Diwali 2022: దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా చెబుతారు. అందుకే దీపావళి రోజు వరుస దీపాలతో సిరుల తల్లి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. ఇదే రోజు మనదేశంలో ఇతర దేవతలనూ ప్రత్యేకంగా పూజించే ఆచారం ఉంది. ఏ రాష్ట్రంలో ఎవర్ని పూజిస్తారంటే..


లక్ష్మీ గణపతి
సాధారణంగా దీపావళి అంటే లక్ష్మీపూజ చేయడం ఆనవాయితీ. అయితే చాలాచోట్ల అమ్మవారితోపాటు గణపతినీ పూజిస్తారు. పూర్వం పార్వతీ తనయుడైన గజాననుడిని లక్ష్మీదేవి దత్తత తీసుకుందట. అమ్మతనాన్ని అనుభవించాలన్న ఉద్దేశంతో తానే ఆ బిడ్డడిని పెంచి పెద్ద చేస్తానని పార్వతికి మాట ఇచ్చిందట. అందుకే దీపావళి రోజు లక్ష్మీదేవితోపాటు గణపతిని పూజించిన వారికి అఖండ సంపదలు ప్రాప్తిస్తాయని నమ్ముతారు.


కృష్ణం వందే జగద్గురుం
హైందవ సంప్రదాయంలో ప్రతి పండుగ వెనుకా ఓ పురాణ గాథ ఉంది. ఇప్పటి అసోంలోని ఒక ప్రాంతమైన ప్రాగ్‌జ్యోతిషపురాన్ని పరిపాలించే నరకుడనే రాక్షసుడిని శ్రీకృష్ణుడు సంహరించాడనీ, ఆ విజయానికి గుర్తుగా ఈ పండుగను చేసుకుంటున్నారని పురాణ కథ. అందుకే ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందావనం, మథురలాంటి చోట్ల దీపావళి రోజు శ్రీకృష్ణుడినీ పూజిస్తారు. అలాగే దీపావళి మర్నాడు  కారీతిక శుద్ధ పాడ్యమి రోజు గోవర్ధన పూజ నిర్వహిస్తారు. శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తి గోకులాన్ని కాపాడింది ఇదే రోజని విశ్వసిస్తారు.


Also Read: దివాలీ ప్రత్యేక కథనాలన్నీ ఇక్కడ చూడొచ్చు


కాళీపూజ
పశ్చిమ్‌ బెంగాల్‌, బీహార్‌, త్రిపుర, ఒడిశా, అసోం రాష్ట్రాల్లో దీపావళి రోజు కాళీ పూజ నిర్వహిస్తారు. హిందూ పురాణాల ప్రకారం, స్వర్గంలో కల్లోలం సృష్టించడమే కాకుండా దుర్గాదేవిని కూడా చికాకుకు గురిచేసిన శుంభ నిశుంభులు అనే రాక్షసులను మహోగ్రరూపంతో వధిస్తుంది కాళి. అయితే ఆ కోపంలో మనుషులనూ చంపుతూ ఉంటుంది. ఆమెను శాంత పరచడానికి శివుడు అడ్డం రాగా ఆయన గుండెల మీదా కాలేస్తుంది అమ్మవారు. ఆ తర్వాత అక్కడ ఉన్నది శివుడని స్ఫురణకు తెచ్చుకుని శాంతిస్తుంది. ఈ రాక్షస సంహారానికి గుర్తుగా దీపావళి సమయంలో ఈ ప్రాంతాల్లో కాళిని పూజిస్తారు.


గోపూజ
దీపావళి ముందు వచ్చే ద్వాదశిని గోవత్స ద్వాదశిగా మహారాష్ట్ర ప్రాంతంలో జరుపుకుంటారు. ‘వసు బరస్‌’గా పిలిచే ఈ పర్వదినం నాడు గోపూజ చేస్తారు. గుజరాత్‌లో దీన్నే ‘వాఘ్‌ బరస్‌’ అంటారు. మానవజాతికి సేవలందిస్తున్న గోవులకు కృతజ్ఞత తెలిపే పండుగ ఇది. ఇదే రోజు కొన్ని ప్రాంతాల్లో నంది వ్రతం చేసుకుంటారు. ఆవులూ, దూడలకు గోధుమ ఉత్పత్తులు ఆహారంగా పెడతారు.


Also Read: దీపావళికి పెట్టే దీపాల్లో శనిదోషం తొలగించుకునేందుకు పెట్టేదీపం వేరే!


సిక్కులు ‘బందీ చోర్‌ దివస్‌’ 
దీపావళి రోజునే సిక్కులు ‘బందీ చోర్‌ దివస్‌’ జరుపుకుంటారు. గ్వాలియర్‌ కోటలో మొఘల్‌ చక్రవర్తి జహంగీర్‌ బంధించిన 52 మంది రాజులను సిక్కుల ఆరో గురువు అయిన హర్‌ గోవింద్‌ దీపావళి నాడే విడిపించారని చెబుతారు. ఈ సందర్భంగా గురుగ్రంథ్‌ సాహిబ్‌ను పఠించడంతో పాటు, నగర కీర్తన చేస్తూ తారాజువ్వలు కాలుస్తారు.


జైనుల్లో..
జైన తీర్థంకరుడు మహావీరుడి నిర్యాణం దీపావళి సమయంలోనే జరిగిందట. అలాగే జైనుల సంవత్సరాంతం కూడా ఇదే రోజు. అందుకే ఈ రోజుల్లో జైనులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.