SBI Pre-Approved Loan: ఈ ప్రపంచంలో అప్పు అవసరం లేని, రాని మనుషులు అతి తక్కువ సంఖ్యలో ఉంటారు. డబ్బు కావలసిన వ్యక్తి తనకు తెలిసిన వాళ్లనో, బ్యాంక్‌నో ఆశ్రయిస్తాడు. రుణ గ్రహీతకు మంచి క్రెడిట్‌ స్కోర్‌ (Credit Score) ఉంటే, మన దేశంలోని బ్యాంకులు చాలా త్వరగా రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఒకప్పుడు, బ్యాంక్‌ లోన్‌ కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేంది. అధునిక సాంకేతికత వచ్చాక బ్యాంకింగ్‌ బాగా మారింది, లోన్‌ పొందడం సులువైంది. అయితే, బ్యాంక్‌లు లోన్‌ ఇచ్చే ముందు క్రెడిట్‌ స్కోర్‌/ సిబిల్‌ స్కోర్‌తో (CIBIL Score) పాటు నెలవారీ ఆదాయం, నెలవారీ ఖర్చులు, పని అనుభవం, బ్యాంక్‌తో సంబంధం, ఇతర రుణాలు వంటివి క్షుణ్ణంగా తనిఖీ చేస్తాయి. 


బ్యాంక్‌లు ఇచ్చే లోన్లలో.. ముందుగానే ఆమోదించిన రుణం (Pre-Approved Loan) ఒకటి. డబ్బు అత్యవసరమైన సందర్భంలో ఈ ఆప్షన్‌ చాలా సాయం చేస్తుంది, నిమిషాల వ్యవధిలోనే రుణం మంజూరువుతుంది. మన దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా'లో కూడా ప్రి-అప్రూవ్డ్ లోన్‌లను ఆఫర్‌ చేస్తోంది.


ప్రి-అప్రూవ్డ్ లోన్‌ అంటే ఏంటి?
ప్రీ-అప్రూవ్డ్ లోన్‌ అంటే.. రుణం కోసం మీరు దరఖాస్తు చేయకముందే, బ్యాంకే మీకు కొంత మొత్తం లోన్‌ మంజూరు చేసి ఉంచుతుంది. బ్యాంక్ దగ్గర ఉన్న మీ డేటాను పరిశీలించి, ఆర్థిక పరిస్థితిని సమీక్షించి, అర్హతలను బట్టి కొంత మొత్తాన్ని ప్రి-అప్రూవ్డ్‌ లోన్‌ రూపంలో ఆఫర్‌ చేస్తుంది. ఎంపిక చేసిన వ్యక్తులకు మాత్రమే బ్యాంక్‌ ఈ అవకాశం ఇస్తుంది. అవసరమైతే ఈ లోన్‌ తీసుకోవచ్చు, వద్దనుకుంటే వదిలేయొచ్చు. దీనివల్ల, రుణం కోసం దరఖాస్తు చేయాల్సిన పని లేదు. ఎలాంటి ప్రూఫ్‌లు సమర్పించాల్సిన అవసరం లేదు. ప్రాసెస్‌ మొత్తం ఆన్‌లైన్‌లో జరుగుతుంది. అది కూడా కొన్ని నిమిషాల్లోనే & కొన్ని క్లిక్స్‌తోనే పూర్తవుతుంది, డబ్బు మీ బ్యాంక్‌ అకౌంట్‌లో జమ అవుతుంది.


ప్రి-అప్రూవ్డ్‌ లోన్‌ వల్ల లాభాలు
తక్కువ ప్రాసెసింగ్ ఫీజ్‌ 
కేవలం కొన్ని క్లిక్‌లలో తక్షణ రుణం 
ఫిజికల్‌ డాక్యుమెంటేషన్ లేదు 
బ్యాంక్‌ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పని లేదు
ఇంట్లో కూర్చుని YONO లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పొందొచ్చు
24x7 రుణ లభ్యత


SBI ప్రి-అప్రూవ్డ్‌ లోన్‌ను ఎలా చెక్‌ చేయాలి?
మీ అర్హతను నిర్ధరించుకోవడానికి, మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నుంచి 567676కు "PAPL <స్పేస్‌> మీ బ్యాంక్‌ అకౌంట్‌లోని చివరి నాలుగు నంబర్లు" టైప్‌ చేసి SMS పంపాలి. ఉదాహరణకు.. మీ బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ 0123456789 అయితే, మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ నుంచి PAPL 6789 అని టైప్‌ చేసి 567676 నంబర్‌కు SMS చేయాలి. మీకు లోన్‌ అర్హత ఉంటే, SBI నుంచి వెంటనే రిప్లై వస్తుంది.


SBI ప్రి-అప్రూవ్డ్ లోన్‌ ఎలా పొందాలి?
స్టెప్‌ 1: మీ యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ ఉపయోగించి SBI YONO యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ కావాలి
స్టెప్‌ 2: PAPL మీద క్లిక్ చేయండి
స్టెప్‌ 3: అథెంటికేషన్‌ కోసం పాన్ వివరాలు & పుట్టిన తేదీని ఎంటర్‌ చేయండి
స్టెప్‌ 4: మీ అవసరమైన లోన్ మొత్తం, కాల పరిమితిని ఎంచుకోండి
స్టెప్‌ 5: మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు వచ్చే OTPని ఎంటర్‌ చేయండి. అంతే, లోన్‌ డబ్బు మీ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది


స్టేట్‌ బ్యాంక్‌కు 22,405 బ్రాంచ్‌లు, 65,627 ATMలు/ADWMలు, 76,089 BC అవుట్‌లెట్‌లు ఉన్నాయి. 48 కోట్ల మంది ఖాతాదార్లకు సేవలు అందిస్తోంది.


మరో ఆసక్తికర కథనం: గంటన్నర జర్నీ 7 నిమిషాల్లోనే పూర్తవుతుంది, ఎయిర్ టాక్సీ ఎగరబోతోంది