Significance Of Govardhan Puja: ప్రతి సంవత్సరం దీపావళి జరుపుకునే గోవర్ధన్ పూజను కొన్ని ప్రాంతాల్లో అన్న కూట్ అని కూడా పిలుస్తారు. ప్రకృతికి - మనిషికి మధ్య ఉన్న సంబంధానికి ప్రతీక ఈ పండుగ. ఈ రోజు శ్రీ కృష్ణుడిని, గోవులను పూజిస్తారు. మొత్తం 56 రకాల నైవైద్యాలు సమర్పిస్తారు.
ఈ ఏడాది గోవర్థన్ పూజ ఎప్పుడొచ్చింది
సాధారణంగా దీపావళి మరుసటి రోజు గోవర్థన పూజ చేస్తారు.. అంటే కార్తీక మాసం మొదటి రోజు వచ్చే పాడ్యమి రోజు. అయితే ఈ ఏడాది తిథులు తగులు మిగులు రావడంతో ఆశ్వయుజ అమావాస్య, కార్తీక పాడ్యమి రెండు రోజులు వచ్చాయి. దీంతో ఏ రోజు పరిగణలోకి తీసుకోవాలనే సందేహం ఉంది. దీపావళిని అమావాస్య ఘడియలు ఉన్నప్పుడు జరుపుకోవాలి కాబట్టి అక్టోబరు 31 గురువారం సూర్యాస్తమయ సమయానికి అమావాస్య ఉండడంతో అదే రోజు నరకచతుర్థశి, దీపావళి వచ్చాయి. నవంబరు 1 శుక్రవారం ఉదయానికి అమావాస్య ఉంది..అంటే సూర్యోదయానికి పాడ్యమి లేదు.. నవంబరు 02 శనివారం పాడ్యమి తిథి సూర్యోదయానికి ఉంది. అందుకే కార్తీకమాసం ప్రారంభం అయ్యే ఈ రోజు గోవర్థన పూజ జరుపుకోవాలి.
Also Read: ఈ దీపావళికి అయోధ్యలో అద్భుతం..అస్సలు మిస్సవకండి!
మీ అవగాహన కోసం ఏ తిథి ఎప్పటివరకూ ఉందో ఇక్కడ తెలుసుకోండి
అమావాస్య - అక్టోబరు 31 గురువారం 2 గంటల 45 నిముషాల నుంచి నవంబరు 01 శుక్రవారం సాయంత్రం 4 గంటల 47 నిముషాల వరకూ
పాడ్యమి - నవంబరు 01 శుక్రవారం సాయంత్రం 4 గంటల 48 నిముషాల నుంచి నవంబరు 02 శనివారం సాయంత్రం 6 గంటల 33 నిముషాల వరకూ.
నవంబరు 02 శుక్రవారం రోజు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఐదున్నర. అంటే పాడ్యమి తిథి సూర్యోదయానికి, సూర్యాస్తమయానికి ఉన్న రోజు అంటే నవంబరు 02 శనివారమే ఇదే రోజు కార్తీకమాసం ప్రారంభం అవుతోంది..ఇదే రోజు గోవర్థన పూజ చేసుకోవాలి.
Also Read: అక్టోబరు 31 or నవంబరు 01..ఈ ఏడాది దీపావళి ఎప్పుడొచ్చింది - లక్ష్మీపూజ ముహూర్తం ఏంటి!
శ్రీ కృష్ణుడి పట్ల రేపల్లె ప్రజలకు ఉన్న భక్తిని భరించలేని ఇంద్రుడు రాళ్ల వర్షం కురిపిస్తాడు. రేపల్లె ప్రజలపై ఇంద్రుడు కురిపించిన రాళ్ల వర్షం నుంచి ప్రజలను, గోవులను రక్షించేందుకు చిటికెన వేలుపై గోవర్థన పర్వతాన్ని గొడుగుగా పట్టుకున్నది కార్తీక శుక్ల పాడ్యమి రోజే. అందుకే ఈ రోజు శ్రీ కృష్ణుడికి, గోవులకు, గోవర్థన పర్వతానికి పూజచేస్తారంతా. ఈ వేడుక బంధం, ఆత్మీయత, ప్రకృతి ఆరాధనకు ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
గోవర్థన పూజ ఎలా చేయాలి?
గోవర్ధన పూజ చేయాలి అనుకునేవారు ఆవుపేడతో ఓ పర్వతాన్ని తయారు చేసి..ఆ పక్కనే శ్రీకృష్ణుడి ఫొటో, ఆవు బొమ్మ కానీ,ప్రతిమ కానీ ఉంచాలి. నువ్వుల నూనె లేదా నేతితో దీపం వెలిగించి...పూలు, పసుపు, చందనం , కుంకుమ సమర్పించి పూజ చేయాలి. తియ్యటి పదార్థాలను నివేదించి వాటినే ప్రసాదంగా అందరకీ పంచాలి. శ్రీకృష్ణాష్టకం, శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి చదువుకున్న అనంతరం నివేదన తర్వాత గోవర్థనగిరి కథ చదువుకోవాలి.
Also Read: 5 రోజుల దీపావళి వేడుకలో ఏ రోజు విశిష్టత ఏంటి - ఏ రోజు ఏం చేయాలి!
గోవర్ధన పూజ ఎందుకు చేయాలి?
ఏ ఇంట్లో గోవర్ధన పూజ చేస్తారో ఆ ఇంట్లో ఆనందానికి లోటుండదని పండితులు చెబుతారు. ఆరాధ్యుడు మాత్రమే కాదు గురువుగా మీ వెన్నంటే ఉండి శ్రీ కృష్ణుడు నడిపిస్తాడని విశ్వశిస్తారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, బాధలు తీరిపోయి శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని భక్తుల విశ్వాసం.