వాలెంటైన్స్ డే (Valentine's Day)...
ప్రేమ కవితలు పొంగే రోజు ఇది. చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్ని రంగుల పూలున్నా ఎరుపు గులాబీలు మాత్రమే కంటికి కనిపిస్తాయి. ఎంతమంది మనుషులున్నా నచ్చినా, మనసు మెచ్చిన వ్యక్తి కోసం మాత్రమే కళ్లు వెతుకుతుంటాయి. ఈ రోజున ఎన్నో మనసులు కలుస్తాయి, మరెన్నో తిరస్కారానికి గురై విరహ వేదనను భరిస్తాయి. ఏడాదిలో ఓసారి వచ్చే ప్రేమ పండుగ. ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే రోజు ఇది. కొన్ని దేశాల్లో వీటికి చాలా ప్రత్యేకత ఉంది, ప్రత్యేక విధానంలోనే తమ ప్రేమను వ్యక్తపరుస్తారు కూడా.
పంది పిల్ల స్పెషల్
ఏ దేశంలోనైనా ప్రేమ ఒక్కటే, ప్రేమ చిగురించే విధానం ఒక్కటే. కానీ వ్యక్తపరిచే పద్దతులే వేరుగా ఉంటాయి. జర్మనీలో ప్రేమికుల రోజున పందిపిల్లలకు చాలా విలువ పెరిగిపోతుంది. వాటికి ఫోటోలు తీసి, గ్రీటింగ్ కార్డులుగా అచ్చేసి అమ్ముకుంటారు. ఆ రోజున ప్రేమికులు పందిపిల్ల బొమ్మలున్న గ్రీటింగ్ కార్డులు ఇచ్చిపుచ్చుకుంటారు. అది చాలా శుభసూచకమని వారి నమ్మకం. జర్మనీలోకి 1940లలో వాలెంటైన్స్ డే వేడుకలు ప్రవేశించాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్ సైనికులు అక్కడే ఉంది వేడుకలు నిర్వహించుకున్నారు. అప్నట్నించి జర్మనీ ప్రజలు కూడా మొదలు పెట్టేశారు. చిన్న పంది పిల్లలు పువ్వులు పట్టుకున్నట్టు, నాలుగు ఆకులను పట్టుకున్నట్టు అనేక గ్రీటింగ్ కార్డులను అమ్ముతారు. ప్రేమజంటలు వాటిని ఇచ్చుకుంటే ప్రేమ సక్సెస్ అవుతుందని వారి నమ్మకం.
అమ్మాయిలే ఇస్తారు
ప్రతి చోటా వాలెంటైన్స్ డే రోజు అబ్బాయిలే అమ్మాయిలకు చాక్లెట్లు కొని ఇస్తుంటారు. కానీ జపాన్ లో మాత్రం అమ్మాయిలే చాక్లెట్లు కొని అబ్బాయిలకు ఇస్తారు. ఈ చాక్లెట్లను అక్కడ ప్రత్యేకంగా తయారు చేస్తారు. వీటిని ‘గిరి - చాకో’ అంటారు. ఈ చాక్లెట్లను ఇస్తే ఇష్టపడుతున్నట్టు అర్థం. అదే ‘హోన్మీ చాకో’పేరుతో అమ్మే చాక్లెట్లను ఇస్తే రొమాన్స్ చేసే ఉద్దేశం ఉందని చెప్పకనే చెబుతున్నట్టు.
పువ్వుల సంఖ్యను బట్టి
తైవాన్లో ప్రియుడు తన ప్రేయసికి ఇచ్చే పూల సంఖ్యను బట్టి అతని మనసులోని మాటను చెబుతాడు.
ఒక ఎర్ర గులాబీ ఇస్తే ‘నువ్వు మాత్రమే నా ప్రేయసివి’ అని చెప్పినట్టు
11 గులాబీలు ఇస్తే ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పినట్టు
99 గులాబీలు ఇస్తే ‘ఎప్పటికీ నువ్వే నా ప్రేమ’ అని చెప్పినట్టు
అదే 108 గులాబీలు ఇస్తే ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’అని అడిగినట్టు.
పేరు రాసి...
దక్షిణాఫ్రికాలోని వాలెంటైన్స్ డే రోజున పాత రోమన్ సంప్రదాయాలను పాటిస్తుంటారు. అబ్బాయిలు తాము ప్రేమించిన అమ్మాయి పేరును చేతులపై రాసుకుంటారు. అదే వారి ప్రేమ ప్రకటన. అమ్మాయి చూసి ఒప్పుకుంటే సరి, లేకుండా సబ్బుతో పేరును శుభ్రం చేసుకోవడమే.
ఆ సంప్రదాయానికి పాతర
ప్రేమికుల రోజున ఫ్రాన్స్‌లో ఓ అనాగరిక ఆచారం అమలులో ఉండేది. లవ్ లాటరీ పేరుతో వాలెంటైన్స్ డే రోజు ఒక కార్యక్రమం నిర్వహించుకునేవారు. సింగిల్స్ పేర్లను కాగితంపై రాసి లాటరీ తీసేవారు. తమకు వచ్చిన పేర్లను బట్టి జంటలుగా మారేవారు. వచ్చిన వ్యక్తి పేరు తమకు నచ్చకపోతే వారి ఫోటోను అక్కడే మంటల్లో వేసేవారు. ఇది అనారికమైనదిగా భావించి ఫ్రాన్స్ లో చాలా మంది ఈ ఆచారాన్ని వదిలేశారు.