Chanakya Niti: మన జీవితంలో ఎన్ని విప‌త్క‌ర‌ పరిస్థితులు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి ముందుకు సాగాలని చాణక్యుడు తన చాణక్య నీతిలో పేర్కొన్నాడు. మనం ఏ కారణంతోనైనా ధైర్యాన్ని వదులుకోకూడదు. అయితే, కొన్ని సందర్భాల్లో ఆ పరిస్థితిని ఎదుర్కోవడం లేదా మార్చడం మనకు కష్టంగా ఉండవచ్చు. అలాంటప్పుడు వ్యక్తి తన మొత్తం ప్రవర్తనను మార్చుకోవాలి. అప్పుడే సుఖ సంతోషాలు, విజయాలు లభిస్తాయని ఆచార్య చాణక్యుడు స్ప‌ష్టం మచేశాడు.


కొన్ని క్లిష్టమైన‌, ప్రమాదకర పరిస్థితుల్లో, దానిని ఎదుర్కొనేందుకు నిలబడటం మన జీవితాలను ప్రమాదంలో పడేస్తుందని ఆచార్య చాణక్యుడు పేర్కొన్నాడు. ఇలాంటి సందిగ్ధంలో నిర్ణయం తీసుకుని సమయాన్ని వృథా చేసుకోకూడ‌ద‌ని సూచించాడు. అలాంటి ప్రదేశాన్ని వెంటనే విడిచిపెట్టడం మంచిదని చాణక్యుడు తన చాణక్య నీతిలో వెల్ల‌డించాడు.


1. దేశంపై దాడి
ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలోని ఒక శ్లోకంలో ఇలా చెప్పాడు. మ‌రో దేశం రాజు మన దేశ‌పు రాజు కంటే శక్తిమంతుడై  ఉండి, మన దేశంపై దాడి చేసిన‌ప్పుడు, అత‌ని సైన్యం మ‌న దేశం సైన్యం కంటే రెండింతలు శక్తిమంతంగా కనిపిస్తే, మనం వెంట‌నే దేశం నుంచి పారిపోవాలి. ఒక దేశంపై దాడి జరిగినప్పుడు, అక్కడ నివసించే ప్రజలు తరచుగా దాని ప్రభావాలను అనుభవిస్తారు. ఆర్థిక అవరోధాలు, ఆహార కొరతను ఎదుర్కొంటారు.


2. కరవు స‌మ‌యంలో
మీరు నివసించే ప్రదేశంలో కరవు ఏర్పడినా, లేదా మీ ప్రాంతంలో తినడానికి, త్రాగడానికి, జీవించడానికి వనరులు లేకుండా ఉంటే, వెంటనే అటువంటి ప్రదేశం నుంచి పారిపోండి. మీరు కరువు పీడిత ప్రదేశంలో నివసిస్తుంటే, ఇది ఖచ్చితంగా మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని సంక్షోభంలో పడేస్తుంది. కరవు ఉన్న ప్రదేశాలలో నివసించకూడదని చాణక్యుడు చెప్పాడు.


3. హింసాత్మ‌క ప్ర‌దేశం
చాణక్యుడి విధానం ప్రకారం అల్లర్లు జరుగుతున్న చోట మనం ఉండకూడదు. అల్లర్లు జరిగినా అక్కడి శాంతిభ‌ద్ర‌త‌ల‌ పరిస్థితిని సక్రమంగా నియంత్రించగలగాలి. లేకపోతే, మీరు అలాంటి ప్రదేశంలో నివసించకూడదు. మీరు అలాంటి ప్రదేశాలలో నివసిస్తుంటే అది మీ ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతుంది. అందుకే ఇలాంటి ప్రదేశాల్లో ఒక్క క్షణం కూడా ఆగకూడదని చాణక్యుడు చెప్పాడు.


4. ప్రతీకార జ్వాల
శత్రువులు పూర్తి శక్తితో మీపై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు, వారిపై ప్రతీకారం తీర్చుకునే బదులు, మీరు వెంటనే స్థలం నుంచి వెళ్లిపోవాలి. వ్యూహం లేకుండా శత్రువును ఎదుర్కోవడం అవివేకం. ఆ క్షణానికి నీ ప్రాణాన్ని కాపాడుకుంటే మళ్లీ అతనితో పోరాడవచ్చు. కాబట్టి ఓపికపట్టండి. సురక్షితమైన ప్రదేశానికి వెళ్లడం గురించి ముందుగా ఆలోచించండి.


Also Read : మీ జీవితంలో ఈ ముగ్గురు ఉంటే అదృష్టం మీ వెంటే!


పైన పేర్కొన్న పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఎప్పుడూ నివ‌సించ‌కూడదు. అలాంటి ప్రదేశంలో ఉంటే అది అత‌ని ప్రాణానికే ప్రమాదం. కాబట్టి, వీలైనంత జాగ్రత్తగా ఉండాల‌ని చాణ‌క్యుడు సూచించాడు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.