Bhole Baba Journey: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లా రతిభాన్ పూర్ గ్రామంలో భోలే బాబా అనే ఆధ్యాత్మికవేత్త నిర్వహించిన సత్సంగ్ లో తొక్కిసలాట చోటు చేసుకుని 116 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు కారణం 5 వేల మంది మాత్రమే పట్టేచోట 15 వేల మందితో సత్సంగ్ నిర్వహించడమేనని చెబుతున్నారు. ఈ క్రమంలోనే సత్సంగ్ నిర్వహించిన బాబా ఎవరు..? ఈ స్థాయిలో భక్తులు హాజరు కావడానికి ఆయనపై ఉన్న నమ్మకం ఏంటి..? అన్నదానిపై జోరుగా చర్చ సాగుతోంది. భోలే బాబా గురించి ఆసక్తికరమైన విషయాలను మీకు అందిస్తున్నాం. 


రతిబాన్ పూర్ గ్రామంలో ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించిన భోలే బాబా అసలు పేరు సౌరబ్ కుమార్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎటాహ్ జిల్లాలోని బహుదూర్ గ్రామంలో ఈయన జన్మించారు. ప్రస్తుతం ఈ బాబా వయసు 50 ఏళ్లకు పైబడే. ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖలో ఇంటిలిజెన్స్ బ్యూరోలో 18 ఏళ్లపాటు పనిచేసిన సౌరబ్ కుమార్ మనసు మార్చుకుని స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. ఖాకి దుస్తులు వదిలేసి శ్వేత వస్త్రాలను ధరించారు. ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టారు. సకర్ విశ్వ హరి భోలే బాబాగా అవతరించారు. తెల్ల రంగు సూటు, టై ధరించి ప్రవచనాలు చెబుతుంటారు. 


ప్రజలకు శాంతి, నీతి మార్గం బోధన.. 


భోలే బాబా తన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రజలకు శాంతి మార్గం, నీతి మార్గం బోధిస్తుంటారు. ఆయన నిర్వహించే నారాయణ సకర్ హరి సత్సంగులు మంగళవారమే జరుగుతుంటాయి. బాబా పక్కన ఆయన భార్య కూడా తరచుగా దర్శనమిస్తుంటారు. బాబాకు యూపీతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ లక్షలాదిమంది భక్తులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది వెనుకబడిన తరగతులకు చెందిన వారే. బాబా భక్తుల్లో అనేకమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉండడం విశేషం.


ఉత్తరప్రదేశ్ తోపాటు ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వరకు బాబాకు పేరు ప్రఖ్యాతులు విస్తరించాయి. భోలే బాబా కరోనా వైరస్ ఉధృతి సమయంలో వివాదంలో చిక్కుకున్నారు. 2022 మేలో సత్సంగ్ నిర్వహించేందుకు స్థానిక అధికారుల నుంచి అనుమతి కోరారు. కేవలం 50 మంది వస్తారని చెప్పారు. కానీ 50 వేల మందికిపైగా భక్తులు ఈ సత్సంగ్ కు హాజరయ్యారు. ఈ ఘటన అప్పట్ లో సంచలనాత్మకంగా మారింది.


అందరి దృష్టి బాబాపై పడింది. మీడియాకు, ప్రచారానికి దూరంగా ఉండడం బాబా ప్రత్యేకత. తన వ్యక్తిగత సమాచారం బయటకు వెల్లడానికి ఇష్టపడరు. సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటారు. సోషల్ మీడియాలో ఆయనకు అధికారికంగా ఖాతాలు కూడా లేవు. భక్తులే బాబా పేరిట సొంతంగా ఖాతాలు తెరిచి నిర్వహిస్తున్నారు. ఫేస్బుక్లో ఆయన పేరుతో ఉన్న ఖాతాకు మూడు లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. 


మృతులు పెరిగే అవకాశం 


ఇదిలా ఉంటే హత్రాస్ లో జరిగిన సత్సంగ్ తొక్కిసిలాటలో 116 మంది మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. మరో 150 మందికిపైగా గాయాలపాలయ్యారు. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు ఎక్కువగా ఉన్నారు. అయితే తీవ్రంగా గాయపడిన వారిలో కొందరు మృత్యువాత చెందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదం పట్ల ఇప్పటికే  దేశంలోని ప్రముఖులు సంతాపాన్ని తెలియజేసిన విషయం తెలిసిందే.