Hindu Death Rituals: హిందూమతంలో ఎన్నో ఆచారాలుంటాయి. ఇందులో 16 సంస్కారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తారు. పుట్టుక నుంచి అంత్యక్రియల వరకూ జరిగే అతి ముఖ్యమైన సంస్కారాలు మొత్తం 16 అని చెబుతారు. వీటిలో ఆఖరి సంస్కారం అంత్యక్రియలు. మొదటి సంస్కారం నుంచి 15 సంస్కారాల వరకూ ప్రతిదాంట్లోనూ స్త్రీలు ప్రత్యక్షంగా అక్కడుంటారు..కార్యక్రమంలో పాల్గొంటారు. కానీ అంత్యక్రియలకు సాధారణంగా శ్మశాన వాటికకు పురుషులే వెళతారు..స్త్రీలను అనుమతించరు. ఎందుకు...


ఒక వ్యక్తి మరణించిన తర్వాత దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ఈ మధ్యకాలంలో పురుషులతో పాటూ స్త్రీలు కూడా శ్మశానాలకు వెళుతున్నారు. తనయులు లేని తల్లిదండ్రులకు ఆడపిల్లలే దహన సంస్కారాలు కూడా నిర్వర్తిస్తున్నారు. అయితే హిందూధర్మం ప్రకారం స్త్రీలను శ్మశానవాటికల్లోకి అనుమతించరు. దానికి కొన్ని కారణాలు కూడా చెబుతారు పండితులు.  


Also Read: రోగాలు మాయం, సంతాన యోగం - సంజీవని పర్వతం నుంచి రాలిన ముక్క ఆ క్షేత్రం!


ఆత్మ శాంతిని పొందదు


పురుషుల కన్నా స్త్రీల మనస్సు సున్నితమైనది. ఓ బాధని పురుషుడు గుండెల్లో దాచుకుంటే స్త్రీలు ఏడుపు రూపంలో బయటకు వ్యక్తం చేస్తారు. ఓ వ్యక్తి చనిపోయినప్పుడు గుండెపగిలేలా ఏడుస్తుంటారు..అయితే శరీరాన్ని శ్మశానానికి తీసుకెళ్లిన తర్వాత కూడా మహిళలు వచ్చి అక్కడ రోదిస్తే ఆత్మకు శాంతి కలగదట. ఆ ఏడుపు విని ఆత్మలు కూడా రోదిస్తాయట. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల చితిని తగులబెట్టినప్పుడు ఎముకలు నలిపే శబ్దం వస్తుంది..ఈ శబ్దాలకు మహిళలు, పిల్లలు భయపడతారని అంటారు.


కర్మ సమయంలో గుండు చేయించుకుంటారు


హిందూ విశ్వాసాల ప్రకారం కుటుంబంలోని పురుషులు..తనవారు పోయినప్పుడు, కర్మలు చేసినప్పుడు గుండు చేయించుకుంటారు. చేయించుకోవాలి కూా. అయితే స్త్రీలు ఈ నియమం పాటించలేరు. అంత్యక్రియలు మహిళలు చేయకూడదని చెప్పడం వెనుక ఇది కూడా ఓ కారణం అంటారు


Also Read: సూర్యాంజనేయం అంటారెందుకు - సూర్యుడు-ఆంజనేయుడు మధ్య ఉన్న బంధం ఏంటి!


దుష్టశక్తుల ప్రవేశం


శ్మశాన వాటికలో దహన సంస్కారాలు జరిగిన తర్వాత కూడా కొన్ని ఆత్మలకు శాంతి లభించదని, అవి తిరుగుతూనే ఉంటాయని చెబుతారు. అలాంటి  ఆత్మలు స్త్రీల శరీరంలోకి సులువుగా ప్రవేశిస్తాయట..అందుకే స్త్రీలను శ్మశానంలోకి అనుమతించరు


ఇంట్లోకి ప్రతికూల శక్తుల ప్రవేశం


అంత్యక్రియల సమయంలో ఇంట్లో ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి. అంటే ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్లను దహనసంస్కారాలకు తీసుకెళ్లాక ఆ ఇల్లు ఆ ఖాళీగా ఉండకూడదు. శ్మశానవాటికకు వెళ్లిన పురుషులు తిరిగి వచ్చాక స్నానమాచరించి ఇంట్లోకి ప్రవేశిస్తారు. అప్పటి వరకూ మహిళలు ఇంట్లోనే ఉండాలి..ఆ సమయంలో ఇల్లు ఖాళీగా ఉంటే దుష్టశక్తులు, ప్రతికూల శక్తులు లోపలకు ప్రవేశిస్తాయని చెబుతారు. అందుకే పురుషులు శ్మశానవాటికకు వెళ్లి మహిళలు ఇంట్లోనే ఉండాలంటారు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.