Telugu News: నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు మనల్ని వేధిస్తుంటాయి. చిన్న సమస్యకైనా పండితుల దగ్గరకు వెళ్లినా.. జ్యోతిష్యుల దగ్గరకు వెళ్లిన ఎన్నో రకాల పరిహారాలు చెప్తుంటారు. అయితే వాళ్లు చెప్పిన పరిహారాలు ఎంతో ఖర్చుతో కూడుకున్నవి అయి ఉంటాయి. ఒక్కోసారి లక్షల్లో ఖర్చు పెట్టమని పండితులు చెప్తుంటారు. అయితే కోట్లలో ఆస్తులు ఉన్నవాళ్లు లక్షలు ఖర్చు పెట్టడం పెద్ద కష్టం ఏమీ కాదు కానీ సామాన్యుల పరిస్థితి ఏంటి? అందుకే మన సనాతన ధర్మంలో ఎటువంటి సమస్యకైనా ఖర్చు లేని పరిహారాలు సూచించారు. పెద్ద పెద్ద సమస్యలకు కూడా ఖర్చు లేని లేదా తక్కువ ఖర్చుతో పరిష్కారాలను కొందరు పండితులు సూచించిన చిన్న రెమెడీస్‌ను ఈ కథనంలో తెలుసుకుందాం.
ALSO READ: రాధాష్టమి ఎప్పుడొచ్చింది..ఈ రోజు విశిష్టత ఏంటి - పూజావిధానం!
ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ.. అన్ని అర్హతలు ఉన్నా ఎటువంటి ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వాళ్లు మంచి రోజు చూసి 9 పసుపు కొమ్ములను తీసుకుని కాల్చి బూడిద చేసి ఆ బూడిదను పారే నీటిలో కలిపితే త్వరలోనే కోరుకున్న ఉద్యోగం వస్తుందట. ఇక ఏదైనా పనిలో ఆటంకాలు ఎదురవుతుంటే దగ్గరలోని గుడికి వెళ్లి అక్కడి వినాయకుడిని రెగ్యులర్‌గా గరికతో పూజిస్తుంటే పనిలో ఆటంకాలు తొలగిపోతాయంట. అకారణంగా అవమానాలు ఎదురవుతున్నా.. చీటికి మాటికి గొడవలు జరుగుతున్నా.. ఎడమచేతికి ఎరుపురంగు కంకణం కట్టుకుంటే కొంతవరకు ఫలితం ఉంటుందట. ఇక దాయాదులతో ఆస్తి, భూ తగాదాలు ఉన్నవాళ్లు సక్రమంగా పితృకర్మలను నిర్వర్తిస్తూ.. కాకులకు అన్నం ముద్ద పెడితే త్వరలోనే దాయాదులతో ఉన్న ఆస్తి, భూ తగాదాలు సమసిపోతాయట.
ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని హాస్పిటల్స్ చుట్టు తిరిగినా పిల్లలు కానీ దంపతులు కాళికాదేవికి రెగ్యులర్‌గా నిమ్మకాయల దండ సమర్పిస్తూ ఉంటే త్వరలోనే వారికి సంతాన భాగ్యం కలుగుతుందట. అయితే ఆ నిమ్మకాయలు బేసి సంఖ్యలో ఉండేటట్లు చూసుకోవాలట. ఇక వివాహం ఆలస్యం అవుతున్న అమ్మాయిలు తమ తల దువ్వుకున్న తర్వాత వచ్చే చిక్కును ( జుట్టును) జాగ్రత్తగా మూటకట్టి శనివారం నాడు పారే నీటిలో వేస్తే త్వరలోనే వారికి వివాహ ప్రాప్తి ఉంటుందట. ఇక భూ వివాదాలు తలెత్తి ఎప్పటికీ సమసిపోకుండా ఉంటే ప్రతి మంగళవారం తప్పకుండా భార్య చేతి వంట లేదా స్వగృహంలోనే భోజనం చేయడం కొంత వరకు వివాదాన్ని తగ్గిస్తుందట.
ఇల్లు అమ్ముడు పోక ఇబ్బందులు పడుతున్న వారు ఇంటి లోపల ఏదో ఒక గదిలో పసుపు రంగును వేయిస్తే ఆ ఇల్లు అతి తొందరలో మంచి ధరకు అమ్ముడవుతుందట. ఎవరు హాని చేస్తున్నారో తెలియని రహస్య శత్రువులు ఉన్నవారు. రాహుకాలంలో శత్రునివారణ జరగాలని కోరుకుంటూ 7 ఎండు మిరపకాయలను తీసుకుని పసుపురంగు గుడ్డలో కట్టి వాటిని ఇంటికి దూరంగా ఎవరూ చూడని ప్రదేశంలో పడవేయాలట. ఏ కారణం చేతనైనా మీరు విదేశాలు వెళ్లే ఛాన్స్ మిస్ అయి పోతూ ఉంటే గణపతి ఆలయంలో నిమ్మకాయ డొప్పలో దీపారాధన చేయడం వల్ల త్వరలోనే విదేశీయానం ఉంటుందట.
ALSO READ: ‘దసరా నవరాత్రుల్లో పూజించాల్సిన నవ దుర్గలు - దేవీ కవచంలో ఉన్న అలంకారాలివి!
ఎంత సంపాదించిన నిలవకపోవడం. లేదా చాలీచాలని సంపాదన ఉన్నా 6 శుక్రవారాలు గులాబీ పువ్వును అత్తరులో ముంచి మీ పూజామందిరంలో ఉంచాలట. ఇలా ఆరు శుక్రవారాలు చేస్తే మీ సంపాదన గతంకంటే కొంత పెరుగుతుందట. దీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మీ వయసు ఎంతో అన్ని బొగ్గు ముక్కలను తీసుకుని పారే నీటిలో వదలితే త్వరలోనే మీకు అనారోగ్య బాధలు తగ్గిపోతాయట.
NOTE: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక ఆంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు ఏడీపీ దేశం ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ఏబీపీ దేశం, ఏబీపీ నెట్వర్క్ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.