Kantara Chapter 1 Review Telugu - 'కాంతార చాప్టర్ 1' రివ్యూ: రిషబ్ శెట్టి మళ్ళీ సక్సెస్ కొడతారా? 'కాంతార' ప్రీక్వెల్ హిట్టా? ఫట్టా?
Kantara Chapter 1 Review In Telugu: రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా రూపొందిన సినిమా 'కాంతార చాప్టర్ 1'. పాన్ ఇండియా హిట్ 'కాంతార'కు ప్రీక్వెల్ ఇది. రుక్మిణీ వసంత్ హీరోయిన్. ఈ సినిమా ఎలా ఉందంటే?
రిషబ్ శెట్టి
రిషబ్ శెట్టి, రుక్మిణీ వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ తదితరులు
సినిమా రివ్యూ: 'కాంతార చాప్టర్ 1'
రేటింగ్: 3/5
నటీనటులు: రిషబ్ శెట్టి, రుక్మిణీ వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్, ప్రమోద్ శెట్టి, రాకేష్ పూజారి, ప్రకాష్ తుమినాడ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్ కశ్యప్
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
నిర్మాతలు: విజయ్ కిరగందూర్, చాళువే గౌడ
రచన - దర్శకత్వం: రిషబ్ శెట్టి
విడుదల తేదీ: అక్టోబర్ 2, 2022
Rishab Shetty's Kantara Chapter 1 Review In Telugu: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో 'కాంతార' ఓ అద్భుతం. సరిగ్గా మూడేళ్ళ క్రితం (సెప్టెంబర్ 30, 2022న) విడుదలైన ఆ సినిమాపై తొలుత ఎవరికీ అంచనాలు లేవు. అనూహ్యంగా పాన్ ఇండియా హిట్ అయ్యింది. హీరోగా, దర్శకుడిగా కన్నడతో పాటు ఇతర భాషల ప్రేక్షకులనూ రిషబ్ శెట్టి మెప్పించారు. దాంతో ఆ సినిమాకు ప్రీక్వెల్ 'కాంతార చాప్టర్ 1' తీశారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేశారు. మరి, ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.
కథ (Kantara Chapter 1 Story): 'కాంతార'లోని ఈశ్వరుని పూదోట మీద భాంగ్రా రాజు కన్ను పడుతుంది. సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. ఈశ్వర గణాలు కన్నెర్ర చేయడంతో మరణిస్తాడు. అప్పుడు బతికి బయటపడ్డ మహారాజు కుమారుడు రాజశేఖరుడు (జయరామ్) 'కాంతార' వైపు కన్నెత్తి కూడా చూడడు.
కొన్నేళ్ల తర్వాత... రాజశేఖరుని కుమారుడు కులశేఖరుడు (గుల్షన్ దేవయ్య)కు పట్టాభిషేకం జరుగుతుంది. వేటకు కాంతార అడవికి వెళతాడు. దాంతో తొలిసారి అడవిని దాటి కాంతార ప్రజలు బయటకు వస్తాడు. భాంగ్రాలో అడుగు పెడతారు. బందరు పోర్టులో వ్యాపారం చేయడం మొదలు పెడతారు. కాంతార కాపరి బెర్మే (రిషబ్ శెట్టి) ప్రవర్తన నచ్చి రాజకుమార్తె కనకవతి (రుక్మిణీ వసంత్) అతనికి దగ్గర అవుతుంది. అది కులశేఖరుడికి నచ్చదు. కుమారుడి పాలన, మద్యం మత్తులో తీసుకునే నిర్ణయాలు తండ్రి రాజశేఖరునికి నచ్చవు. తండ్రి వల్ల సాధ్యం కానిది తాను సాధిస్తానని కాంతార మీద ఉక్కుపాదం మోపుతాడు కులశేఖరుడు. అక్కడి ప్రజలను ఊచకోత కోయడం మొదలుపెడతారు.
తమ ప్రజలను కాపాడటం కోసం బెర్మే ఏం చేశాడు? కాంతారను అణిచివేయాలని కులశేఖరుడు వెళ్లిన తర్వాత ఏం జరిగింది? కడపటి దిక్కు ప్రజలు ఎవరు? వాళ్ళు ఏం చేశారు? కాంతార ప్రజలకు, బెర్మేకు ఈశ్వర గణాలు ఏ విధమైన సాయం చేశాయి? చివరకు ఏం జరిగింది? అనేది సినిమా.
విశ్లేషణ (Kantara Chapter 1 Review Telugu): 'కాంతార' విజయంలో దైవ కోలా / భూత కోలా కీలక పాత్ర పోషించింది. కర్ణాటక, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భక్తి శ్రద్దలతో నిర్వహించే సంప్రదాయం గురించి ఇతరులకు తక్కువ తెలుసు. ఆ ప్రాంత ప్రజలు తమ దైవాన్ని తెరపై చూసి తన్మయత్వం చెందారు. ఇతరులు కొత్తగా భావించడమే కాదు... పతాక సన్నివేశాల్లో రిషబ్ శెట్టి నటన, ఆ దైవత్వం చూసి ఆశ్చర్యపోయారు. అందువల్లే ఆ సినిమా ప్రీక్వెల్ 'కాంతార ఛాప్టర్ 1' మీద దేశవ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. మరి, ఈ సినిమా ఎలా ఉంది? అనేది చూస్తే...
సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ తీయడం కత్తిమీద సాములాంటి వ్యవహారం. ప్రేక్షకులకు తెలిసిన కథ, పాత్రలు లేదా కథాంశం ఉన్నప్పుడు అంచనాలు ఎక్కువ ఉంటాయి. అందుకేనేమో కథకుడిగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి భారీ తనం వైపు అడుగులు వేశారు. దర్శకుడిగా ప్రతి ఫ్రేమ్, సన్నివేశంలో విజువల్ గ్రాండియర్ కనిపించింది. అయితే కథకుడిగా మొదలు నుంచి ముగింపు వరకు ఎంగేజ్ చేయడంలో సక్సెస్ కాలేదు. ఈసారి ఈశ్వర గణాలకు తోడు అసుర గణాలను సైతం దించారు. అయితే... కాంతారలోని ఈశ్వరుని పూదోట కోసం చివరి వరకు వాళ్ళు ఎందుకు ప్రయత్నించలేదనేది అర్థం కాదు. వినోదం కోసం రిషబ్ శెట్టి రాసిన సన్నివేశాలు, చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. పైగా సినిమా నిడివి పెంచాయి. అందువల్ల మధ్య మధ్యలో కాస్త పట్టు సడలినట్టు అనిపిస్తుంది. ఓ మెయిన్ క్యారెక్టర్ ట్విస్ట్ ఊహించడం కష్టం కాదు.
'కాంతార'లో కన్నడ మట్టి వాసన కనిపిస్తుంది. పాన్ ఇండియా ప్రేక్షకుల కోసం ఆ మట్టి వాసన కంటే భారీ తనాన్ని ఎక్కువగా భుజాలపైకి ఎత్తుకుంది 'కాంతార ఛాప్టర్ 1'. 'కాంతార'లో కనిపించిన సహజత్వం ఇందులో లోపించింది. అందులోనూ, తాజా సినిమాలోనూ దైవ కోలా ఉంది. అయితే ఈసారి ఆ దైవత్వాన్ని భారీతనం బాగా కమ్మేసింది. సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీ బావుంది. 'బాహుబలి' వంటి భారీ సినిమా ప్రేక్షకులకు అందించాలనే తాపత్రయం కనిపించింది. దైవత్వంతో కూడిన ఒక కమర్షియల్ ప్యాకేజ్ ఫిల్మ్ ఇవ్వడంలో దర్శకుడు, కథానాయకుడు రిషబ్ శెట్టి తన ప్రతిభ చూపించారు.
'కాంతార' కథ ఎక్కడ ముగిసిందో... అక్కడ 'కాంతార ఛాప్టర్ 1' మొదలైంది. కానీ ఈసారి కథను కాలంలో మరింత ముందుకు తీసుకు వెళ్లారు. తెలియని కథ, ఆ అడవిలో కొత్త మనుషులను, సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు. దాంతో ప్రారంభం మరోసారి అబ్బురపరుస్తుంది. అయితే ఆ అనుభూతిని ఎంతోసేపు ఉంచలేదు. దైవత్వం నుంచి సగటు రాజులు - యుద్ధాలు / కోటలోని రాణి - అడవిలో తోటరాముడు ఫార్మటులోకి వస్తుంది. మళ్ళీ ఇంటర్వెల్ ముందు గానీ స్పీడ్ అందుకోలేదు. ఇంటర్వెల్ తర్వాత కూడా కొంత నెమ్మదిగా సాగినా పతాక సన్నివేశాలు అరగంట సేపు చూపు తిప్పుకోనివ్వకుండా చేశారు రిషబ్ శెట్టి.
