Hindu Marriage System: హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వివాహం అంటే విశేషమైన సమర్పణం అని అర్థం.  పరిణయం, ఉద్వాహం, కల్యాణం, పాణిగ్రహణం, పాణిపీడనం, పాణిబంభం, దారోప సంగ్రహణం, దార పరిగ్రాహం, దారకర్మ, దారక్రియ అనే ఎన్నో పేర్లున్నాయి. ఇప్పుడంటే రకరకాల పద్ధతుల మునువు వివాహాన్ని8 రకాలుగా విభజించాడు.


Also Read: పెళ్లి ఎందుకు చేసుకోవాలి - ఒంటరిగా ఉండిపోతే ఏమవుతుంది - పురాణాలు ఏం చెబుతున్నాయి!


బ్రాహ్మోదైవ స్తధైవార్షః ప్రాజాపత్యస్తధాసురః | 
గాంధర్వో రాక్షసశ్చైవ పైశాచ శ్చాష్టమోథమః ||


వివాహాలు 8 రకాలు
1. బ్రాహ్మం 2. దైవం
3. ఆర్షం  4. ప్రాజాపత్యం
5. అసురం 6. గాంధర్వం
7. రాక్షసం 8. పైశాచం 


బ్రాహ్మం
లక్ష్మీదేవిలా అలంకరించిన కన్యను పండితుడు, శీలవంతుడు అయిన వరుని ఆహ్వానించి దానం చేస్తే బ్రాహ్మ వివాహమౌతుంది.  ఉదాహరణ శాంతా ఋష్యశృంగుల వివాహం 


దైవం
యజ్ఞంలో ఋత్విక్కుగా వున్న వారికి - దక్షిణగా కన్యను ఇచ్చి వివాహం చేస్తే అది దైవ వివాహమౌతుంది. 


Also Read: పెళ్లిలో సుముహూర్తం అంటే ఏంటి - జీలకర్ర బెల్లమే ఎందుకు పెడతారు!


ఆర్షం
వరుని నుంచి గోవుల జంటను తీసుకుని కన్యను ఇవ్వటం ఆర్ష వివాహం. ఇది ఋషులలో ఎక్కువగా వుండేది గనుక ఆర్షం అయింది. 


ప్రాజాపత్యం
వధూవరులిద్దరు కలిసి ధర్మాన్ని ఆచరించండి అని చెప్పి కన్యాదానం చేయటం ప్రాజాపత్యం అవుతుంది. మహానుభావుడికి  సహ ధర్మ చారిణిగా ఉండమని ఆశీర్వదించి కన్యను అప్పగించడమే ప్రాజపత్య వివాహం అంటారు.  ఉదాహరణ సీతారాములు


అసురం వివాహం
వరుని వద్ద డబ్బు తీసుకుని కన్యను ఇస్తే (కన్యాశుల్కం) అది అసుర వివాహం .ఉదాహరణ - కైకేయీ దశరథులు


గాంధర్వం
పరస్పరం అనురాగంతో (మంత్ర విధానం లేకుండా) చేసుకునేది గాంధర్వ వివాహం . ఉదాహరణ శకుంతలా దుష్యంతులు
 
రాక్షసం
యుద్ధం చేసి, కన్యను అపహరించి, ఎక్కడికో తీసుకువెళ్ళి చేసుకునే వివాహం రాక్షసం అంటారు. ఉదాహరణ మండోదరి రావణులు 


పైశాచం
కన్య నిదుర పోయేటప్పుడు, ఏమర పాటుగా ఉన్నప్పుడు… ఆమెకు తెలియకుండా  తాళి కట్టి భార్యగా చేసుకుంటే ఆ వివాహాన్ని పైశాచిక వివాహం అంటారు.


వీటిలో బ్రాహ్మం శ్రేష్ఠం, ప్రాజాపత్యం ధర్మబద్ధమైన వివాహం...రాక్షసం, పైశాచం నిషిద్ద వివాహాలు..


Also Read: పెళ్లిలో వధూవరులు 7 అడుగులు ఎందుకు వేస్తారు? అంత అర్థముందా?


ఇలాంటి వివాహాలన్నీ వేద కాలంలోనే ఎక్కువగా జరిగేవి..ఇప్పుడు కేవలం పెద్దలు కుదిర్చిన వివాహం, ప్రేమ వివాహం రెండే రకాలు అనుసరిస్తున్నారు.  


మను స్మృతి 2000 సంవత్సరాల క్రితం రచించిన ఒక ప్రాచీన హిందూ ధర్మ నియమావళి. మనువు అనే రుషి ప్రధానంగా రాసినట్లు చెబుతున్న ఈ గ్రంథంలో మొత్తం 12 అధ్యాయాలు, 2,684 శ్లోకాలు ఉన్నాయి. ఈ నియమవాళిని మను ధర్మ శాస్త్రం లేదా మానవ ధర్మ శాస్త్రం అని పిలుస్తారు. ఇందులో గృహ, సామాజిక, మతపరమైన నియమాలు ఉంటాయి. మను స్మృతిలోని ఐదో అధ్యాయంలో మహిళల బాధ్యతల గురించి ప్రస్తావించారు.
స్త్రీలకు మను స్మృతి అత్యంత ఉన్నత స్థానాన్ని ఇచ్చిందని సంప్రదాయవాదులు అంటే...ఈ గ్రంథం పితృస్వామ్యాన్ని బలపరుస్తుందని స్త్రీ హక్కుల ఉద్యమకారులు అంటారు. వివాహ వ్యవస్థ గురించి మనుస్మృతిలో చాలా విషయాలు ప్రస్తావించాడు మనువు..


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial