Navratri Day 6 Saraswathi Devi : అక్టోబరు 20 శుక్రవారం - ఆశ్వయుజ శుద్ధ షష్టి - సరస్వతీ దేవి
దశవిధాలైన పాపాలను హరించేది కనుకే ‘దశహరా’ఇదే దసరాగా వాడుకలోకి వచ్చింది. దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి ఉహోత్సవాల్లో పరమార్థం. ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు మొదలై ఆశ్వయుజ శుద్ధ దశమి వరకూ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబరు 15 నుంచి అక్టోబరు 24 వరకూ జరగనున్నాయి. ఈ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు రోజుకో అలంకారంలో దర్శనమిస్తుంది. అక్టోబరు 20 శుక్రవారం ఆశ్వయుజ శుద్ధ షష్టి, మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిస్తోంది. మూలా నక్షత్రం చదువులతల్లి జన్మనక్షత్రం. సకల విద్యల్ని ప్రసాదించి, వారిలో జ్ఞాన దీపాలను వెలిగించే విద్యాశక్తి సరస్వతి, త్రిశక్తుల్లో ఒక మహాశక్తి ఈ సరస్వతి దేవి. సరస్వతీ అలంకారంలో అమ్మవారిని దర్శించడం మహాభాగ్యమని భక్తుల విశ్వాసం.
ఋగ్వేదంలోనూ , దేవీ భాగవతం, బ్రహ్మవైవర్త పురాణం, పద్మ పురాణంలో సరస్వతి దేవి గురించి వివిధ గాధలున్నాయి. బ్రహ్మ సకల సృష్టి కర్త కావడంతో సరస్వతిని కూడా బ్రహ్మే సృష్టించాడని , సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండేందుకు తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాధ. సృష్టి కార్యాన్ని నిర్వహించేందుకు బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని చెబుతారు. పరాశక్తి ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకరు. ఆమె కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతంలో ఉంది . వాక్ , బుద్ధి , వివేకం , విద్య , కళలు , విజ్ఞానం వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. హంసవాహినిగా , పుస్తకం మాలా ధారిణిగా శ్వేతవర్ణంలో కనిపించే అమ్మవారి చేతిలో ఉండే వీణపేరు కచ్చపి.
Also Read: రాజపుత్రుల జన్మస్థానంలో ఏం చేసినా రాజసమే-దసరా ఉత్సవాల నిర్వహణలో కూడా!
మానసిక పరిపక్వత - సకల విద్యలకు మూలం
లలిత కళలకు పట్టపు రాణి సరస్వతి దేవి. ఈ రోజు అమ్మవారిని స్వచ్ఛమైన తెలుగు రంగు వస్త్రంతో అలంకరిస్తారు. హంసవాహనంపై కొలువై ఉండే అమ్మవారు మానసిక పరిపక్వతతోపాటు సకల విద్యలకు మూలం. వాక్కు, బుద్ధి, విద్య, జ్ఞానం- వీటికి అధిష్ఠాత్రి మహా సరస్వతీ దేవి.
''సర్వ విద్యా స్వరూపా యా సా ప దేవీ సరస్వతీ''
సంగీతం, సాహిత్యం, మేధస్సు, ప్రతిభ, స్మృతి, వ్యాఖ్యానం, బోధనాశక్తి, సందేహ నివారణ శక్తి - సరస్వతీ రూపాలే. పరస్పర విరుద్ధంగా కనిపించే వేద పురాణ శాస్త్రాదులను సమన్వయం చేయించే 'సమన్వయ శక్తి' ఈ భారతీ దేవిది.
మల్లెలా, మంచులా, వెన్నెలలా, శుద్ధత్వానికి ప్రతీకగా ధవళ కాంతులతో ప్రకాశించే తల్లి మహా సరస్వతి
తపస్వుల తపశ్శక్తి. సిద్ధి స్వరూపిణి. వాగ్దేవి, వాణీదేవి, శారదాదేవి, బ్రాహ్మీ. ఈ తల్లి దయవల్లే మాటలు, మేధస్సు సమకూరుతాయి. కనుక 'సరస్వతీ కటా క్షం' మనం యాచించాలి.
Also Read : శక్తి ఉపాసనలో బెంగాలీయులకే అగ్ర తాంబూలం, కోల్ కతాలో దసరా వేడుకలు మరింత ప్రత్యేకం!
త్రి శక్తులలో ఒకటి సరస్వతి
చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో వివరించారు . అవేంటంటే
చింతామణి సరస్వతి
జ్ఞాన సరస్వతి
నిల సరస్వతి
ఘట సరస్వతి
కిణి సరస్వతి
అంతరిక్ష సరస్వతి
మహా సరస్వతి - మహా సరస్వతి దేవి రూపంలో అమ్మవారు శుంభని శుంభులనే రాక్షసులను వధించింది.
విశేష పుణ్యదినాలు
మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా భావించి శ్రీదుర్గమ్మను ఆరాధిస్తారు. అమ్మ చేతిలోని వీణ సంగీత విద్యలకు, పుస్తకం లౌకిక విద్యలు, అక్షమాల ఆధ్యాత్మిక విద్యలకు సంకేతం. ఆకాశంలో అభిజిత్ నక్షత్రం పక్కన వీణామండలం అని ఒకటుంది. వీణామండలాన్ని లైరా అనే పేరుతో పిలుస్తారు. శబ్దతరంగాల మూల స్వరూపమంతా ఆ మండలముగా ఖగోళ శాస్త్రవేత్తల భావన. వీణామండలం దగ్గరే హంసమండలం కూడా ఉంటుంది. హంసవాహినియైన సరస్వతిని ఖగోళ శాస్త్రవేత్తలు ఆ విధంగానే దర్శించారు. అటు ఖగోళపరంగా ఇటు వైజ్ఞానికంగా అమ్మవారు జ్ఞానశక్తి స్వరూపిణి. అజ్ఞానం మనిషికి జాడ్యాన్నిస్తే జ్ఞానము ఆత్మోద్ధరణకు సంకేతంగా మారుతుంది.
Also Read: దసరాల్లో బాలలకు పూజ ఎందుకు చేస్తారు - దానివెనుకున్న ఆంతర్యం ఏంటి!
ఈ రోజు సరస్వతి శ్లోకాలు చదువుకోవడం, పిల్లలకు పుస్తకదానం చేయడం ఉత్తమం...చిన్నారులకు అక్షరాభ్యాస్యాలు కూడా చేయించేందుకు ఉత్తమమైన రోజు
శ్లోకం
సరస్వతి నమ: స్తుభ్యం వరదే కామరూపిణి
విద్యరంభం కరిశ్యామి సిద్ధిర్భవతు మే సదా
పద్మపత్ర విశాలాక్షి పద్మ కేసర వర్ణని
నిత్యం పద్మాలయాం దేవీ సామం పాతు సరస్వతి