Chanakya Niti In Telugu: గొప్ప వ్యూహకర్త, ఆర్థికవేత్త అయిన చాణక్యుడు తన విధానాల బలంతో నంద వంశాన్ని నాశనం చేసి...చంద్రగుప్త మౌర్యను మగధ చక్రవర్తిగా చేశాడు. ముఖ్యంగా రాజ్యంలో పరిపాలన సక్రమంగా సాగాలంటే..గూఢచారి వ్యవస్థకు చాలా ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చాడు చాణక్యుడు. గూఢచారుల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా ప్రభువు తన పరిపాలనా విధానంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు గూఢచారుల ఎంపికలో జాగ్రత్త వహించాలని చెప్పిన చాణక్యుడు వాళ్లలో రకాలను వివరించాడు. గూఢచారులు అంటే కేవలం పురుషులు మాత్రమే కాదు స్త్రీలు కూడా ఉన్నారు...
Also Read: మీ జీవితంలో ఆ ఇద్దరి మీదా ఎప్పుడూ నోరు పారేసుకోవద్దు…ఎవరా ఇద్దరు....చాణక్యుడు ఎందుకలా చెప్పాడు…
చాణక్యుడు చెప్పిన గూఢచారులు 5 రకాలు
1. కాపాటిక
మంచి వక్తగా, విద్యాలయంలో చదువుతున్న విద్యార్థిగా ఉన్నట్టు అందర్నీ నమ్మిస్తాడు. తాను తెలుసుకుని చెప్పాల్సిన విషయాలు ప్రభువుకి చేరవేస్తాడు
2.ఉదాస్థిత
ఎప్పుడూ ఏకాంతంగా ఉండే సన్యాసులుగా ఉంటారు. అపారమైన జ్ఞానం, తెలివి వీరి సొంతం. ఎవ్వరికీ అనుమానం రాకుండా రాజ్యంలో ఉండే సమస్యలు, ప్రజల అభిప్రాయాలు సేకరించి రాజుకి చేరవేస్తారు.
3.గృహపాటిక
బీదరైతుగా ఉంటూ కావాల్సిన సమాచారం సేకరిస్తాడు
4.వైదేహిక
ఇంటింటికీ తిరుగుతూ వస్తువులు విక్రయించే బీద వ్యాపారిగా ప్రజల మధ్య ఉంటూ అభిప్రాయసేకరణ చేపడతాడు
5. తాపస
మునీశ్వరుడి వేషంలో తిరుగుతూ ప్రజల గౌరవాన్ని పొందుతూ విషయ సేకరణ చేస్తాడు
Also Read: వైవాహిక జీవితం - లైంగిక సంబంధాలు.. చాణక్యుడు చెప్పిన ఆసక్తికర అంశాలు
ఇక చాణక్యుడి కాలంలో స్త్రీ గూఢచారుల విషయానికొస్తే
1.పరివ్రాజిక
ఓ పేద బ్రాహ్మణ వితంతు స్త్రీగా ఓ ఇంటిలో ప్రవేశించి కావాల్సిన విషయాలు రాబట్టే స్త్రీని 'పరివ్రాజిక' అంటారు
2.సూద
ఇంటింటా అడుక్కునే స్త్రీగా- ఇంట్లో పనిమనిషిగా వంటమనిషిగా ఉంటూ వివరాలు రాబట్టే స్త్రీని 'సూద' అంటారు
3. అరాలిక
మాంసాహారం వండడంలో నిపుణురాలిగా ఇళ్లలో చేరి సమాచారం సేకరించే స్త్రీని 'అరాలిక'
4.స్నాపాశ
స్నానపానాదులు చేయించేవారిగా వచ్చి పోతూ సమాచార సేకరణ చేపడితే 'స్నాపాశ' అంటారు
మరికొందరు గూఢచారులు
- విరోధి అయిన రాజు కోటలోకి వెళ్లివచ్చే వ్యాపారులను ,సన్యాసులను కూడా ద్రవ్యాకర్షణతో గూఢచారులుగా ఉపయోగించునేవారు
- విరోధరాజ్యంలో ఉన్న పౌరులు కొందరికి రకరకాల ఆశ చూపి లొంగదీసుకుని సమాచారం సేకరిస్తారు. వారి మద్దతులో దేశంలో అస్థిరత పిరిస్థితులు సృష్టించి తద్వారా ఆరాజ్యంపై దండయాత్ర చేసి విజయం సాధిస్తారు.
- కొందరు ఆటవికులకు ద్రవ్యం ఇచ్చి అడవిలోకి రాకపోకలు సాగించేవారి వివరాలు రాబట్టేవారు
- మూగవారిగా, గుడ్డివారిగా, చెవిటివారుగా, కుంటివారుగా నటించే గూఢచారులు కొందరుంటారు
- కొందరు గూఢచారులకు ఒకరితో మరొకరికి పరిచయం ఉంటే ఇంకొందరికి పరిచయం ఉండదు అయినా అందరూ తమకు నిర్ధేశించిన పనిచేసుకుపోతుంటారు.ఇలా గూఢచారి వ్యవస్థ గురించి కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో మొదటి అధికరణం ఎనిమిదో ప్రకరణంలో మరికొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు.