Guru Purnima Wishes 2024 : అద్వితీయమైన గురు పరంపరకు అలవాలం మనదేశం. పూర్వకాలంలో గురుకుల విద్యా విధానం అనుసరించే సమయంలో గురువులను దైవసమానులుగా పూజించేవారు. ఆ గురువులు కూడా శిష్యులను కన్న బిడ్డలకన్నా ఎక్కువ ప్రేమించేవారు..వారిని మించేలా తీర్చిదిద్దేవారు. ఆదియోగి అయిన పరమేశ్వరుడు గురు పౌర్ణమి రోజే సప్తర్షులకు జ్ఞానబోధచేశాడంటోంది శివపురాణం. గురు పౌర్ణమి రోజే దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞాన బోధ ప్రారంభించిన రోజని చెబుతోంది దత్త చరిత్ర. మత్స్యకన్య సత్యవతి - పరాశరమహర్షికి వ్యాసమహర్షి జన్మించిన రోజు గురు పూర్ణిమ.. వేదాలను బుగ్వేదం, సమావేదం, అధర్వణవేదం, యజుర్వేదం అని నాలుగు భాగాలుగా వ్యాసుడు విభజించిన రోజు కూడా ఆషాఢ పూర్ణిమే. మహాభారతం, భాగవతంతో పాటూ అష్టాదశ పురాణాలను అందించిన వ్యాసమహర్షి జన్మతిథి ఆషాఢ పౌర్ణమి.అందుకే ఆయనను ఆదిగురువుగా పూజిస్తూ గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని జరుపుకుంటారు.  జీవితానికి మార్గనిర్ధేశం చేసి ముక్తివైపు నడిపినందుకు ప్రతిఫలంగా ఈ రోజు గురువులను పూజించి వారికి కానుకలు సమర్పించి.. ఆశీర్వచనం తీసుకుంటారు. ఈ సందర్భంగా మీ గురువులను పూజించండి. మీ బంధు మిత్రులకు , స్నేహితులకు శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి...


Also Read: పురాణాల్లో ఉపాధ్యాయ దినోత్సవం..గురుపౌర్ణమి ( జూలై 21) విశిష్టత ఇదే!


జూలై 21 ఆదివారం గురు పౌర్ణమి 


గురు ప్రార్ధన
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే!
నమోవై బ్రహ్మనిదయే వాసిష్టాయ నమో నమః!!


విష్ణు స్వరూపుడైన వ్యాసమహర్షికి, వ్యాసుడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి, బ్రహ్మవిద్యానిలయుడైన వ్యాసభగవాన్ కి నమస్కారం. 
 
​గురువు విశిష్టత
గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర: 
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ: 


గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు..త్రిమూర్తి స్వరూపుడైన గురువుకు నమస్కారం...


గుకారశ్చాంధకారస్తు రుకార్తన్నిరోధకృత్‌


‘గు’ అంటే చీకటి,  ‘రు’ అంటే ఆ చీకటిని అడ్డగించేవాడు అని అర్థం...అజ్ఞానం  అనే చీకటిని తొలగించే శక్తి గురువుకి మాత్రమే ఉంది 
 
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవేనమః


అజ్ఞానమనే చీకటితో అంధులైనవారికి జ్ఞానమనే అంజనాన్ని అందించి కళ్లు తెరిపించి నడిపించే గురువుకి నమస్కారం 


అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం 
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః 


మొత్తం ప్రపంచాన్ని గగనంలా వ్యాపించిన ఏ గురుతత్వం అయితే తత్ అని పిలిచే బ్రహ్మకు మరో రూపంగా నిలిచిందో ఆ గురువుకి వందనం
  
‘న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః
తత్త్వఙ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః’


గురువును మించిన తత్వం, తపస్సు, జ్ఞానం మరొకటి లేదు


Also Read: అరుణాచల గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే మంచిది - గురుపౌర్ణమి సందర్భంగా పంచాక్షరి మంత్రంలో మారుమోగుతున్న అగ్నిలింగ క్షేత్రం!


