Black Hanuman: సాధారణంగా మనం ఆంజ‌నేయ‌స్వామి దేవాలయాలలో సింధూరం రంగులో ఉండే హ‌నుమంతుడి విగ్రహాన్ని చూస్తాము. కానీ, నల్లరంగు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎప్పుడైనా చూసారా..? అలాంటి విగ్రహాలు ఏమైనా ఉన్నాయా? అని మీకు అనుమానం రావ‌చ్చు. దేశంలోని కొన్ని దేవాలయాల్లో నలుపు రంగు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మనం చూడవచ్చు. నల్లరాతి ఆంజనేయ స్వామి విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి? ఈ కాలా హ‌నుమాన్‌ కథ ఏంటి..?


కాలా హ‌నుమాన్ (న‌ల్ల రంగులో ఉండే ఆంజ‌నేయుడు)


తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌లోని గాజుల్‌పేట‌, బుర‌ద్ గ‌లి వ‌ద్ద 'శ్రీ కాలా హనుమాన్ మందిర్' ఉంది. కాలా హనుమాన్‌, నల్ల హనుమంతుని దర్శనం కోసం భక్తులు ప్రతిరోజూ ఇక్కడకు వస్తుంటారు. ఈ ఆలయంలో 1836వ సంవ‌త్స‌రంలో నల్ల రాయితో చేసిన‌ హనుమంతుని అందమైన విగ్రహాన్ని ప్రతిష్టించారు.


Also Read : వివిధ రూపాల్లోని హనుమంతుడిని పూజిస్తే వ‌చ్చే ఫ‌లితాలివే


ఈ విగ్రహానికి సంబంధించి ఓ అద్భుతమైన కథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు ఒక విగ్రహ తయారీదారుడు సంత్ శిరోమణి మఠంలో విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ఎద్దుల బండిలో విగ్రహాన్ని తీసుకు వెళుతున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఎద్దుల బండి ఆగింది. ఎంత ప్రయత్నించినా బండిని కదిలించలేకపోయారు. బాగా చీక‌టి ప‌డిపోవ‌డంతో మరుసటి రోజు వచ్చి తీసుకువెళ‌దామ‌ని విగ్రహంతో పాటు ఎద్దుల బండిని అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లిపోయాడు. అదే రోజు రాత్రి ఆంజ‌నేయ స్వామి సంత్ శిరోమ‌ణికి క‌ల‌లో క‌నిపించి.. బండి ఆగిపోయిన ప్ర‌దేశం నుంచి ప‌శ్చిమ దిశ‌లో విగ్ర‌హాన్ని ప్ర‌తిష్ఠించ‌మ‌ని ఆదేశించాడు. స్వామి ఆదేశం మేర‌కు ఆయ‌న సూచించిన ప్రాంతంలో 1836లో దట్టమైన అడవి మధ్యలో నల్లని హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్టించారు. త‌ద‌నంత‌ర కాలంలో విగ్ర‌హం ప్ర‌తిష్ఠించిన ప్రాంతం నిజామాబాద్ న‌గ‌రానికి కేంద్రంగా మారింది. 


108 ప్రదక్షిణలు


ఈ ఆలయంలో దత్తాత్రేయ స్వామి విగ్రహం ముందు నల్లని హనుమంతుని విగ్రహం ఉంటుంది. పూజారులు ఈ హనుమంతుని విగ్రహానికి రోజూ నూనె రాస్తారు. అనంతరం హనుమంతుని విగ్రహానికి చందనం పూసి అలంకరిస్తారు. ఇక్కడి హనుమాన్ విగ్రహానికి 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంద‌ని భ‌క్తులు విశ్వ‌సిస్తారు. మరికొందరు కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించే ముందు ఇక్క‌డికి వ‌చ్చి హ‌నుమ ఆశీస్సులు అందుకుంటారు. మ‌రి కొంద‌రు దుష్ట‌శ‌క్తుల నుంచి త‌మ‌ను, త‌మ కుటుంబాన్ని ర‌క్షించ‌మ‌ని వేడుకునేందుకు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.


జైపూర్‌లో నల్ల హనుమాన్ విగ్రహం


నిజామాబాద్‌తో పాటు రాజస్థాన్‌లోని జైపూర్‌లో రెండు నల్ల హనుమాన్ విగ్రహాలు కనిపిస్తాయి. ఈ విగ్రహాలలో ఒకటి సిల్వర్ మింట్‌లో, మరొకటి జలమహల్ సమీపంలో ఉన్నాయి. జైపూర్‌లోని సంగనేరి గేట్ వద్ద తూర్పు ముఖంగా ఉన్న నల్ల హనుమాన్ విగ్రహాన్ని అమెర్‌కు చెందిన రాజా జైసింగ్ ప్రతిష్టించినట్లు చెబుతారు. జైపూర్‌లోని ఈ ఆలయం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. బయటి నుంచి చూస్తే ఈ ఆలయం రాజభవనంలా కనిపిస్తుంది. ఇక్కడ హనుమంతుని నల్లని విగ్రహమే కాకుండా ఇతర దేవుళ్లు, దేవతల విగ్రహాలను కూడా చూడవచ్చు.


నల్ల హనుమాన్ విగ్రహానికి సంబంధించిన కథ


పురాణాల ప్రకారం, హనుమంతుని విద్యాభ్యాసం పూర్తయినప్పుడు, ఆయ‌న త‌న గురువైన‌ సూర్య భ‌గ‌వానుడికి గురుదక్షిణ ఇవ్వాల‌ని భావించాడు. అప్పుడు సూర్యభగవానుడు త‌న‌ కుమారుడైన శనిని నాకు దక్షిణగా తీసుకురమ్మని చెప్పాడు. అప్పుడు హనుమంతుడు శనిదేవుని వద్దకు వెళ్తాడు. హనుమంతుడిని చూసి శనికి కోపం వస్తుంది. త‌న‌ ఎర్రటి కన్ను హనుమంతునిపై ప్ర‌స‌రించ‌డంతో ఆయ‌న‌ ఛాయ నల్లగా మారుతుంది. అయిన‌ప్ప‌టికీ ఆంజ‌నేయుడు శ‌నిదేవుడిని త‌న గురువైన సూర్యుని వ‌ద్ద‌కు తీసుకువెళ‌తాడు. దీంతో ఆయ‌న గురుభ‌క్తికి మ‌గ్ధుడైన సూర్య భ‌గ‌వానుడు శ‌నివారం రోజు ఎవ‌రైనా హ‌నుమంతుడిని ఆరాధిస్తే శ‌ని వ‌క్ర దృష్టి వారిపై ప్ర‌భావం చూప‌ద‌ని వ‌ర‌మిచ్చాడు. నల్లటి హనుమంతుడి విగ్రహాలు చాలా అరుదు. మీకు ఎక్కడైనా ఇలాంటి విగ్రహాలు కనిపిస్తే, తప్పకుండా కాలా హ‌నుమాన్‌ ఆశీస్సులు పొందండి.


Also Read : హనుమాన్ చాలీసా ఎందుకు పఠించాలో తెలుసా?


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.