టెక్నికల్ పరంగా 'కాంతార ఛాప్టర్ 1' ఇండియన్ సినిమా హిస్టరీలో హై స్టాండర్డ్స్ సెట్ చేస్తుంది. ముఖ్యంగా సినిమాలో వచ్చే పులి సీక్వెన్స్ హైలైట్. కోతులు వచ్చే సన్నివేశం కూడా! పులిని సహజంగా తీర్చిదిద్దారు. వీఎఫ్‌ఎక్స్ చాలా బాగా చేశారు. అరవింద్ ఎస్ కశ్యప్ కెమెరా వర్క్ సూపర్బ్. తెరపై ప్రతి సన్నివేశం గ్రాండియర్‌గా కనిపించడంలో ఆయన కృషి ఎక్కువ ఉంది. భాంగ్రా రాజ్యంలో శివలింగాన్ని ప్రతిష్ఠించే సన్నివేశంలో గానీ, పతాక సన్నివేశాల్లో గానీ కెమెరా వర్క్ ఎక్స్‌లెంట్. అజనీష్ లోక్‌నాథ్ మరోసారి సంగీతంతో సన్నివేశాలకు ప్రాణం పోశారు. వరహా రూపం పాట మళ్ళీ వస్తున్నా కొత్తగా వింటుంటాం. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడలేదు. యాక్షన్ కొరియోగ్రఫీ టీంను మెచ్చుకోవాలి. తెరపై ఫైట్ వచ్చిన ప్రతిసారీ గూస్ బంప్స్ వచ్చేలా చేశారు. అయితే యాక్షన్ మధ్యలో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ అవాయిడ్ చేయాల్సింది.
Also Read: 'కాంతార' vs 'ఇడ్లీ కొట్టు'... తెలుగులో ఎవరికి క్రేజ్ ఎక్కువ? ఎవరిది అప్పర్ హ్యాండ్??
'కాంతార'లో నటనకు రిషబ్ శెట్టి నేషనల్ అవార్డు అందుకున్నారు. మరోసారి తన నటనతో కథానాయకుడి పాత్రకు మాత్రమే కాదు... కథకు ప్రాణం పోశారు. దైవ కోలా సన్నివేశాల్లో రిషబ్ నటనకు ప్రేక్షకులు మళ్ళీ ఫిదా అవుతారు. కథకుడిగా కాస్త పట్టు తగ్గిన ప్రతిచోటా తన నటనతో సినిమాను భుజాలపై మోశారు. మళ్ళీ నేషనల్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. రుక్మిణీ వసంత్ అందాన్ని మించిన అభినయంతో ఆకట్టుకుంది. అవసరమైన చోట కోపం ప్రదర్శించడంలోనూ ప్రత్యేకత చాటుకుంది. పతాక సన్నివేశాల్లో జయరామ్ నటన బావుంది. గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి సహా మిగతా నటీనటులు పాత్రలకు తగ్గట్టు చేశారు.
కన్నడ మట్టి వాసనతో కూడిన కథ 'కాంతార' అయితే పాన్ ఇండియా అప్పీల్, భారీతనం సంతరించుకున్న సినిమా 'కాంతార ఛాప్టర్ 1'. కథలోకి వెళ్ళడానికి రిషబ్ శెట్టి కొంత సమయం తీసుకున్నారు. అందువల్ల ఫస్టాఫ్‌లో కొంత డిజప్పాయింట్ చేస్తుంది. అయితే ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా పికప్ అయ్యింది. మళ్ళీ కొంత స్లో డౌన్ అయినా... అరగంట సేపు సాగిన క్లైమాక్స్ పైసా వసూల్ సినిమాను అందించింది. అప్పటివరకూ ఉన్న లోపాలను మర్చిపోయేలా చేసింది. సాలిడ్ టెక్నికల్ వర్క్, ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్, క్లైమాక్స్ కోసం సినిమాను హ్యాపీగా చూడొచ్చు. అయితే 'కాంతార'ను దృష్టిలో పెట్టుకుని భారీ అంచనాలతో వెళ్లొద్దు.