Garuda Purana: గరుడ పురాణం విష్ణు పురాణంలో ఒక భాగం. ఈ పురాణంలోని రెండవ భాగం మరణానికి సంబంధించిన అనేక అంశాలపై సమాచారాన్ని అందిస్తుంది. ముఖ్యంగా అంత్యక్రియలు, పునర్జన్మ గురించి వివ‌రిస్తుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు చనిపోతే గరుడ పురాణం చెబుతారు. ఇది ఆత్మకు మోక్షాన్ని ఇస్తుందని, ప్రాపంచిక జీవితాన్ని విడిచిపెట్టి స్వ‌ర్గ‌లోకం వైపు వెళ్ల‌డానికి సహాయపడుతుందని నమ్ముతారు.


గరుడ పురాణం హిందూమతంలోని 18 మహాపురాణాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది హిందూ మతానికి చెందిన‌ మహా పురాణం కాబట్టి ఇది చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. గరుడ పురాణం నుంచి మనం జనన మరణ రహస్యాలను తెలుసుకోవచ్చు. ఇది జననం, మరణం, పునర్జన్మ, ఆత్మ, స్వర్గం, నరకం, కర్మ ప్రకారం శిక్ష మొదలైన వాటి గురించి సమాచారాన్ని తెలియ‌జేస్తుంది. మన దైనందిన జీవితానికి సంబంధించిన అనేక ఆలోచనలు గరుడ పురాణంలో పేర్కొన్నారు. ఈ ఆలోచనలు మన మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.


గరుడ పురాణం చాలా రహస్యమైన విషయాలను ప్రస్తావించింది. వీటిని పాటిస్తే జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మనిషి ఆనందంగా జీవించాలంటే ప్రతిరోజూ కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలి. ఈ పనులు చేసే వారికి సమాజంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. దీని ద్వారా మనిషి జీవితంలోని అన్ని ఆనందాలను పొందుతాడు. ఆ విధులేంటి..


Also Read: మే 11 రాశిఫలాలు, ఈ రాశులవారు ఆస్తులు కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదే మంచి సమయం


1.దాన‌ధ‌ర్మాలు
గరుడ పురాణం ప్రకారం, కచ్చితంగా మీ ఆహారంలో కొంత భాగాన్ని బీదలకు లేదా అభాగ్యుల‌కు ఇవ్వాలి. పేదలకు, అభాగ్యుల‌కు ఆహారం పంపిణీ చేయడం ద్వారా మీరు పుణ్యాన్ని పొందవచ్చు. దీంతో లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై నిలిచి, కుటుంబం ఎప్పటికీ సుభిక్షంగా ఉంటుంది.


2. గోసేవ
గరుడ పురాణం ప్రకారం గోసేవ చేయడం వల్ల కూడా పుణ్యం వస్తుంది. రోజూ గోసేవ చేసేవారికి సత్కార్యాలు పెరుగుతాయి. ఆవుకి రోజూ ఆహారం, నీరు ఇవ్వడం అలవాటు చేసుకోండి.


3. కులదైవం ఆరాధన
పూర్వీకులను, కులదైవాన్ని, దేవతలను పూజించాలని గరుడ పురాణం చెబుతోంది. వంశ దేవతలను, పూర్వీకులను పూజించే వ్యక్తికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అటువంటి వారిపై పూర్వీకులు, కుల‌ దేవతల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతారు.


4. జంతువులు-పక్షుల సేవ
శాస్త్రాల ప్రకారం ఇంట్లో చేసే మొదటి రొట్టె ఆవుకి, చివరి రొట్టె కుక్కకి పెట్టాలి. అంతే కాకుండా పక్షులకు ఆహారం, నీటిని ఏర్పాటు చేయడం, చేపలకు ఆహారం వేయ‌డం, చీమలకు పంచదార, పిండిని తినడానికి ఇవ్వడం మొదలైనవి కూడా చాలా పుణ్యకార్యాలుగా పరిగణిస్తారు. గరుడ పురాణం ప్రకారం, జంతువులు, పక్షులకు సేవ చేసే వ్యక్తి జీవితంలో విజయం, ఆనందం, శ్రేయస్సు పొందుతాడు.


Also Read: శ్మశానాల్లోకి స్త్రీలు అడుగుపెడితే!


గరుడ పురాణం ప్రకారం పైన పేర్కొన్న పనులు రోజూ చేస్తే సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వీటిని రోజూ చేయలేకపోతే వారానికోసారి లేదా కనీసం నెలకోసారైనా చేయడం మంచిది.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.