ONGC scholarship 2020-21: ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఓఎన్‌జీసీ (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ - ONGC) ఫౌండేషన్ సహాయం అందిస్తోంది. విద్యార్థులు తమ చదువును కొనసాగించేందుకు స్కాలర్‌షిప్‌ల రూపంలో ఆర్థిక తోడ్పాటు ఇస్తోంది. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ఓఎన్‌జీసీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా గ్రాడ్యుయేషన్ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో చేరిన విద్యార్థులకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. స్కాలర్‌షిప్‌గా ఒక్కో విద్యార్థికి నెలకు రూ.4000 చొప్పున ఏడాదికి రూ.48000 ఇవ్వనుంది. మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్యలో 50 శాతం అమ్మాయిలకు కేటాయించనుంది. ప్రతిభ ఆధారంగా ఈ స్కాలర్‌షిప్‌లను కేటాయిస్తుంది.
ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్ వివరాలు..
జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌ను అందించనుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 1000, ఓబీసీ విద్యార్థులకు 500, జనరల్ విద్యార్థులకు 500 చొప్పున మొత్తం 2 వేల స్కాలర్‌షిప్‌లను ఇవ్వనుంది. దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 6వ తేదీతో ముగియనుంది. www.ongcscholar.org వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎవరు అర్హులు?
భారతదేశంలోని ఏదైనా విద్యా సంస్థలో 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశం పొందిన విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అలాగే అభ్యర్థులు తాము ఎంచుకున్న కోర్సును ఫుల్ టైమ్ రెగ్యులర్ విధానంలో చదువుతుండాలి. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఇంజనీరింగ్ (బీఈ / బీటెక్), ఎంబీబీఎస్, పీజీ స్థాయిలో ఎంబీఏ, ఎమ్మెస్సీ (జియోఫిజిక్స్/ జియాలజీ) కోర్సులలో ఫస్టియర్ చదువుతున్న విద్యార్థులు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవాలి.
60 శాతం మార్కులు ఉంటేనే..
దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సుల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ చదువుతున్న వారు అయితే ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు.. ఎంబీఏ లేదా ఎమ్మెస్సీ (జియాలజీ / జియోఫిజిక్స్) చదువుతున్న వారు అయితే డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను అకడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000 మించి ఉండకూడదు. విద్యార్థుల వయసు 2020 నాటికి 30 ఏళ్లకు మించకూడదు. మరిన్ని వివరాలకు www.ongcscholar,org, www.ongcindia.com వెబ్‌సైట్లను సంప్రదించవచ్చు.
విభాగాల వారీగా స్కాలర్‌షిప్‌ల వివరాలు..
ఒక్కో విభాగంలో ఇంజనీరింగ్ 300, ఎంబీబీఎస్ 50, ఎంబీఏ 50, ఎమ్మెస్సీ (జియాలజీ / జియాఫిజిక్స్) లకు 100 చొప్పున స్కాలర్‌షిప్‌లను కేటాయించారు. భారతదేశాన్ని మొత్తం ఐదు జోన్లుగా విభజించారు. వీటికి జోన్ - 1 (నార్త్), జోన్ - 2 (వెస్ట్), జోన్ - 3 (నార్త్ ఈస్ట్), జోన్ - 4 (ఈస్ట్), జోన్ - 5 (సౌత్) అనే పేర్లు పెట్టారు. జోన్ల వారీగా ఒక్కోదానికి 100 చొప్పున మొత్తం 500 స్కాలర్‌షిప్‌లను కేటాయించారు. అభ్యర్థులు చదువుతున్న కాలేజీ ఆధారంగా జోన్‌ను నిర్ణయిస్తారు.