Chanakya Neeti In Telugu : ఆచార్య విష్ణుగుప్తుడు (చాణక్యుడు) రచించిన చాణక్యనీతిలో ప్రతి అక్షరం జీవితంలో ప్రగతి సాధించేందుకు ఉపయోగపడుతుంది. అప్పటి కాలంలో పరిస్థితులను బట్టి చాణక్యుడు చెప్పినప్పటికీ నేటి తరానికి కూడా చాలా విషయాలు వర్తిస్తాయి. అవి అనుసరిస్తే ఉన్నత స్థానానికి చేరుకోవడం ఖాయం. ముఖ్యంగా ధర్మం, శాంతి, సంస్కృతి, జీవన విధానం, న్యాయం, సుశిక్షణ సహా పలు అంశాల గురించి శిష్యులకు బోధించాడు చాణక్యుడు. మంచి నడవడిక, బుద్ధి కుశలత, ధర్మనిష్ట, కర్మశీలత్వం, మనిషి సముచిత వికాసానికి దోహదపడే ఎన్నో అంశాల గురించి చెప్పాడు. ఇందులో భాగంగా 8 మంది వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాడు చాణక్యుడు. ఎవరు ఎంత బాధలో ఉన్నా, దుఃఖంలో కూరుకుపోతున్నా ఈ 8 మందికి అస్సలు పట్టదట.


శ్లోకం
రాజా వేశ్యా యమశ్చాగ్నిః చౌరాః బాలక యాచకః
పరదుఃఖం  న జానన్తి అష్టమో గ్రామకర్ణకాః


ఎవరెవరు ఎదుటివారి బాధను పట్టించుకోరో వారి గురించి ఈ శ్లోకంలో వివరించాడు ఆచార్య చాణక్యుడు.  రాజు, వెలయాలు, యముడు, అగ్ని, దొంగ, పిల్లవాడు, బిచ్చగాడు, గ్రామకరణం ఈ ఎనిమిది మందీ ఎదుటివారి బాధను అస్సలు పట్టించుకోరట.


రాజు


రాజుకి అసలు దుఃఖం ఎలా ఉంటుందో తెలియదు. హిందీలో ఓ నానుడి ఉంటుంది. జాకే పైర్ న పఢీ బివాయీ, సో క్యా జానే పీర్ పరాయి ( ఎవరి కాళ్లకు పగుళ్లు ఉండవో వాడికేం తెలుస్తుంది పరాయివాడి పీడ). అంటే దుఃఖాన్ని అనుభవించనివాడికి ఎదుటివాడి బాధ ఏం తెలుస్తుందని అర్థం. దానికి తోడు రాచకార్యాలు నడిపే రాజు కఠినంగా ఉన్నప్పుడే చాలా సమస్యలను ఎదుర్కోగలడు, పరిష్కరించగలడు. అందరి కష్టాలు, నష్టాలు తెలుసుకుంటూ పోతే పాలన చేసేదెప్పుడు.


వేశ్య


వేశ్యకి ఎవరి కష్టాలతోనో పనేముంటుంది. ఆమెకు డబ్బుతోనే పని. తన పని అయిందా లేదన్నదే లెక్క. ఎవరి ఇల్లు కూలితే ఆమెకేంటి, ఎవరు బాధపడితే ఏం సంబంధం.


Also Read: మీ జాతకంలో ఈ గ్రహాలు బలంగా ఉంటే పర్వాలేదు కానీ బలహీనంగా ఉంటే జీవితం నరకమే!


యమధర్మరాజు


ఇతరుల దుఃఖాన్ని యమధర్మరాజు కూడా చూడడు. ఎదుటివారి బాధను యమధర్మరాజు పరిగణలోకి తీసుకుంటే తన పాశానికి పని చెప్పలేడు. కుటుంబ సభ్యులంతా ఏడుస్తున్నా, కుంగిపోతున్నా అవేమీ పట్టించుకోకుండా ప్రాణం పట్టుకుని వెళ్లిపోతాడు యమధర్మరాజు


దొంగ


దొంగకి దొంగిలించడమే వృత్తి. తనకు కావాల్సిన డబ్బు, నగలపై దృష్టి పెడతాడు కానీ ఆ ఇంట్లో వాళ్లు ఎంత బాధపడతారో ఆలోచించడు. కష్టార్జితాన్ని తాను దోచుకెళ్లిపోతే వాళ్లెంత బాధపడతారో అస్సలు స్ఫురణకు కూడా రాదు


చిన్న పిల్లలు


చిన్న పిల్లలకు ఏమీ తెలియదు. తమకు ఏం కావాలో అది సాధించుకోవడమే పని. అందుకే  తమ పని అయ్యేవరకూ ఏడుస్తూనే ఉంటారు కానీ ఎదుటి వారి దుఃఖంతో వారికేం పని. ఆ వయసు అలాంటిది మరి. పంతం పట్టడం, అలగడం, అల్లరి చేయడమే వారి పని. అమ్మా నాన్ని ఇబ్బంది పెడుతున్న విషయం కూడా వారికి తెలియదు కదా.


యాచకుడు


అడుక్కునేవాడికి అందరి ముందూ చేయిచాచడమే పని. ఎవరు ఏమనుకంటే తనకేంటి..ఎవరి దగ్గర ఉందో లేదో తెలుసుకోవడం, వారి బాధలు గురించి పట్టించుకోవడంతో వాళ్లకేం పని. చాచిన చేతిలో ఎంత వేశారన్నదే ముఖ్యం.


Also Read: రామ రావణ యుద్ధం తర్వాత యుద్ధభూమిలో జరిగిన సంఘటన ఇది


వివాదాలు పెట్టేవారు


ఇంకొందరికి ఇద్దరి మధ్య తగవులు పెట్టడమే పని. వాళ్లు వాళ్లు ఎలా కొట్టుకుచస్తారో పట్టదు. ఎదుటివారి మధ్య వివాదం చూసి వీరిలో ఆనందం ఉప్పొంగుతుంది


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే.  దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.