Garuda Purana: మరణం అనేది ఎప్పటికీ మారని వాస్తవం. ఎవరూ దానిని తప్పించలేరు మార్చ‌లేరు. కానీ జనన మరణ చక్రానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు గరుడ పురాణంలో ప్రస్తావించారు. గరుడ పురాణంలో, ఒక వ్యక్తి తన జీవితంలో చివరి దశకు చేరుకున్నప్పుడు అంటే అతని మరణ సమయంలో ఏమి గ్రహిస్తాడు అనే విష‌యంపై స‌మ‌గ్రంగా, స‌వివ‌రంగా పేర్కొన్నారు. మనిషి జీవితంలో చివరి క్షణాలు ఎలా ఉంటాయో తెలుసా..?


పూర్వీకుల ద‌ర్శ‌నం
గరుడ పురాణంలో ఒక వ్యక్తి తన చివరి శ్వాస తీసుకుంటున్నప్పుడు, అతను ఇప్పటికే తన కుటుంబాన్ని విడిచిపెట్టిన పూర్వీకులందరి నీడలను చూడటం ప్రారంభిస్తాడు. పితృదేవ‌త‌లు ఆ వ్యక్తిని పిలుస్తున్న‌ట్టు అతనికి అనిపిస్తుంది. మరణిస్తున్న వ్యక్తి తన చివరి కోరికను తన కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి అలాంటి సంకేతాల‌ను పొందుతాడని నమ్ముతారు.


Also Read : పెళ్లి తర్వాత స్త్రీలు చేయ‌కూడ‌ని 6 తప్పులు ఇవే!


ర‌హ‌స్య‌ తలుపు
గరుడ పురాణం ప్రకారం, ఒక వ్యక్తి చనిపోయే ముందు, అతను ఊపిరి పీల్చుకోవడం బాగా క‌ష్ట‌మ‌వుతుంది. ఆ సమయంలో ఒక రకమైన రహస్యమైన తలుపు కనిపిస్తుంది. కొందరు ఆ తలుపు నుంచి కాంతి కిరణాలు బయటకు రావడాన్ని చూస్తారు, మరికొందరు ఆ తలుపు నుంచి మంటలు రావడం చూస్తారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఈ అనుభవం ఎదురైతే, ఆ వ్యక్తి త్వరలో చనిపోతాడని అర్థం చేసుకోవాలి. అతని చివరి కోరికను నెరవేర్చడానికి ప్రయత్నించాలి.


యమదూతలు
జీవితం చివరి క్షణాలలో, ఒక వ్యక్తి త‌నకు ప‌రిచ‌యం లేని క్రూరంగా ఉన్న వ్య‌క్తుల‌ను చూస్తాడు. నిజానికి వారు యమదూతలు, ఆ వ్యక్తి ఆత్మను తమతో తీసుకెళ్లడానికి వస్తారు. ఒక వ్యక్తి తన చుట్టూ యమ దూతల ఉనికిని అనుభవించడం ప్రారంభించినప్పుడు, అతను చనిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయని అర్థం. అప్పుడు చుట్టుపక్కల వాతావరణం కూడా ప్రతికూలంగా మారుతుంది.


నీడ మాయం
మృత్యువు వచ్చినప్పుడు నీడ కూడా వెంట‌రాద‌ని పెద్ద‌లు తరచూ చెబుతుంటారు. ఇది కేవలం మాట కాదు వాస్తవం. ఒక వ్యక్తికి చివ‌రి క్ష‌ణాలు స‌మీపించిన‌ప్పుడు.. అతను నీటిలో, అద్దంలో, నెయ్యి, నూనెలో తన ప్రతిబింబాన్ని చూడ‌లేడు. ఇది జరిగినప్పుడు ఆ వ్యక్తి కొన్ని రోజుల్లో చనిపోతాడని అర్థం చేసుకోవాలి.


Also Read : పెళ్లికి ముందు జీవిత భాగస్వామి గురించి తెలుసుకోవాల్సిన విషయాలివే!


గ‌తం గుర్తుకు వస్తుంది
ఒక వ్యక్తికి చివరి సమయం వచ్చినప్పుడు, అతనికి అకస్మాత్తుగా అతని గతమంతా అంటే తాను చేసిన‌ మంచి, చెడు పనులు గుర్తుకు వస్తాయి. చివరి క్షణం వచ్చినప్పుడు, అతను తన మనస్సులో దాచుకున్న‌ కోరికలను తన కుటుంబ సభ్యులకు చెప్పాలనుకుంటాడు. ఆ వ్యక్తి తన జీవితకాలంలో తాను పంచుకోని చాలా విషయాలను కుటుంబంతో పంచుకోవాలని కోరుకుంటాడు. ఇది జరిగినప్పుడు, మీరు ఆ వ్యక్తి చెప్పేది ఓపికగా వినడ‌మే కాకుండా అతని చివరి కోరికలను నెరవేర్చాలి.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.