అన్నీ రుణానుబంధాలే…తస్మాత్ జాగ్రత్త..జాగ్రత్త..
తల్లిదండ్రులు, తోడబుట్టినవారు, భర్త, పిల్లలు, బంధువులు, చివరకు స్నేహితులు…ఇలా మనజీవితంలో ఉన్న ప్రతి రిలేషన్ రుణానుబంధమే. అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు ఓ మాట అంటారు… రుణం తీరిపోయిందేమో అని. ఆ మాటకి అందరకీ పూర్తిస్థాయిలో అర్థం తెలియకపోయినా అది నిజం. అదెలాగో ఇప్పుడు చూద్దాం….
ఒడుగయ్యాక యజ్ఞోపవీతం ధరించిన తర్వాత కనీసం ఒక్కపూటైనా సంధ్యావందనం చేసేవారి సంఖ్య ఇప్పుడున్న రోజుల్లో చాలాతక్కువ. కానీ పూర్వకాలంలో నిత్యం మూడు పూటలా సంధ్యావందనం చేసేవారు. అలాంటి ఓ బ్రాహ్మణుడు నిత్యం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నదికి వెళ్లి సంధ్యవార్చి వస్తుండేవాడు. చలికాలం, వానాకాలంలో సరేకానీ…వేసవి కాలంలో కూడా మూడు పూటలా నదికి నడిచివెళ్లేవాడు. కాళ్లకు చెప్పులు కూడా వేసుకోలేని పేదరికం. అయినప్పటికీ ఎండ మండిపోతున్నా ఒక్కరోజు కాదు ఒక్కపూట కూడా సంధ్యవార్చడం మానలేదు. నిత్యం ఆ బ్రాహ్మణుడిని మండే ఎండలో చూసి చలించిపోయిన ఓ కావలి… అయ్యా ఈ చెప్పులు, గొడుగు తీసుకోండయ్యా అని అడుగుతాడు. సంధ్యావందనం చేసుకుని వస్తున్న నాకు ఛండాలుడవైన నువ్వు ఎదురపడతావా…అయినా ఏమివ్వాలన్నా ఆ దేైవమే ఇస్తుందంటూ మళ్లీ నదికి వెళ్లి స్నానం చేసి ఇంటికెళతాడు. ఆ ఆగ్రహాన్ని పట్టించుకోని కావలి…ఈ పిచ్చి బ్రాహ్మణుడు చాదస్తంతో ఇలాగే చేస్తే చనిపోతాడేమో అని భయపడి మరుసటి ఓ రోజు మార్గ మధ్యలో గొడుగు, చెప్పులు పెట్టేసి కొన్ని పూలు, కాసిని అంక్షింతలు వాటిపై ఉంచి దూరంగా వెళ్లిపోయాడు. అవి చూసిన బ్రాహ్మణుడు నిన్న ఛండాలుడు ఇచ్చినవి కాదన్నానని ..ఆ దైవమే స్వయంగా ఇచ్చిందని భావించి స్వీకరిస్తాడు.
ఇక అదే రాజ్యంలో నివశించే ఓ కావలివాడికి ఏళ్లుగడిచినా సంతానం కలగదు. ఎన్నో మొక్కుల తర్వాత ఆ ఇంట్లో ఓ పుత్రుడు జన్మిస్తాడు. అత్యంత ప్రకాశవంతంగా కనిపించిన ఆ పిల్లవాడి జాతకం చూసిన అయ్యవారు… ఈ బాలుడు మీకు చాలా తక్కువ రుణపడి ఉన్నారు. తన చేతినుంచి పైసా కూడా తీసుకోవద్దని చెబుతాడు. అప్పటి నుంచి తల్లిదండ్రులు తనయుడి నుంచి ఏమీ ఆశించకుండా పెంచుతారు. రాజ్యంలో రాత్రిపూట కావలి కాసే తండ్రి అనారోగ్యం బారిన పడడంతో…కొడుకుని పిలిచిన ఆ తండ్రి… నాయనా ఈ రోజు నా బదులు నువ్వు రాజ్యంలో గస్తీకి వెళ్లని చెప్పాడు. తండ్రి మాట మేరకు చీకటిపడగానే రాజ్యంలో గస్తీకి వెళ్లిన ఆ ఏడేళ్ల బాలుడు ప్రతి జాముకీ ఒకసారి ఓ శ్లోకం రూపంలో ఉపదేశాన్ని ఇస్తుంటాడు. మన జీవితంలో నాలుగు ఆశ్రమాలుంటాయ్. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్తం, సన్యాసాశ్రమం…ఈ నాలుగు ఆశ్రమాలని ప్రతిబింబించేలా ఆ శ్లోకాలుంటాయి.
ఆ బాలుడు చెప్పిన మొదటి శ్లోకం….
మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర |
అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత జాగ్రత||
అంటే…. తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవన్నీ మిధ్యే. ఏవీ నిజంగా లేవు. అందుకే ఓ మానవుడా సావధానుడవై ఉండు.
