హనుమాన్ జన్మస్థల వైభవాన్ని భక్తులకు తెలియజేసేందుకు టీటీడీ శ్రీకారం చుట్టింది. శేషాచలంలోని అంజనాద్రే హనుమంతుని జన్మస్ధలంగా వాజ్మయ, పౌరాణిక, చారిత్రక, శాసన ఆధారాల సమన్వయంతో నిర్ధారించింది టీటీడీ. కలియుగ వైకుంఠం తిరుమలలో వాయుపుత్రుని ఆలయాలు ఎన్నో ఉన్నాయి. శ్రీవారి ఆలయానికి అభిముఖంగా బేడీ ఆంజనేయస్వామి ఆలయంతో మొదలు, పాపవినాశనంకు వెళ్ళే మార్గంలో బాలహనుంతుడి ఆలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ధర్మగిరి వేద పాఠశాల సమీపంలో అభయాంజనేయ స్వామి ఇలా చెప్పుకుంటూ పోతే తిరుమలకు నలువైపులా అంజనాదేవి పుత్రుడి ఆలయాలు ఎన్నో ఉన్నాయి.
Also Read: ఆఫ్లైన్‌లో తిరుమలేశుడు సర్వదర్శనం టోకెన్లు, ఎన్ని జారీ చేస్తుందంటే?
అయితే హనుమంతుని జన్మస్ధలంపై భక్తులకు అనేక సందేహాలు అలాగే మిగిలే పోయాయి. వాటిని తీర్చేందుకు టీటీడీ ఒక స్పష్టమైన నివేదికను సమర్పించాలని భక్తులు కోరడంతో 15-12-2019 వ తేదీన జాతీయ సాంస్కృతి విశ్వవిద్యాలయ కులపతి మురళిధర్ అధ్యక్షుడిగా నియమిస్తూ ఓ కమిటీని ఏర్పాటు చేసింది . ఆ తర్వాత పురాణాలు, శాసనాలు ఆధారంగా శ్రీరామ నవమి నాడు అంటే 21-04-21వ తేదీన భనర్వల్ పురోహిత్ ఆధ్వర్యంలో హనుమన్ జన్మస్ధలం అంజనాద్రేగా కమిటీ నిర్ధారించింది. పీఠాధిపతులు, మఠాధిపతులు, హనుమన్ భక్తుల ఆధారాలు పరిశీలచేందుకు రెండు రోజుల పాటు తిరుపతిలో జాతీయ వెబినార్ ను టీటీడీ నిర్వహించింది. అక్కడ కూడా టీటీడీ నిర్ధారించిన ఆధారాలను పరిశీలించిన మఠాధిపతులు,ఫీఠాధిపతులు,హనుమన్ భక్తులు అంజానాద్రే హనుమాన్ జన్మస్థలం అని స్పష్టం చేశారు.
- వైకుంఠనాధుడు కొలువైయున్న ఏడుకొండలను బుషులు, మహర్షులు ఎన్నో పేర్లతో కీర్తించారు.కృతయుగంలో వృషభాద్రిగా, త్రేతాయుగంలో అంజనాద్రిగా, ద్వాపర యుగంలో శేషాద్రిగా, కలియుగంలో వేంకటాద్రిగా కీర్తించారు. శ్రీవారికి పరమ భక్తులైన అన్నమాచార్యులు, పురందర దాసు,వెంగమాంబ కూడా అంజనాద్రి పర్వతం గురించి కీర్తనల్లో ప్రస్తావించారు.
- అంజనాద్రే హనుమంతుడి జన్మస్ధలంగా శ్రీ వేంకటాచల మహత్యంలో పేర్కొన్నారు.
- ఇదే అంశాన్ని పద్మ,స్కంద బ్రహ్మాండ పురాణంలో ఉందంటున్నారు.
- శ్రీరామచంద్రుడు అయోధ్య నుంచి శ్రీలంకకు ప్రయాణించిన మార్గాన్ని వైజ్ఞానికంగా ఆక్షాంశాలు, రేఖాంశాలతో తిరుమల హనుమ జన్మస్ధలంగా రుజువు అవుతున్నాయని భౌగోళిక నిపుణులు అంటున్నారు.
- హోమాలు,క్రతువుల్లో చతుర్ణామాలలతో అర్చన చేస్తారని, త్రేతాయుగంలో తిరుమల ఆంజనేయ స్వామి వారి జన్మస్ధలంగా ప్రసిద్దికెక్కిందని పురాణాలు చెప్తున్నాయి.
- ప్రతి గురువారం నిర్వహించే తిరుప్పావైసేవలో పఠించే శ్రీనివాస గద్యం, ఆలవట్ట కైంకర్యంలో అంజనాద్రి ప్రాముఖ్యతను స్పష్టంగా వివరించారు
- అంజనాద్రిలో అంజనాదేవి తపస్సు చేసి హనుమంతునికి జన్మనిచ్చిందని అందువల్లే ఈ కొండకు అంజనాద్రి అని పేరు వచ్చిందని వెంకటాచల మహత్యం పేర్కోన్నారు
ఏడుకొండల్లోని ఆకాశగంగే హనజమంతుని జన్మస్ధలంగా నిర్ధారించిన టీటీడీ ఈ నెల 16 మాఘపౌర్ణమి నాడు హనుమన్ జన్మస్ధలం అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ నిర్వహించనుంది. ఉదయం 9:30 గంటల 11 గంటల మధ్య ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనుంది. అంజనాద్రిలోని భూమి పూజ కార్యక్రమానికి విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, అయోధ్య రామజన్మభూమి ఆలయ నిర్మాణ ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి మహారాజ్, చిత్రకూట్ పీఠాధిపతి రామభద్ర చార్యులు, కోటేశ్వరశర్మ సహా పలువురు ఆధ్యాత్మిక ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
Also Read: రాజుల్లేరు, రాజ్యాల్లేవు.. వనదేవతల కరుణ అలాగే ఉంది.. మరో కుంభమేళాను తలపించే మేడారం..
హనుమంతుడు జన్మ వృత్తాంతంపై టీటీడీ ఈ-పుస్తకం విడుదల చేయనుంది. ఆకాశగంగలోని అంజనాదేవి ఆలయం, బాల హనుమాన్ ఆలయానికి ముఖమండపం, గోపురం నిర్మించనున్నారు. మరోవైపు గోగర్భం డ్యాం వద్ద దాతల సహాయంతో రోటరీను ఏర్పాటు చేయనున్నారు. ఇక హనుమజ్జన్మస్థల వైభవం తెలియాలంటే సాధారణంగా ఆలయాలు మామూలుగా ఉంటే సరిపోదని భావించి టీటీడీ... యాదాద్రి ఆలయం తరహాలో హనుమజ్జన్మస్థల ఆలయ నిర్మాణాన్ని సినిమా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో డిజైన్ రూపొందించారు. పాలక మండలి సభ్యులు నాగేశ్వరరావు మురళికృష్ణ వంటి దాతల సహాయంతో ఈ ఆలయం మరింత కొత్త హంగులను రూపుదిద్దుకోనుంది. అంతే కాకుండా గోగర్భం డ్యాం నుండి అంజనాద్రి వరకు వివిధ ప్రాంతాల్లో భక్తులను ఆకట్టుకునేందుకు వివిధ రాకాల పుష్పాలతో గార్డెన్స్ ను టిటిడి ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.. తిరుమలకు విచ్చేసిన ప్రతి భక్తుడు అంజనాద్రి వెళ్ళె విధంగా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ.