Dasara Navaratrulu 2024 Dates


అక్టోబరు 03 నుంచి అక్టోబర్ 12 వరకు శరన్నవరాత్రులు


దశవిధాలైన పాపాలు హరించేది..అందుకే దశహరా అంటారు..ఇదే వాడుకలో దసరాగా మారింది. దుష్టసంహారం చేసి ధర్మాన్ని నిలబెట్టడమే శరన్నవరాత్రి ఉత్సవాల వెనుకున్న ఆంతర్యం. ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకూ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ఏడాది అక్టోబరు 03 గురువారం మొదలయ్యే దసరా ఉత్సవాలు అక్టోబరు 12 శనివారం విజయదశమి వరకూ వైభవంగా జరుగుతాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఏ రోజు ఏ అలంకారంలో దర్శనిమిస్తుంది..ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి..


Also Read: అష్టాదశ శక్తిపీఠాలు ఎక్కడున్నాయి - అవి ఎలా ఏర్పడ్డాయి -ఎందుకంత పవర్ ఫుల్!
 
అక్టోబరు 03 గురువారం శ్రీ బాలా త్రిపురసుందరి దేవి


అభ‌య‌హ‌స్త ముద్ర‌తో ఉండే బాలా త్రిపుర సుందరి అనుగ్రహం కోసం అమ్మవారి ఉపాసకులు బాలార్చన చేస్తారు. పదేళ్ల లోపు బాలికలను పూజించి వారిని అమ్మవారి స్వరూపంగా భావించి నూతన వస్త్రాలు అందిస్తారు. బాలాత్రిపుర సుందరిని దర్శించుకుంటే మ‌న‌స్సు, బుద్ధి, చిత్తం మలినం కాకుండా ఉంటుందని భక్తుల విశ్వాసం


అక్టోబరు 04 శుక్రవారం శ్రీ గాయత్రీ దేవి


అన్ని మంత్రాలకు మూలం గాయత్రి..అందుకే ఆమెను వేదమాత అంటారు. పంచముఖాలతో దర్శమనిస్తే గాయత్రి రూపాన్ని దర్శించుకుంటే సకల మంత్ర సిద్ధి కలుగుతుంది.  


అక్టోబరు 05 శనివారం అన్నపూర్ణ దేవి 


ఓ చేతిలో బంగారుపాత్ర..మరో చేతితో పరమేశ్వరుడికి భిక్షను అందించే రూపంలో ఉన్న అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటే అన్నపానీయాలకు లోటుండదని భక్తుల విశ్వాసం.
 
అక్టోబరు 06 ఆదివారం లలితా త్రిపుర సుందరీ దేవి
 
శ్రీ మహాలక్ష్మి..సరస్వతీ దేవి ఇద్దరూ చెరోవైపు వింజామరలతో సేవిస్తుండగా చిరుమందహాసంతో ..చెరుగడ పట్టుకుని కూర్చునే లలితా త్రిపుర సుందరి దర్శనం సకల అభీష్టాలను నెరవేరుస్తుంది 
 
అక్టోబరు 07 సోమవారం మహా చండి


దేవతల కార్యసిద్ధికి త్రిశక్తి స్వరూపిణిగా మహాచండి ఉద్భవించిందని పురణాల్లో ఉంది. ఇంద్రుడి సింహాసనాన్ని రాక్షసులు లాక్కునేందుకు ప్రయత్నించినప్పుడు దేవతలంతా కలసి మాతృదేవతలను ఆరాధించారు. అలా ఉద్భవించినదే ఈ అవతారం. మహా చండిని దర్శించుకుంటే వ్యవహార జయం, కీర్తి పెరుగుతుందని భక్తుల విశ్వాసం.  


Also Read: అష్టాదశ శక్తిపీఠం - సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశం - వివాహం కానివారికి ప్రత్యేకం!


అక్టోబరు 08 మంగళవారం  మహాలక్ష్మీ దేవి 


అష్టలక్ష్ములు మొత్తం కలసి మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తారు. ఈ అలంకారాన్ని దర్శించుకుంటే ధనం, ధాన్యం, ధైర్యం, విజయం, విద్య, సౌభాగ్యం, సంతానానికి సంబంధించిన సమస్యలు దూరమైపోతాయి..
 
అక్టోబరు 09 బుధవారం , అక్టోబరు 09 గురువారం సరస్వతీ దేవి


విద్యలకు అధిదేవత అయిన సరస్వతీ దేవిని ఆరాధించేందుకు ఉపాసకులు, విద్యార్థులు భారీగా తరలివస్తారు. ఈ రోజు మూలనక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ రోజు నుంచి విజయ దశమి వరకూ అత్యంత విశేషమైన రోజులుగా భావిస్తారు. 
  
అక్టోబరు 10 గురువారం దుర్గాదేవి
 
 లోకాన్ని పీడించిన దుర్గమాసురుడిని వధించిన దుర్గమ్మ...స్వయంగా ఇంద్రకీలాద్రిపై అవతరించిందని ఆలయ చరిత్ర. దుర్గతులను పోగొట్టే ఈ అలంకారంలో ఉన్న అమ్మను దర్శించుకుంటే ఉత్తమ లక్షణాలు అలవడాని భక్తుల విశ్వాసం 
 
అక్టోబరు 11 శుక్రవారం  శ్రీ మహిషాసురమర్దిని


మహిషాసురుడిని అంతం చేసిన శక్తి స్వరూపిణి... మహిషాసురమర్థిని రూపంలో దర్శనమిస్తుంది. 8 భుజాలు, 8 ఆయుధాలతో సింహవానంపై ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే శత్రుభయం ఉండదు.  


Also Read: అష్టాదశ పురాణాలు ఏవి - ఏ పురాణంలో ఏముంది!


అక్టోబరు 12 శనివారం శ్రీ రాజరాజేశ్వరి దేవి


శ్రీ చక్ర అధిష్టాన దేవతగా శ్రీ రాజరాజేశ్వరి భక్తులను అనుగ్రహిస్తుంది. ఓ హస్తంలో చెరుగుగడతో మరో చేతితో అభయాన్ని ప్రదర్శిస్తూ ప్రశాంత రూపంలో విజయదశమి రోజు దర్శనమిస్తుంది రాజరాజేశ్వరి దేవి. ఈ రూపాన్ని దర్శించుకునే భక్తుల జన్మ ధన్యం అయినట్టే...