల చివరి రోజు, ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి రూపంలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు భక్తులు.
శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతారం
శ్రీచక్రస్థిత, చిద్రూపిణిగా అమ్మవారు విశ్వాన్ని ప్రకాశింపజేస్తూ తన అనంత శక్తిని భక్తులకు అనుగ్రహిస్తుంది. ఈ రోజు అమ్మవారి రూపాన్ని చిరునవ్వుతో దర్శించుకోవడం అదృష్టం. భక్తులు ఆత్మసమర్పణతో అమ్మవారిని పూజిస్తే కష్టాలు తొలగి సకల కార్యాల్లో విజయం సిద్ధిస్తుందని దేవీ పురాణంలో ఉంది
శమీ వృక్ష పూజ విశిష్టత
విజయదశమి రోజున శమీ వృక్షానికి పూజ చేయడం విజయాన్ని అందించే మరో ముఖ్యమైన ఘట్టం. పాండవులు తమ అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత శమీ వృక్షం రూపంలో ఉన్న అపరాజిత దేవిని పూజించి తమ ఆయుధాలను తిరిగి పొంది, కౌరవులపై విజయం సాధించారు. ఆ రోజు విజయ దశమి. అందుకే ఈ పూజతో తమ జీవితాల్లో ఉన్న శత్రువులపై విజయం సాధించాలని..ఉన్నతమార్గంవైపు అడుగువేయాలని అమ్మవారిని ప్రార్థిస్తూ శమీ వృక్షానికి పూజ చేస్తారు.
శమీ పూజ శ్లోకం
“శమీ శమయతే పాపం, శమీ శత్రువినాసినీ!
అర్జునస్య ధనుర్దారీ, రామస్య ప్రియదర్శినీ!“
ఈ శ్లోకాన్ని పఠిస్తూ శమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.
పురాణాల ప్రకారం విజయదశమి
త్రేతాయుగంలో ఈ రోజున శ్రీరాముడు రావణాసురుని సంహరించి విజయాన్ని సాధించాడు
ద్వాపరయుగంలో, పాండవులు శమీ వృక్షానికి పూజించి తమ ఆయుధాలను పొందిన రోజు
ఆయుధ పూజ
విజయదశమి రోజు ఆయుధ పూజ ప్రత్యేకమైన విశిష్టత కలిగిఉంది. ‘ఆయుధ పూజ’ పేరుతో క్షత్రియులు యుద్ధాలకు వెళ్ళడానికి పూజలు చేస్తుండగా, కాలక్రమంలో వివిధ వృత్తుల వారు తమ వృత్తికి సంబంధించిన సాధనాలను పూజించే ఆచారం ఏర్పడింది. వాహనాలు, పనిముట్లు, ఆయుధాలను పూజించడం విజయాన్ని కలిగిస్తుంది.
విజయదశమి
భక్తుల విశ్వాసం ప్రకారం, విజయదశమి రోజున ప్రారంభించిన ఏ పనైనా విజయవంతం అవుతుంది. బూందీ, లడ్డూ వంటి ప్రసాదాలను అమ్మవారికి సమర్పిస్తారు. రవ్వకేసరి ఈ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యంగా సమర్పిస్తారు.
విజయదశమి రోజున సామూహిక పూజలు నిర్వహిస్తారు. ఇంట్లో కలశ పూజ, సామూహిక ఉద్యాపనలు నిర్వహిస్తారు. మండపాల్లో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహాన్ని ఈ రోజు నిమజ్జనం చేస్తారు.
ఈ రోజున అమ్మవారిని రాజరాజేశ్వరీ రూపంలో అమ్మవారిని పూజించడం వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధి, సర్వత్ర విజయం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
నవదుర్గల శ్లోకం
ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ||
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ |
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ ||
నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||
ఇలా దుర్గాదేవి తొమ్మిది రూపాలతో విరాజిల్లుతుంది
శ్లోకం
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాథకే,
శరణ్యే త్య్రంబకేదేవి నారాయణి నమోస్తుతే
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించినవి. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.