Diwali 2024 Date: హిందువుల అతిపెద్ద పండుగలలో దీపావళి ఒకటి. ఏటా ఆశ్వయుజమాసం ఆఖరిరోజు...కార్తీకమాసం ప్రారంభానికి ముందురోజు వచ్చే అమావాస్య రోజు దీపావళి అమావాస్య జరుపుకుంటారు. అన్ని పండుగలలా కాకుండా దీపావళి ఐదు రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు. ధన త్రయోదశి నుంచి యమవిదియ వరకూ ఐదు రోజులు జరుపుకునే పండుగ దీపావళి.


ధన త్రయోదశి, నరక చతుర్థశి, దీపావళి, బలిపాడ్యమి, యమ విదియ.. మొత్తం ఐదు రోజులు జరుపుకుంటారు. దసరా తొమ్మిదిరోజుల పాటూ దుర్గాదేవిని ఆరాధించి..దీపావళి వేళ మహాలక్ష్మిని పూజిస్తారు. ధనత్రయోదశి నుంచి లక్ష్మీదేవికి, కుబేరుడికి పూజలు నిర్వహిస్తారు. దీపావళి అమావాస్య రోజు సాయంత్రం అమ్మవారిని పూజించి ఐశ్వర్యం ప్రసాదించమని వేడుకుంటారు.  
 
దీపావళి పండుగను అమావాస్య రోజు జరుపుకుంటారు. ఏదైనా తిథి రెండు రోజుల పాటూ వచ్చినప్పడు గందరగోళం నెలకొంటుంది.  సాధారణంగా హిందువుల పండుగలన్నీ సూర్యోదయానికి తిథి ఉన్న రోజునే ప్రధానంగా తీసుకుంటారు. అందుకే అక్టోబరు 31 ఉదయం నుంచి నవంబరు 1 మధ్యాహ్నం వరకూ అమావాస్య ఉండండతో ఏ రోజు దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలి అనే సందేహం మొదలైంది. 


Also Read: పాపం చేసిన వెంటనే దేవుడు శిక్ష వేసేయొచ్చు కదా..వచ్చే జన్మవరకూ ఎందుకు ఆగాలి!


ఏ తిథి ఏ రోజు ఏ సమయం వరకూ ఉంది


ధన త్రయోదశి 


అక్టోబరు 29 మంగళవారం ఉదయం 10 గంటల 34 నిముషాల నుంచి ప్రారంభమై... అక్టోబరు 30 బుధవారం మధ్యాహ్నం 12 గంటల 35 నిముషాలవరకూ ఉంది. త్రయోదశి పూజ ఉదయం సమయంలో నిర్వహిస్తారు..అందుకే అక్టోబరు 30 బుధవారం ధన త్రయోదశి జరుపుకుంటారు...


నరక చతుర్థశి


అక్టోబరు 30 బుధవారం మధ్యాహ్నం 12 గంటల 36 నిముషాల నుంచి అక్టోబరు  31 గురువారం మధ్యాహ్నం 2 గంటల 45 నిముషాల వరకూ చతుర్థశి తిథి ఇంది. నరక చతుర్ధశి కూడా సూర్యోదయానికి తిథి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఈ ఏడాది నరక చతుర్ధశి అక్టోబరు 31 గురువారం..


దీపావళి


సాధారణంగా చతుర్థశి మర్నాడు అమావాస్య వస్తుంది కదా..అందుకే నరక చతుర్థశి మర్నాడు దీపావళి జరుపుకోవాలని అనుకుంటారు. కానీ దీపావళి జరుపుకునేందుకు సూర్యాస్తమయం సమయానికి అమావాస్య తిథి ఉండడం అత్యంత ప్రధానం. ఈ లెక్కన ఈ ఏడాది అమావాస్య తిథి అక్టోబరు 31 మధ్యాహ్నం 2 గంటల 46 నిముషాల నుంచి నవంబరు 1 శుక్రవారం సాయంత్రం 4 గంటల 47 నిముషాల వరకూ ఉంది. అంటే సూర్యాస్తమయం సమయానికి అమావాస్య ఉన్న రోజు అంటే అక్టోబరు 31 గురువారం.అందుకే ఈ రోజే లక్ష్మీపూజ, దీపావళి జరుపుకుంటారు. నరకచతుర్థశి, దీపావళి ఒకేరోజు వచ్చాయన్నమాట.
Also Read: తెలిసో తెలియకో పాముల్ని చంపేస్తే ఏం జరుగుతుంది - ఏం చేస్తే ఆ పాపం పోతుంది!


దీపావళి సందర్భంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి.. విరిగిన, పాడైన వస్తువులు బయటపడేయండి. దీపావళి రోజు సాయంత్రం చేసే పూజకు ముందుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. దీప, ధూప, నైవేద్యాలకు ఏం చేయాలి.. పూలు, పండ్లు, అలంకరణ సమాగ్రి, ప్రమిదలు.. ఇలా అన్ని ఏర్పాట్లు ముందుగా చేసుకుంటే లక్ష్మీపూజ ప్రశాంతంగా జరిగిపోతుంది. ఈశాన్యం లేదా ఉత్తర దిశగా ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసి అక్కడ పీట వేసి ఎర్రటి వస్త్రాన్ని పరిచి లక్ష్మీదేవి పటం కానీ ప్రతిమ కానీ ఉంచాలి. ముందుగా పసుపు వినాయకుడి పూజ పూర్తిచేసి ఆ తర్వాత లక్ష్మీ పూజ చేయండి. అనంతరం అమ్మవారికి స్వీట్స్ నివేదించి..ఆ ప్రసాదాన్ని అందరకీ పంచిపెట్టి..ఇల్లంతా దీపాల వెలుగులతో నింపేయండి...


Also Read: స్వస్తిక్ గీసేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. హిట్లర్ పతకానికి కారణం అదేనా!