Hanuman Jayanti 2024: హనుమాన్ ని చూస్తే పిల్లలు ఎగరి గంతేస్తారు..భక్తి, దేవుడు అనే మాటలు వాళ్లకు పెద్దగా తెలియదు కాబట్టి ఆంజనేయుడంటే వాళ్లకి సూపర్ హీరో అంతే. మరి పవనసుతుడిని సూపర్ హీరో చేసి ఆ లక్షణాలేంటి? వాటి ప్రత్యేకత ఏంటో ఇక్కడ తెలుసుకుందాం...


హనుమాన్ చాలీశా లో 'అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా' అనే పదం ఉంటుంది. ఇవే హనుమాన్ ని సూపర్ హీరోగా నిలబెట్టాయి. తత్వ శాస్త్రంలో సిద్ధి అనే మాటకు చాలా ప్రాముఖ్యత ఉంది. సాధకుడు యోగమార్గంలో ముందుకు సాగుతున్నప్పుడు ఓ స్థాయిలో భౌతికమైన సూత్రాలను దాటిపోతాడని చెబుతోంది యోగం. అప్పుడు సిద్ధించే శక్తులే ‘సిద్ధులు’. యోగ సూత్రాల ప్రకారం ఈ సిద్ధులను యోగం ద్వారా సాధించవద్దు, ఒక్కోసారి పుట్టుకతోనే సిద్ధించవచ్చు...ఇంకా మంత్రబలంతోనూ , దివ్య పురుషుల నుంచి పొందొచ్చు. సాంఖ్యం, భాగవతం, బౌద్ధం ఈ సిద్ధులను వేర్వేరు రకాలుగా చెబుతోంది కానీ... ప్రచారంలో ఉన్న అష్టసిద్ధులు మాత్రం ఇవే...


Also Read: రామాయణంలో సుందరకాండకే ఎందుకంత ప్రాధాన్యం - సుందరకాండలో అసలేముంది!


అష్ట సిద్ధులు శ్లోకం


అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా,
ప్రాప్తిః ప్రాకామ్యమీశత్వం వశిత్వం చాష్ట సిద్ధయః
 
ఇవే అష్ట సిద్ధులు


అణిమ
అణిమ సిద్ధి అంటే అతి చిన్న అణువులా మారిపోవడం. భూతద్దం పెట్టి వెతికినా కనిపించంత చిన్నగా మారిపోవడం. ఆ సమయంలో తన మాటలు వినిపిస్తాయి కానీ ఆ వ్యక్తి కంటికి కనిపించరు. ఆంజనేయుడికి ఉన్న అష్టసిద్ధుల్లో ఇది మొదటిది..


మహిమ
శరీరాన్ని ఎంత పెద్దగా అయినా మార్చేయగలగడం. అంటే బ్రహ్మాడంలో ఓ కోణం నుంచి మరో కోణం వరకూ విస్తరించేయవచ్చు. అయితే బ్రాహ్మాండం మొత్తానికి తన శక్తి విస్తరించిందంటే ఈ బ్రహ్మాండం మొత్తం శ్రీరామచంద్రుడిలో భాగమే కదా ఇదంతా ఆయన ప్రసాదించిన వరమే అంటాడు రామభక్తుడు.


గరిమ
అష్ట సిద్ధుల్లో మూడోది గరిమ సిద్ధి. దీని ద్వారా అత్యంత బరువుగా మారిపోవడం. కనీసం కాలి వేలు కూడా ఎవ్వరూ కదపలేనంత బలంగా మారిపోతారు. మహాభారతంలో అరణ్యవాసంలో ఉన్న సమయంలో భీముడిని తన తోక తీసి పక్కనపెట్టమని చెప్పి గర్వం అణించేందుకు ఆంజనేయుడు ఉపయోగించిన శక్తి ఇదే..


Also Read: ఏప్రిల్ 23 చైత్ర పూర్ణిమ రోజు హనుమాన్ జయంతి కాదు హనుమాన్ విజయోత్సవం - ఈ రెండింటికి వ్యత్యాసం తెలుసా!


లఘిమ
గరిమ సిద్ధితో ఎంత భారంగా మారిపోతాడో...లఘిమ సిద్ధితో అంతే తేలిగ్గా పరివర్తనం చెందగలడు హనుమాన్. సముద్రం పైనుంచి లంకకు ఎగురుతూ వెళ్లాడంటే ఈ శక్తే కారేం...


ప్రాప్తి
ప్రాప్తి సిద్ధి ఉపయోగించుకుని ప్రపంచంలో అత్యంత కఠిన వస్తువునైనా సాధించవచ్చు...ఈ శక్తితో  ఏ వస్తువు కావాలనుకున్నా దాన్ని శూన్యం నుంచి సైతం సాధించవచ్చు. 


ఈశత్వం
రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు..ఈశత్వం అనే శక్తి ద్వారా అష్టదిక్పాలకును శాసించగలడు...అందుకే భూత ప్రేత పిశాచ భయం ఉన్నవారు ఆంజనేయుడిని ప్రార్థిస్తారు...


ప్రాకామ్యం
అష్టసిద్ధుల్లో ఏడోది అయిన ప్రాకామ్యం ద్వారా తాను ఏం కోరుకున్నా సాధించగల శక్తి ఉంటుంది...


వశిత్వ శక్తి
సకల జీవరాశులను వశం చేసుకునే శక్తి...ఈ సిద్ధి ద్వారా సాధ్యం అవుతుంది...


అష్ట సిద్ధులు శ్రీరామచంద్రుడు ప్రసాదిస్తే...ఆంజనేయుడికి నవనిధులు ఇచ్చింది సీతమ్మ...


Also Read: తమలపాకులంటే ఆంజనేయుడికి ఎందుకంత ప్రీతి!


ఇవే నవనిధులు
మహాపద్మ నిధి , పద్మ నిధి, ముకుంద నిధి, నీల నీధి, కశ్చప నిధి, శంఖ నిధి, మకర నిధి, కర్వ నిధి, వర నిధి...ఈ తొమ్మది నిధులు ఐశ్వర్యానికి ప్రతీక. ఈ నిధుల ద్వారా భూ, జల, లోహ సంపదలు లభిస్తాయి...