మొదటి శ్లోకం విన్న రాజుగారిలో ఆలోచన మొదలైంది. నిత్యం కావలి కాసేవాడు కాకుండా ఇంకెవరు వచ్చారు. రాజ్యంలో కావలి కాసే వ్యక్తిలో ఇంత పాండిత్యం ఉందా? అసలు ఎవరు? తర్వాతి శ్లోకం ఏం చెబుతాడో అనే ఆలోచనతో నిద్రపోకుండా ఎదురుచూస్తున్నారు…
కామశ్చ, క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|
జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత||
అంటే కామము, క్రోధము, లోభము లాంటి అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనె విలువైన రత్నాలను దొంగిలించేందుకు మన శరీరంలో దాగిఉన్న దొంగలు, అందుకే ఓ మానవుడా సావధానుడవై ఉండు. ఇది గృహస్థాశ్రమానికి సంభిందించనది. యవ్వనంలో ఉండే మనిషి లో పూర్తి స్థాయిలో అహంకారంతో ఉంటాడు. అందం, సంపాదన, వ్యసనం ఇవన్నీ ఉండేది ఈ వయసులోనే. అందుకే కామ, క్రోధాలని జయించాలని చెప్పే శ్లోకం.
మరో శ్లోకం విని ఆశ్చర్యపోయిన రాజుగారు జీవిత పరమార్థాన్ని ఇంత చక్కగా వివరిస్తున్నఆ వ్యక్తి సామాన్యుడు కాదని అనుకున్నారు. ఇక యధావిధిగా నిద్రమానేసి…తర్వాత శ్లోకం కోసం ఎదురు చూస్తున్నారు…
జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః|
సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత||
ఇది వానప్రస్థాశ్రమానికి ప్రతిబింబిస్తుంది…. ఈ జన్మ, వృద్ధాప్యం, భార్య, సంసారం ఇవన్నియు దుఃఖ భరితములే. అందుకే ఓ మానవుడా సావధానుడవై ఉండు.
మూడు జాముల్లో మూడు శ్లోకాలు చెప్పిన ఆ కావలివాడు….
ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా|
ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత జాగ్రత||
అంటే ఈ మనుషులు ఎప్పుడూ ఏదో చేయవలెననే ఆశతో జీవిస్తారు. కానీ తరగిపోతున్న జీవితకాలం గుర్తించరు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండు. ఇది సన్యాసాశ్రమానికి ప్రతిబింబిస్తుంది. నువ్వు లేచినా లేవకపోయినా నీ బతుకులో పెద్దగా మార్పులుండవని అర్థం.
ఈ శ్లోకంతో తెల్లవారిపోవడంతో విధులుముగించుకుని ఇంటికి చేరుకున్నాడు బాలుడు.
ఈ శ్లోకాలు విన్న రాజు ఆశ్చర్యపోతాడు. రాజ్యంలో ఇంతమంది పండితులున్నారు…ఇప్పటి వరకూ ఎప్పుడూ వినని జీవితసత్యాల్ని బోధించిన ఆ వ్యక్తి ఎవరు? కావలి కాసే ఛండాలుడి నోట జీవితపరమార్థాన్ని చెప్పే శ్లోకాలా…అదెలా సాధ్యం అని అర్థంకాక…. భటుల్ని పిలిచిన…రాత్రి కావలి కాసిన వాడిని తీసుకురండి అని ఆదేశిస్తాడు.
కావలివాడి ఇంటికెళ్లిన రాజభటులు…ఆ బాలుడిని బంధించి తీసుకెళతారు. పట్టరాని దుంఖంలో మనిగిపోయిన తండ్రి రాజమందిరం బయటే గోడదగ్గర కూలబడిపోతాడు. అయితే బంధించి లోపలకు తీసుకెళ్లి బాలుడిని విడిపించిన రాజుగారు కనకాభిషేకం చేసి భారీగా కానుకలు అందించి… మరోసారి శ్లోకాలు, వాటి అర్థాలు చెప్పించుకుంటాడు. నువ్వు జన్మకు ఛండాలుడివే కానీ నీలో ఉన్న విద్వత్తు అసామాన్యం అని నమస్కరిస్తారు రాజుగారు. ఆ తర్వాత అపారమైన ధనరాశులతో పల్లకిలో ఇంటికి చేరుకుంటాడు. కొడుకుని చూసి తల్లిదండ్రులు ఉప్పొంగిపోతారు. చుట్టుపక్కల వారంతా పొగుడుతుంటే వారి ఆనందానికి అవధుల్లేవు. అలాంటి సమయంలో బాలుడు తన వెంట తీసుకొచ్చిన ధనరాశులను ద్వారానికి బయట నుంచి తల్లిదండ్రులకు అందించి మరుక్షణమే మరణిస్తాడు.
లేకలేక పుట్టిన తనయుడు….అపార ధనాన్ని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన పుత్రుడు కళ్లముందే కుప్పకూలిపోవడం చూసి అప్పటి వరకూ ఆనందంలో ఉన్న తల్లిదండ్రులు హుతాశులవుతారు. ఆ సమయంలో కుప్పకూలిన శరీరంలోంచి బాలుడి స్వరం వినిపిస్తుంది. నేను చండాలుడి ఇంట పుట్టవలసిన వాడిని కాదు…కానీ గత జన్మలో భవంతుడి పేరుతో నువ్వించిన చెప్పులు, గొడుగు వేసుకున్నాను. ఆ రుణం తీర్చేందుకే నీ కడుపున పుట్టి ఇంత సంపదనిచ్చానని చెబుతాడు….
అందుకే అన్నీ రుణాను బంధాలే అంటారు. పైగా డబ్బులు మాత్రమే కాదు ఏ వస్తువు కూడా గడప బయటొకరు-లోపలొకరు ఉండి తీసుకోరాదని పెద్దలు చెబుతారు.