Air Taxi in India: ఆఫీస్‌కో, కాలేజీకో, ఇంకేదైనా అత్యవసరమైన పని మీదో బయటకు వెళ్లినప్పుడు ట్రాఫిక్‌ జామ్‌ అయితే ఏడుపొస్తుంది. వ్యవస్థ మీద కోపంతో నాలుగైదు తిట్లు కూడా తన్నుకొస్తాయి. "ఎగిపోతే ఎంత బాగుంటుంది" అన్న తెలుగు సినిమా పాట కూడా గుర్తుకొస్తుంది. ఆ పాట నిజమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. 


ఇండిగో ఎయిర్‌లైన్స్ మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్‌, అమెరికన్‌ కంపెనీ ఆర్చర్ ఏవియేషన్ మన దేశంలో ఎయిర్ టాక్సీని ప్రారంభించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారతదేశంలో ఎయిర్ టాక్సీ సేవలు 2026 నుంచి ప్రారంభం కావచ్చు. ఇవి లాంచ్‌ అయితే, దిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ నుంచి హరియాణాలోని గురుగావ్‌కు కేవలం 7 నిమిషాల్లో వెళ్లొచ్చు. కేవలం 2 వేల రూపాయల నుంచి 3 వేల రూపాయల ఖర్చుతో జర్నీ పూర్తవుతుంది. ప్రస్తుతం, కన్నాట్ ప్లేస్ నుంచి గురుగావ్‌ వరకు, దాదాపు 27 కిలోమీటర్ల దూరాన్ని కార్‌లో కవర్‌ చేయడానికి దాదాపు 90 నిమిషాల సమయం పడుతోంది. ఇందుకు 1500 రూపాయల వరకు ఖర్చవుతోంది. ఎయిర్‌ టాక్సీ ఎక్కితే అదే దూరాన్ని కేవలం 7 నిమిషాల్లో చేరుకోవచ్చని ఆర్చర్ ఏవియేషన్ ప్రకటించింది. అంటే.. ఎయిర్‌ టాక్సీ ఎక్కాక సీట్‌లో సర్దుకుని కూర్చునే లోపే డెస్టినేషన్‌ వస్తుంది. ఈ సర్వీస్‌ దిల్లీ, గురుగావ్‌ ప్రజలకు ఒక వరంగా మారుతుంది. 


ఎయిర్ టాక్సీ సర్వీసుల కోసం 200 విమానాలు
ఒప్పందం ప్రకారం, ఎయిర్‌ టాక్సీ సర్వీస్‌ల కోసం విద్యుత్‌తో నడిచే 200 "ఎలక్ట్రిక్‌ వెర్టికల్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌" (eVTOL) విమానాలను ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు ఆర్చర్‌ ఏవియేషన్‌ అందిస్తుంది. ఈ 200 విమానాల ధర దాదాపు ఒక బిలియన్‌ డాలర్లు లేదా 8,300 కోట్ల రూపాయలు.


పైలట్‌తో పాటు నలుగురు ప్రయాణికులు
"ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్‌ ల్యాండింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌"లో పైలట్‌తో పాటు నలుగురు ప్రయాణికులు ప్రయాణించగలరు. ఈ విమానాలు హెలికాప్టర్‌లా ఉంటాయి. కానీ, అవి అంత శబ్దం చేయవు, ఎక్కువ సురక్షితంగా ఉంటాయి. దిల్లీ తర్వాత ముంబై, బెంగళూరులో కూడా ఎయిర్‌ టాక్సీ సేవలు ప్రారంభం అవుతాయి. అమెరికా ఫెడరల్ ఏవియేషన్ (FAA) అడ్మినిస్ట్రేషన్‌తో తమ చర్చలు కొనసాగుతున్నాయని ఆర్చర్‌ ఏవియేషన్‌ ఫౌండర్‌ & CEO ఆడమ్ గోల్డ్‌స్టెయిన్ చెప్పారు. ఈ విమానాలకు అతి త్వరలో సర్టిఫికేట్‌ పొందొచ్చని చెప్పారు. FAA నుంచి అనుమతి పొందిన తర్వాత, భారతదేశ విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA) నుంచి కూడా పర్మిషన్‌ తీసుకోవాలి. వచ్చే ఏడాది చివరి నాటికి DGCA నుంచి సర్టిఫికెట్ పొందొచ్చని ఈ రెండు కంపెనీలు భావిస్తున్నాయి. 


40 నిమిషాల్లో పుల్‌ ఛార్జ్
"ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్‌ ల్యాండింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌"లో 6 బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ఇవి 30 నుంచి 40 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతాయి. ఒక నిమిషం ఛార్జ్ చేస్తే ఒక నిమిషం పాటు ఎగుగురుతుంది. భవిష్యత్‌లో ఈ విమానాలను భారత్‌లో తయారు చేసే అవకాశం ఉందని ఆడమ్ గోల్డ్‌స్టెయిన్ చెప్పారు.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి