అర్థశాస్త్రంలో ఎనిమిది రకాల వివాహాల గురించి చెప్పాడు చాణక్యుడు
బ్రాహ్మణ: యుక్త వయస్సు వచ్చిన తన కుమార్తెను తండ్రి తగు వరుడుకి ఇచ్చి వివాహం చేయడం
ప్రజాపత్య: తండ్రి అనుమతి లేకుండా ఓ పురుషుడు - ఓ స్త్రీని వివాహం చేసుకోవడం
ఆర్ష: వివాహం అయిన తర్వాత వరుడు రెండు గోవులను వధువు తండ్రికి ఇచ్చి పెళ్లిని శాస్త్రబద్ధం చేసుకోవడం.
దైవ: దైవపీఠం వద్ద తండ్రి తన కుమార్తెను పురోహితుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తికి ఇచ్చేయడం
గాంధర్వ: ప్రేమికులు రహస్యంగా పెళ్లిచేసుకోవడం
అసుర: తండ్రి తన కుమార్తెను ఏదో ఒక ధరకు ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లిచేయడం
రాక్షస: అమ్మాయిని బలవంతంగా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవడం
పైశాచ: యువతికి మత్తుమందిచ్చి ఆమెకు తెలియకుండా పెళ్లిచేసుకోడం
మొదటి నాలుగు చట్టబద్ధత కల వివాహాలు... మిగిలిన నాలుగూ చట్టబద్ధతలేని వివాహాలు అయినప్పటికీ… ఆ తర్వాత వధువు తల్లిదండ్రులు అంగీకరించాక… అవికూడా చట్టబద్ధమైనవి అవుతాయి.
వివాహ సమయంలో ఇచ్చిన కట్నం వరుడి తండ్రికి చెందుతుంది. తండ్రిలేకపోతే తల్లికి చెందుతుంది. పురుషుడు పునర్వివాహం చేసుకుంటే ఆ కట్నం మొత్తం స్త్రీకే చెందుతుంది.
పెళ్లి ఎప్పుడు రద్దుచేసుకోవచ్చు
- పెళ్లి విషయంలో ఒప్పందం కుదిరినా… పాణిగ్రహణం కాకపోతే వివాహం రద్దుచేసుకోవచ్చు.
- పాణిగ్రహణం అయిన తర్వాత కూడా… వధువు ఇదివరకే కన్యత్వం కోల్పోయిందని రుజువైనా… వరుడు పురుషత్వం లేనివాడైనా ఆ వివాహం రద్దవుతుంది. ఈ నియమం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలవారికే వర్తిస్తుంది.
- శూద్రుల విషయంలో వైవాహిక ఒప్పందం వధూవరుల కలయికకు ముందు ఎప్పుడైనా జరగొచ్చు. కలయిక అయిన తర్వాత రద్దు అయ్యే అవకాశం లేదు.
- ఏ కులంలో అయినా స్త్రీ గర్భవతి అయిన తర్వాత వివాహం రద్దుకి అవకాశం ఉండదు
- స్త్రీకి లైంగికపరమైన లోపం ఉందని తల్లిదండ్రులకు తెలిశాక… రహస్యంగా ఉంచి పెళ్లి చేసినా… వధువుకు-ఆమె తల్లిదండ్రులకు అపరాధ రుసుము విధించి పెళ్లి రద్దుచేస్తారు. పురుషుడి విషయంలో ఇదే జరిగితే అపరాధ రుసుము ఎక్కువ మొత్తంలో వసూలు చేయాల్సి ఉంటుంది
- పెళ్లిచూపుల్లో ఒకరిని చూపించి మరోకరితో పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తే అది పెద్దనేరంగా భావించి… వధువు లేదా వరుడు తల్లిదండ్రుల నుంచి పెద్దమొత్తంలో అపరాధ రుసుము వసూలు చేయాల్సి ఉంటుంది.
- కౌటిల్యుడి కాలంలో రజస్వల అయిన బాలికకు మూడేళ్లలోపు పెళ్లి జరిపించడం సంప్రదాయం. అలా చేయకపోతే బాలికతండ్రి శిక్షార్హుడు.
- తమ కులానికి చెందిన పురుషుడితో కూతురికి తండ్రి పెళ్లి చేయాలి. వేరే కులానికి చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లిచేస్తే… ఆ సమయంలో వధువుకి ఇచ్చిన నగలన్నీ తండ్రి తిరిగి తీసుకోవచ్చు. కులాంతర వివాహానికి చాణక్యుడు విధించిన శిక్ష ఇది.
- స్త్రీకి 12 ఏళ్లు వచ్చినపుడు… పురుషుడికి 16 ఏళ్లు ఉండాలి. అప్పుడే వారి వైవాహిక జీవితం మొదలవుతుంది. వేరే కారణాలతో బాలిక తల్లిదండ్రులు కాలయాపన చేస్తే శిక్షార్హులు.
- ఏ కారణం చేతేనైనా పెళ్లిచేయలేకపోతే… కనీసం నిశ్చితార్థమైనా జరిపించాలి. ఆ తర్వాత ఏడు నెలలు దాటేలోగా పెళ్లిచేయకపోతే…వరుడు-వధువు లైంగిక సంబంధం పెట్టుకోవచ్చు. అది నేరంగా పరిగణించరాదు.
- నిశ్చితార్థం అయిన తర్వాత ఏవేవో కారణాలు చూపి వరుడు… వధువుని నిందిస్తే శిక్షార్హుడు. ఆ వివాహం కూడా రద్దు చేసి సదరు వరుడికి శిక్ష విధిస్తారు.
- పెళ్లైనంత మాత్రాన భార్యపై… భర్తకి సర్వాధికారులు ఉండవు. ఆమె అంగీకారం లేకుండా ముట్టుకోరాదు.. అంటూ వైవాహిక జీవితం - లైంగిక సంబంధాల గురించి చాణక్యుడు తన అభిప్రాయాలు పేర్కొన్నాడు.