రాతి యుగం నుంచి నేటివరకు ప్రజలు ఎన్నో నమ్మకాలతో జీవిస్తున్నారు. వాటిలో కొన్ని సైన్స్‌కు అంతు చిక్కని విధంగా ఉంటే.. మరికొన్ని ఏదో ఒక లాజిక్‌తో ముడిపడి ఉంటాయి. చాలామంది వాటిని తమ నమ్మకం అంటారు. మరికొందరు మాత్రం మూఢ నమ్మకాలు అని కొట్టి పడేస్తుంటగారు. అయితే, ఈ నమక్మాలు ఒక్కో ప్రదేశంలో, సంస్కృతిలో ఒక్కోవిధంగా ఉంటుంటాయి. అయితే, మీకు మనకు తెలిసిన కొన్ని నమ్మకాలు, వాటి వెనుక ఉన్న కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.


కన్ను అదరటం


కన్ను అదిరితే కొన్ని సార్లు మంచిదని కొన్ని సార్లు చెడుకు సంకేతమని అంటుంటారు. దీని ఫలితం ఆడవారికి ఒకలా, మగవారికి ఒకలా ఉంటుంది. కుడి కన్ను అదిరితే పురుషులకు, ఎడమ కన్ను అదిరితే స్త్రీలకు మంచిదంటారు. కన్ను అదరడానికి చాలా రకాల శాస్త్రీయ కారణాలను వివరించినా సరే ఈ నమ్మకం అలా కొనసాగుతూనే ఉంది. కన్ను అదిరేందుకు కళ్లు పొడిబారడం, కంటిలో అలెర్జీ, నీరసం, ఒత్తిడి, ఆల్కాహాల్ తీసుకోవడం వంటి లాజికల్ కారణాలు అనేకం ఉన్నాయి.


అద్దం పగలడం


అద్దం పగిలితే అది దురదృష్టంగా భావిస్తారు. పగిలిని అద్దంలో ముఖం కనిపించడాన్ని చెడుకు సంకేతంగా భావిస్తారు. అందుకే పగిలిన అద్దాలు ఇంట్లో ఉంచుకోవద్దని పెద్దవాళ్లు గట్టిగా చెబుతారు. నిజానికి పగిలిన అద్దాలు ప్రమాదాలకు కారణం కావచ్చు అందువల్ల వీటిని ఎప్పటికప్పుడు తీసి బయట పడెయ్యడం అవసరమనేది దీని వెనకున్న లాజిక్.


నిమ్మకాయలు, మిరపకాయలను వేలాడదీయడం


మన దేశంలో దురదృష్టాన్ని ఇచ్చే దేవత అదలక్ష్మి. ఈమెకు కారంగా, పుల్లగా ఉండే ఆహారాలు ఇష్టమైనవనే నమ్మకం. అందుకే చాలా మంది తమ వాహనాలకు, వ్యాపార ప్రదేశాల ముఖద్వారాలకు మిరపకాయలు, నిమ్మకాయలు దారానికి గుచ్చి వెలుపలి వైపు వేలాడ దీస్తుంటారు. అలక్ష్మీ అక్కడే తనకు ఇష్టమైన ఆహారం తినేసి సంతృప్తి పడి లోపలికి రాకుండా వెళ్లిపోతుందని ఒక నమ్మకం.


నల్లపిల్లి అడ్డురావడం


నల్ల పిల్లి అపశకునమనే నమ్మకం మన దేశంలో మాత్రమే కాదు పాశ్చత్య సంస్కృతిలో కూడా చలామణిలో ఉంది. ఈజిప్షియన్లు నల్ల పిల్లిని అపశకునంగా భావిస్తారు. ఇక మనవాళ్లకు నలుపు శనికి సంబంధించిన రంగు. నల్లపిల్లి ఎదురుపడితే వెంటనే మీకంటే ముందు మరొకరు వెళ్లిపోయే వరకు ఆగాలని అంటుంటారు. ఎందుకంటే నల్లపిల్లి ఎదురవడం మంచి శకునం కాదని చాలా గట్టిగా విశ్వసిస్తారు.


దిష్టి చుక్క


మన దేశంలో చాలా మంది పసిపిల్లలకు కణత దగ్గర నల్లని చుక్క పెడుతుంటారు. దీనిని దిష్టి చుక్క అంటుంటారు. పిల్లలు సున్నితంగా ఉంటారు కనుక ఎవరి చెడు దృష్టి వీరి మీద ప్రభావం చూపకూడదనేది దీని వెనకున్న భావం. చెడు దృష్టి పిల్లల ఆరోగ్యానికి చెరుపు చేస్తుందని నమ్ముతారు. కణత దగ్గర నల్లని చుక్క పెట్టడం వల్ల పిల్లలు అందంగా కనిపించక పోవడం వల్ల దుష్టశక్తులు వీరి జోలికి రావనేది దిష్టి చుక్క ఉద్దేశ్యం. కొంత మంది పెద్ద వాళ్లు కూడా తమ అరికాలులో కాటుక చుక్క పెట్టుకుంటారు దిష్టి తగలకుండా.


Also Read : ఈ తేదీలో పుట్టారా? ఈ మెటల్ ధరిస్తే అదృష్టం లభిస్తుందట!












Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.