పిల్లలకు తల్లి పాలు ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే శిశువులలో తల్లిపాలు చాలా శ్రేయస్కరమైనవి. ఇది బిడ్డ, తల్లి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. పైగా దీర్ఘకాలిక ప్రయోజనాలు పిల్లలు పొందాలంటే తల్లిపాలు ఇవ్వాల్సిందే అంటారు. పైగా పిల్లలకు పాలు పట్టడం వల్ల మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 30 శాతం తగ్గుతుందని పలు అధ్యయనాలు నిరూపించాయి. మరి ఇంతకీ బ్రెస్ట్ క్యాన్సర్​తో ఇబ్బంది పడే మహిళలు కూడా పిల్లలకు పాలు ఇవ్వొచ్చా? లేదా? ఇస్తే ఏమవుతుంది?


ఆ లక్షణాలు గుర్తించాలి..


బ్రెస్ట్ క్యాన్సర్ అనేది తరచుగా పాల నాళాలు లేదా పాలను ఉత్పత్తి చేసే లోబుల్స్​లో వస్తుంది. అయితే గర్భధారణ సమయంలో లేదా తల్లిపాలిచ్చే సమయంలో రొమ్ము క్యాన్సర్​ని నిర్థారించడం కష్టం. రోగ నిర్ధారణ ఆలస్యంగా ఉండొచ్చు. ఎందుకంటే పిల్లలకు పాలిచ్చే సమయంలో చాలా లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి అవి పాలు ఇవ్వడం వల్ల కలిగేవి కూడా కావొచ్చు. అన్ని లక్షణాలు క్యాన్సర్ వల్ల కలిగేవే అనుకుంటే పొరపాటే.


అప్పుడు ఇవ్వకండి..


ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయమై కొన్ని అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది. తల్లిపాలు ఇచ్చే సమయంలో రొమ్ము క్యాన్సర్​ కారణంగా కీమోథెరపీ చేయించుకుంటే పిల్లలకు పాలు ఇవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే కీమోథెరపీ మందులు శిశువులోకి ప్రవేశించగలవు. ఈ క్రమంలో రోగ నిరోధక శక్తి, ఇన్​ఫెక్షన్​ వంటి సమస్యలు పెరుగుతాయని తెలిపింది. ప్రెగ్నెన్సీ సమయంలోనే రొమ్ము క్యాన్సర్​ గుర్తిస్తే.. సర్జన్లు, రేడియేషన్ ఆంకాలజిస్టులతో, గైనకాలజిస్ట్​ సూచనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. 


పాలు రాకపోవచ్చు..


బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స సక్సెస్ అయిన తర్వాత పిల్లలకు పాలు ఇవ్వొచ్చా? అనే ప్రశ్నకు కూడా ఇక్కడ సమాధానం ఉంది. మీరు హార్మోన్ థెరపీ లేదా నోటి కిమోథెరపీ తీసుకున్నట్లయితే.. పిల్లలకు తల్లిపాలు ఇవ్వవచ్చు. అయితే ఈ చికిత్సల వల్ల తల్లి పాల ఉత్పత్తి కాస్త ప్రభావం ఉంటుంది. రేడియేషన్​కు గురైన రొమ్ము నుంచి పాలు ఉత్పత్తి కాకపోవచ్చు. అయితే క్యాన్సర్ ఎఫెక్ట్​లేని మరో రొమ్ముతో పాలు ఇవ్వవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే క్యాన్సర్ చికిత్స పూర్తి అయిన మూడు నెలల తర్వాత పిల్లలకు పాలు ఇస్తే మంచిది. 



పలు కారణాల వల్ల క్యాన్సర్ చికిత్స్ విజయవంతంగా పూర్తి అయినా సరే.. పిల్లలకు పాలు ఇవ్వలేకపోతే మీరు చింతించకండి. మీ బిడ్డ శ్రేయస్సు కోసమే మీరు పాలు ఇవ్వట్లేదని గుర్తించుకోండి. పిల్లలకు మీరు తల్లిగా పాలు ఇవ్వలేకపోవచ్చు కానీ.. ఇతర తల్లులు ఇచ్చిన పాలతో మీ బిడ్డకు కడుపు నింపవచ్చు. ఆరోగ్యానికి కూడా రక్షణ అందించవచ్చు. వైద్యుని సలహాలు తీసుకుని.. మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటూ.. మీ పిల్లల్ని పెంచి పెద్ద చేయడమే మీ లక్ష్యంగా పెట్టుకోండి. 


Also Read : కిడ్నీ సమస్యలున్నాయా? తప్పనిసరిగా ఈ ఆహారాలను దూరం పెట్టాల్సిందే!


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే దేనినైనా ఫాలో అవ్వండి.