Ganesh Visarjan 2024: సెప్టెంబరు 07 భాద్రపద చవితి వినాయక చవితి సందర్భంగా గణనాథుడని ఇళ్లలో, మండపాల్లో ప్రతిష్టాత్మకంగా కొలువుతీర్చి పూజలందించారు. 3,5,7,9,11,21 ఎవరికి నచ్చినన్ని రోజులు పూజలు చేసి అనంతరం నిమజ్జనం చేస్తారు. చవితి రోజు ప్రతిష్టించే విగ్రహాలను అనంత చతుర్థశి రోజు నిమజ్జనం చేయడం శుభకరం అంటారు పండితులు. పార్వతీ తనయుడికి వీడ్కోలు పలికేందుకు అనంత చతుర్థి మంచి రోజు అని చెబుతారు. ఈ ఏడాది అనంత చతుర్థి సెప్టెంబరు 17న వచ్చింది. ఈ రోజు గంగమ్మ ఒడికి తరలివెళ్లనున్నాడు గణపయ్య. ఈ వేడుకలో చిన్నా పెద్దా భాగమవుతారు. అత్యంత ఉత్సాహంగా విగ్రహాలను తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. ఇలా ఘనంగా నిమజ్జనం జరిగే ప్రదేశాలు భారత దేశం మొత్తం చాలా ఉన్నాయి..వాటిలో కొన్ని ప్రసిద్ధ ప్రదేశాలు ఇవే...


Also Read: గణేష్ నిమజ్జనం 11వ రోజే ఎందుకు..ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా!


గిర్గావ్ చౌపట్టి, ముంబై (Girgaon Chowpatty - Mumbai)


గిర్గావ్ చౌపట్టి..ముంబైలో ఉన్న ప్రముఖ బీచ్ లలో ఒకటి. గణేష్ నిమజ్జనం వేడుకలకు ముంబైలో అత్యంత ప్రధాన ప్రదేశం. ముంబైలో   పురాతన విద్యాసంస్థలలో ఒకటైన  విల్సన్ కళాశాల  సమీపంలో ఈ బీచ్ ఉంటుంది. ఇక్కడ సూర్యాస్తమయం చూసేందుకు ప్రకృతి ప్రేమికులు భారీగా తరలివస్తారు. గణేష్ నిమజ్జనం వేడుకలు ఇక్కడ తెల్లవారే వరకూ జరుగుతాయి.. భారీగా ప్రజలు తరలివస్తారు. ఇక దసరా సమయంలో ఈ ప్రదేశంలోనే రావణుడి దిష్టిబొమ్మ దహనం చేస్తారు. దీపావళి వేళ బాణాసంచా హడావుడి కూడా ఈ బీచ్ లో ఎక్కువే. 


జుహు బీచ్, ముంబై  (Juhu Beach -Mumbai)


ముంబైలోని ప్రసిద్ధ బీచ్‌లలో మరొకటి... బాలీవుడ్ నటులతో సందడిగా ఉండే ప్రదేశం జుహు. ఈ బీచ్ లో కూడా గణేష్ నిమజ్జనం వైభవంగా జరుగుతుంది. గణేషుడి విగ్రహాలను చాలా దూరం తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. భారీగా భక్తుల సందడి కనిపిస్తుంది. ముంబైలో తక్కువ రద్దీ ఉన్న ప్రాంతాల్లో నిమజ్జనం చేయాలి అనుకుంటే ముంబైలో పోవై సరస్సు మంచి ప్రదేశం.
 
శ్రీ గణేష్ మందిర్ మపుసా, గోవా (Shree Ganesh Mandir Mapusa - Goa)


ఉత్తర గోవాలో అందమైన బీచ్‌లకు దగ్గరగా మపుసా సమీపంలో ఉంది శ్రీ గణేష్ మందిరం . ఇక్కడ నవరాత్రులు పూజలందుకునే గణపతి నిమజ్జన వేడుకలు ఈ బీచ్ లోనే నిర్వహిస్తారు. గోవా మొత్తం మపుసా బీచ్ లోనే నిమజ్జనం సందడి ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రదేశంలో నిమజ్జన వేడుకలు చూడడం ఓ అనిర్వచనీయ అనుభూతి...


Also Read: శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలు.. దసరా ఏ రోజు వచ్చింది - ఇంద్రకీలాద్రిపై అమ్మవారి అలంకారాలివే!
 
బెసెంట్ నగర్ బీచ్, చెన్నై (Besant Nagar Beach - Chennai)


బెసెంట్ నగర్ బీచ్  దక్షిణ చెన్నైలోని బంగాళాఖాతం ఒడ్డున ఉంది. చెన్నైలో గణేష్ నిమజ్జనానికి ఇది అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇతర బీచ్ ల కన్నా ఇక్కడ రద్దీ తక్కువగా ఉంటుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేవలం మట్టి విగ్రహాలను మాత్రమే అనుమతించడంతో ఇక్కడంతా మట్టి విగ్రహాలనే నిమజ్జనం అవుతాయి. 


కాసిమేడు ఫిషింగ్ హార్బర్ ,చెన్నై (Kasimedu Fishing Harbour -Chennai)


తమిళనాడులోని ప్రముఖ ఫిషింగ్ హబ్‌లలో ఒకటైన  చెన్నై ఫిషింగ్ హార్బర్‌లో నూ నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇక్కడ వేడుకల్లో పాల్గొనేవారు ఆ ఫొటోస్, వీడియోస్ తీసుకోవడం మర్చిపోవద్దు..


పూణే (Pune)


పూణే నగరంలో దక్కన్ ప్రాంతంలో గణేష్ నిమజ్జనం చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. నిత్యం పర్యాటకులకో కళకళలాడే ఈ ప్రదేశంలో జరిగే గణేష్ నిమజ్జన వేడుకల్లో పాల్గొంటే ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 


హుస్సేన్ సాగర్ , హైదరాబాద్(Hussain Sagar Lake - Hyderabad)


భాగ్యనగరంలో గణేష్ నిమజ్జన వేడుకలంటే ట్యాంక్ బండ్ కేరాఫ్. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనకు ప్రధాన ప్రదేశం మాత్రమే కాదు పర్యాటకులను ఆకట్టుకునే ప్రదేశం కూడా. గణేష్ నిమజ్జనం వేళ ట్యాంక్ బండ్ పై ఇసుకేస్తే రాలనంత జనం తరలివస్తారు. అయితే ఈ ఏడాది తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ పరిధిలోని ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం లేదు...NTR మార్గ్, నెక్లెస్ రోడ్డులో నిమజ్జనం ఏర్పాట్లు జరుగుతున్నాయి.  


యమునా ఘాట్‌లు, ఢిల్లీ (Yamuna Ghats - Delhi)


ఢిల్లీలో  గణేష్ నిమజ్జనం అంటే  నిగంబోధ్ ఘాట్, కాళింది కుంజ్ ఘాట్‌. గణపయ్యకు వీడ్కోలు చెప్పేందుకు యుమునా నదికి వద్దకు భారీగా భక్తులు తరలివస్తారు.