మన దేశంలో నవరాత్రి తొమ్మిది రోజుల పాటు సాగే పండగ. ఈ పండగ కోసం ఏడాదంతా వేచి ఉంటారు భారతీయులు. దేశమంతా వివిధ సంస్కృతుల్లో, వివిధ పద్ధతుల్లో నవరాత్రి జరుపుకుంటారు. ఉత్తర భారతదేశం అంతా కూడా చాలా కోలాహలంగా దేవి మంటపాలు నెలకొలిపి తొమ్మిదిరోజుల పాటు శోభాయమానంగా పండగ చేస్తారు. దేవీ పూజతో పాటు ఆటపాటలూ ఉంటాయి.


గార్బా, దాండియాలుగా పిలిచే ఈ జానపద నృత్యాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అందమైన రంగురంగుల ఎంబ్రాయిడరీతో ఉండే దుస్తులు ధరించి యువతీ యువకులు చేసే ఈ నృత్యాలు కన్నుల పండువగా ఉంటాయి.


ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ నృత్య రీతులు చాలా క్రేజ్‌ను సంపాదించుకున్నాయి. ఇప్పుడు ప్రాంతాలకు అతీతంగా అందరూ ఈ నృత్యాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరి వీటి మధ్య ఉండే తేడా తెలుసా? అవేమిటో ఇక్కడ తెలుసుకుందాం. గార్బా, దాండియా రెండూ కూడా గుజరాతి నృత్యాలే. మహిషాసురుడిని వధించే క్రమంలో తొమ్మిదిరోజుల పాటు సాగిన ఆమె యుద్ధ రీతిని వివరించేవిగానే సాగుతాయి.  


గార్బా గుజరాతి గ్రామాల్లో పుట్టిన కళ. ఇప్పుడు దేశమంతా విస్తరించింది. ముఖ్యంగా గుజరాతీ కమ్యూనిటీలు ఉన్న ప్రతిచోజా ఈ నృత్యాలు చేస్తుంటారు. పెద్ద దీపపు సెమ్మె లేదా దేవి విగ్రహం చుట్టూ వృత్తాకారంలో తిరుగుతూ ప్రదర్శిస్తుంటారు. ఒకరినొకరు దాటు కుంటూ తిరుగుతూ చేసే బృంద నృత్యం ఇది. అయితే, ఇప్పుడు పెళ్లిల్లు, ఇతర వేడుకల్లో కూడా చేస్తున్నారు. భాషా, ప్రాంతంతో సంబంధం లేకుండా అంతా దాండియా, గార్బా డ్యాన్సులు చేస్తున్నారు.


గార్బా స్త్రీ శక్తిని, ఫెర్టిలిటిని ఆరాధిస్తూ సాగే నృత్యం. తల్లిదుర్గాదేవి లోని మాతృత్వపు తొమ్మిది రూపాలను కొలిచే నృత్య రీతి.


లయబద్ధమైన దాండియా కర్రలతో దరువు వేస్తూ వృత్తాకారంలో తిరుగుతూ ప్రదర్శించే నృత్యం దాండియా.


దాండియాకు, గార్బాకు మధ్య తేడాలు ఇవే:



  • గార్బా నృత్యం కీర్తనలు, భజనలకు చేస్తారు. ఇది భక్తి దాండియా కంటే కూడా భక్తి, ఆకర్శణ కలిగిన నృత్యం.

  • దాండియా హారతి తర్వాత సాయంత్రం ఆనందంగా చేసే నృత్యం.

  • గర్భా చేతులు ఉపయోగించి ఆడే నృత్యం. మధ్య మధ్య చప్పట్లు కొడుతూ రకరకాలుగా కాళ్లు చేతులతో విన్యాసం చేస్తూ చేస్తారు.

  • రంగురంగుల దాండియా కర్రలు ఉపయోగించి దాండియా ఆడతారు.

  • దాండియా ఆడేందుకు బృందంలో సరి సంఖ్యలో వ్యక్తులు ఉండాలి. గార్బాకు అలాంటి అవసరం ఉండదు.

  • గార్బా పాటలన్నీ కూడా దేవిని స్తుతిస్తూ ఉంటాయి. దాండియా పాటలు కృష్ణ లీల గురించి ఉంటాయి.


గార్బా, దాండియా రెండూ కూడా నవరాత్రి సమయంలో చేసినప్పటికీ రెండింటిలోనూ ఇలా కొన్ని తేడాలు ఉంటాయి.


Also read : లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ ఫొటోను ఇంట్లో పెట్టుకోవచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.