వ్యాస మహర్షి సందేశం


'ఇతరులు మీ పట్ల ఎలా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో...మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు..ఈ ఒక్క విషయాన్ని త్రికరణ శుద్ధిగా పాటిస్తే సమాజం తప్పనిసరిగా శాంతిధామం అవుతుందని బోధించాడు వ్యాసమహర్షి. 


గౌతమ బుద్ధుడు


విద్యార్థులు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నప్పుడే ఉపాధ్యాయుడు తనకు తెలిసిన విద్యను నేర్పించేందుకు ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటారు. విద్యార్థిలో కలిగే ప్రతి సందేహానికి సమాధానం గురువు దగ్గరుంటుంది. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా జ్ఞానాన్ని అందిస్తాడు గురువు.  


రమణ మహర్షి


తన-పర అనే బేధం లేనివాడు, ఎలాంటి భ్రాంతికి లోనుకానివాడు, అహంకారాన్ని దరిచేరనివ్వని వాడు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మనోధైర్యం కోల్పోకుండా ఆత్మనిష్టతో నిలిచేవాడు...అలాంటి గురువుల బోధన విద్యార్థుల ఉన్నతికి దోహదం చేస్తుంది 


రామకృష్ణ పరమహంస


గురువు అంటే సచ్చిదానంద స్వరూపం. తాను పారదర్శకంగా ఉంటూ..తనలో విజ్ఞానాన్ని నిస్వార్థంగా ప్రసరింపచేసేవాడే నిజమైన గురువు. నీరు పల్లం ఎటుంటే అటు ప్రవహిస్తుంది. అలా గురువులో విజ్ఞానం మొత్తం ఉత్తమ శిష్యులకు చేరుకోవాలి. ఇందులో ఎలాంటి సందేహాలు, సంశయాలకు తావుండకూడదు


స్వామి వివేకానంద


తల్లిదండ్రుల తర్వాత గురువు అని చెబుతారు..కానీ..నాకు అందరికంటే ఆత్మీయుడు గురువే..ఆ తర్వాతే తల్లిదండ్రులు. అమ్మా నాన్నా ఏం చేయాలో చెబుతారు...గురువు ఏం చేయకూడదో చెబుతారు..తల్లిదండ్రులు జన్మనిస్తే...గురువు పునర్జన్మనిస్తారు. అందుకే గురువుకే నా తొలి వందనం అర్పిస్తాను 
 
రవీంద్రనాథ్ ఠాగూర్


పిల్లలను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడంతో ఉపాధ్యాయుడిదే కీలక పాత్ర...ఇంతటి మహత్కార్యాన్ని సక్రమంగా నిర్వర్తించే గురువులు కలకాలం తలెత్తుకుని జీవించవచ్చు..ఇంత అద్భుతమైన అవకాశం కేవలం గురువుకి మాత్రమే దక్కుతుంది.  


జిడ్డు కృష్ణమూర్తి


మంచి గురువు దగ్గర విద్యను అభ్యసించినప్పుడే నిన్ను నువ్వు తెలుసుకోగలవు. ఎందుకంటే నిన్ను శిష్యుడిగా స్వీకరించిన క్షణమే నీలో మంచి చెడులను ఆయన గుర్తించారని అర్థం. నీలో నిండిన చెడును పారద్రోలి మంచి వ్యక్తిగా మలిచేది కేవలం గురువు మాత్రమే. 


ఓషో


ఓ వ్యక్తి జీవనయానం దిక్కుతోచని స్థితిలో సాగుతోందంటే..తనకి మంచి గురువు సాక్షాత్కారం లభించలేదని అర్థం. మంచి గురువు అనుగ్రహం పొందినవ్యక్తి ప్రయాణం ఎలాంటి అడ్డంకులు లేకుండా గమ్యం దిశగా సాగిపోతుంది..లక్ష్యాన్ని అందుకుని తీరుతాడు..